శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 25, 2020 , 02:51:13

కరోనా నివారణపై కఠిన చర్యలు

కరోనా నివారణపై కఠిన చర్యలు

నమస్తే తెలంగాణ జోన్‌ బృందం: శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, గోషామహల్‌ ఎల్బీనగర్‌, మలక్‌పేట, చార్మినార్‌, నాంపల్లి, మహేశ్వరం నియోజకవర్గంలో లాక్‌డౌన్‌ కొనసాగు తున్నది. మాదాపూర్‌లోని ప్రధాన కూడళ్ల వద్ద సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 30కి పైగా కార్లు, 100కి పైగా ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేయగా మరుసటి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్లు, ద్విచక్ర వాహనాలు కలిపి 40కి పైగా సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రోడ్లపైకి వచ్చిన ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. శేరిలింగంపల్లిలో మంగళవారం ఉదయం ప్రజలు కూరగాయల, పాలు, కిరాణా సామగ్రి, నిత్యావసరాలు, మాంసం కొనుగోళ్లకు ఆయా దుకాణాల ఎదుట బారులు తీరారు. ప్రజలు గుమిగుడకుండా మీటరు దూరంలో ప్రత్యేకంగా బాక్సులు గీసి అదే వరుసలో కొనుగోళ్లు చేయాలని శేరిలింగంపల్లి సర్కిల్‌ పారిశుధ్య విభాగం ఎస్‌ఆర్‌పీలు, ఎస్‌ఎఫ్‌ఏలు, సిబ్బంది అవగాహన కల్పించారు. గచ్చిబౌలి ఔటర్‌ జంక్షన్‌లో పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. కారణాలు లేకుండా నిర్లక్ష్యంగా బయటకు వచ్చే వాహనాలను గుర్తించి ఇప్పటివరకు 50 వరకూ సీజ్‌ చేసినట్లు గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.  కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని కాలనీల్లో వీధులను శుభ్రం చేసిన అనంతరం క్లోరోహైడ్రెడ్‌ ద్రావణాలను పిచికారి చేశారు. చాంద్రాయణగుట్ట రియాసత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని భారతరత్న కాలనీ వాసులు మంగళవారం కాలనీ లోపలి వ్యక్తులు రోడ్లపైకి వెళ్లకుండా బయటి వ్యక్తులు కాలనీలోకి రాకుండా ఉండేందుకు తాళ్లను కట్టి రహదారిని మూసివేశారు. సంఘ సేవకుడు తాడెం శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో రక్షాపురంలోని శ్రీ ఉమా మహేశ్వరస్వామి దేవాలయంలో మంగళవారం ఉద యం లోక కల్యాణం కోసం మృత్యుంజయ మహాయజ్ఞం జరిపించారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ పరిధిలోని నార్సింగి మున్సిపాలిటీ మంచిరేవుల గ్రామస్తులు మంగళవారం తమ గ్రామాన్ని స్వీయనిర్బంధం చేశారు. గ్రామస్తులు తప్పా ఇతరులెవరూ తమ గ్రామంలోకి ఈనెల 31 వరకు రావద్దంటూ గ్రామ నలుదిక్కుల రహదారులను ముళ్లచెట్లతో మూసివేశారు. అత్యవసరమైతే తప్పా గ్రామస్థులు బయటకు వెళ్లరాదని చాటింపు వేశారు. కొత్త వ్యక్తులెవరు గ్రామంలోని రాకుండా ఉండేందుకు షిఫ్టుల వారీగా కాపలా ఉంటున్నారు.  ఖానాపూర్‌, కోకాపేట, వట్టినాగులపల్లి తదితర గ్రామస్తులు ఇదే బాట పట్టను న్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను రాజేంద్రనగర్‌ పోలీసులు సీజ్‌ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే 300ల వాహనాలను సీజ్‌ చేసినట్లు రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ తెలిపారు. అబిడ్స్‌లో విదేశాల నుంచి నగరానికి చేరుకున్న వారిలో సర్కిల్‌ కార్యాలయం పరిధిలోని నివసించే వారి 78 మంది జాబితాను అందుకున్న అధికారులు వారి నివాసాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు స్టాంపులను వేశారు. ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహించే స్టాఫ్‌ హేమలతతోపాటు మరో నలుగురు నర్సులు దవాఖానకు వస్తుండగా.. ట్యాంక్‌బండ్‌ వద్ద పోలీసులు అడ్డుకొని ఆపారు, తాము నర్సులని ఉస్మానియా దవాఖానకు వెళ్తున్నామని గుర్తింపు కార్డులు చూపించినా అవి చించేసారని నర్సింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధురాలు పి. హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ ఎమర్జెన్సీ పాస్‌లను అందిస్తేనే విధులకు హాజరవుతామని పేర్కొంటున్నారు. ఈ విషయమై డీఎంఈ, డీఎంహెచ్‌ఓ ఉన్నతాధికారులు, మెడికల్‌ జాక్‌ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం 25 ఆటోలను సీజ్‌ చేశామని ఇన్‌స్పెక్టర్‌ పీజీ రెడ్డి తెలిపారు. సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆరు ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశామని ఇన్‌స్పెక్టర్‌ సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. ఉస్మానియా దవాఖానలో సాధారణ రోజులలో రెండువేలకు పైగా ఉండే ఓపీ సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పట్టింది. దవాఖానకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి. నాగేందర్‌ పేర్కొన్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ లాక్‌డౌన్‌లో భాగంగా వెలవెలబోతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గత రెండు రోజులుగా ఒక బస్సు కూడా నడవలేదని రంగారెడ్డి రీజియన్‌ రీజినల్‌ మేనేజర్‌ బి. వరప్రసాద్‌ పేర్కొన్నారు. కూరగాయల ధరలు పెంచి అమ్ముతున్న సరూర్‌నగర్‌ రైతుబజార్‌లోని వ్యక్తులను అరెస్టు చేశారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తన నివాసంలో సతిమణి కమలా సుధీర్‌రెడ్డితో పాటుగా కొందరు మహిళలతో కలిసి నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు శానిటైజర్లను తయారీ చేసే పనులకు పూనుకున్నారు. కొత్తపేట చౌరస్తాలో లాక్‌డౌన్‌ నిబంధనలను దిక్కరించి రోైడ్లపైకి వచ్చిన 5 కార్లు, 8 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని 4గురిపై సరూర్‌నగర్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. నాగోలు డివిజన్‌ జనప్రియ ఎన్‌క్లెవ్‌, ఇంద్రప్రస్థ కాలనీ, రాక్‌టౌన్‌,  బృందావన్‌ కాలనీవాసులు రోడ్లకు అడ్డుగా చెట్లు, కట్టెలను ఏర్పాటు చేసి తమ కాలనీలోకి ఎవ్వరికీ ప్రవేశం లేదని ఏర్పాటు చేశారు. సహారా స్టేట్స్‌ ప్రాంతానికి విదేశాల నుంచి వచ్చిన నలుగురి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు పరిశీలన చేశారు. వారిని ఇంటిలోనే క్వారంటైన్‌ చేశారు. మలక్‌పేట నియోజకవర్గంలో పరిధిలోని మలక్‌పేట, సైదాబాద్‌, చాదర్‌ఘాట్‌, మాదన్నపేట పోలీస్‌స్టేషన్ల పరిధిల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు చేసి వాహనదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.దిల్‌సుఖ్‌నగర్‌, మూసారాంబాగ్‌, నల్గొండ చౌరస్తా, చాదర్‌ఘాట్‌ సర్కిల్‌ తదితర ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి ప్రయాణికులను తరలిస్తున్న ఆటోలు, ట్యాక్సీలను సీజ్‌ చేస్తున్నారు. మాదన్నపేట పీఎస్‌ పరిధిలో 3 ఆటోలు, 25 ద్విచక్ర వాహనాలు, కారును సీజ్‌ చేశారు. సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌ డివిజన్ల పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించి వారి నివాస పరిసరాల పరిధిలో కోవిడ్‌-19 నివారణ రసాయనాలను పిచికారి చేశారు. మహేశ్వరం మండల పరిధిలోని కొత్తగూడ, కందుకూరు, జైత్వారం, పులిమామిడి, దావుద్‌గూడ, పెద్దమ్మతండ, దన్నారం, చిప్పలపల్లి, మురళీనగర్‌, బాచుపల్లి, నేదునూరు, దాసర్లపల్లి, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ. దెబ్బడగూడ, సార్లరావులపల్లి, అన్నోజిగూడ, బేగరికంచె, మీర్‌ఖాన్‌పేట్‌, ఆకులమైలారం, గుమ్మడవెల్లి, బేగంపేట్‌, తిమ్మాపూరు, మాదాపూరు, జబ్బారుగూడ, రాచులూరు, కటికపల్లి, లేమూరు, సరస్వతిగూడ, బైరాగిగూడ, గూడూరు, కొత్తూరు, అగర్‌మియగూడ, గ్రామాలతో పాటు అనుబంధ గ్రామాలకు రాకపోకలను బంద్‌ చేశారు. అదే విధంగా పోలీసులు హైదరాబాద్‌ శ్రీశైలం రహదారిపై కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వాహనాలు వెళ్లకుండా కట్టడి చేశారు. మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌ పూలమార్కెట్‌ బుధవారం నుంచి ఈ నెల 31 వ తేదీ వరకు మూసి ఉంటుందని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. అదే సమయంలో గుడిమల్కాపూర్‌  కూరగాయల మార్కెట్‌  మాత్రం తెరచి ఉంటుందని అన్నారు. మంగళవారం ఈ మేరకు అత్యవసరంగా ఏర్పాటు చేసిన పాలక మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు పూలు కొనడానికి రావద్దని ఆయన సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ను తరమికొట్టేందుకు ప్రజలు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.  విజయనగర్‌ కాలనీ దేవునికుంట శ్రీ వేంకటే శ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించారు. 


logo