మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 23, 2020 , 23:57:57

అతిక్రమిస్తే చర్యలు తప్పవు

అతిక్రమిస్తే చర్యలు తప్పవు

  • తప్పక పాటించాలి    నిత్యావసరాల కృత్రిమ కొరతపై నిఘా..
  • కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు   గ్రామాలు, మున్సిపాలిటీల్లో అనునిత్యం శానిటేషన్‌
  • విస్తృతస్థాయి సమావేశంలో కలెక్టర్‌ డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు

మేడ్చల్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడి చర్యలలో భాగంగా ప్రభుత్వం ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్నాయని, లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమవారం కీసరలోని కలెక్టర్‌ కార్యాలయంలో అడిషనల్‌ జాయింట్‌ కలెక్టర్లతో కలిసి డీసీపీలు, ఏసీపీలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన కలెక్టర్‌ లాక్‌డౌన్‌ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మార్చి 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని ప్రతి పౌరుడు సహరించాలన్నారు. 

అధిక ధరలకు విక్రయించినా.. కృత్రిమ కొరత సృష్టించినా చర్యలు తప్పవు

కొందరు వ్యాపారులు కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఇలాంటి వారిపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరతను సృష్టించిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే కరోనా లక్షణాలున్న వ్యక్తులు వెంటనే 104కు గాని, కలెక్టరేట్‌లో మెడికల్‌, పోలీసు, రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నంబర్‌ 0841 8297820, 9492409781లకు ఫోన్‌చేసి వారి సూచనల మేరకు దవాఖానలో గానీ, క్వారంటైన్‌లో గాని చేరాలని కలెక్టర్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూం నంబర్‌ 24 గంటలు పని చేస్తుందని తెలిపారు. 

క్రమం తప్పకుండా శానిటేషన్‌..

జిల్లాలోని 61 గ్రామాల్లో, 9 మున్సిపాలిటీల్లో, 4 కార్పొరేషన్లలో క్రమం తప్పకుండా శానిటేషన్‌ పనులను నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు క్రిమి కీటకాల నివారణకు మందులను పిచికారి చేయాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఈనెల 31వ వరకు పట్టణాలు, గ్రామాల ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్‌ సరుకులు, నగదు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్‌ కలెక్టర్లు విద్యాసాగర్‌, జాన్‌ శ్యాంసన్‌, డీఆర్వో మధుకర్‌ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, డీసీపీలు, ఏసీపీలు, మున్సిపల్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు. logo
>>>>>>