బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 23, 2020 , 23:53:40

నిర్బంధం..మనమంచికే !

నిర్బంధం..మనమంచికే !

  • ఓ చోట పాక్షికం..మరోచోట లాక్‌డౌన్‌ విజయవంతం
  • రోడ్లపైకి రావద్దంటూ పోలీసుల అవగాహన, కౌన్సెలింగ్‌
  • అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలు సీజ్‌..చలాన్ల విధింపు
  • కొన్నిచోట్ల నిత్యావసరాల కోసం  బారులు
  • సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సుల కోసం ప్రజల పడిగాపులు

జోన్‌ బృందం, నమస్తేతెలంగాణ: కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ విజయవంత మైంది. కొందరు అతిక్రమించగా.. మరికొందరు బాధ్యతగా వ్యవహరించి ఇంటికే పరిమితమయ్యారు. నగరంలోని పలుచోట్ల ప్రజలు తమ సొంత ఊళ్లకు పయనమవుతుండడంతో ఆయా ప్రాంతాలలో రద్దీ కనబడింది. ట్రాఫిక్‌ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి కరోనాపై అవగాహన కల్పించారు. ఆయా చోట్ల ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి రోడ్లపైకి వచ్చిన వాహనాలను అత్యవసరమైతే వదిలేస్తూ మిగతావి సీజ్‌ చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒకటికి రెండుసార్లు రహదారులపై కనిపించిన వాహనదారులకు అపరాధ రుసుము విధించారు. తెరిచిన దుకాణాలను మూసివేయించి ఆయా దుకాణాదారులను స్టేషన్‌కు తరలించి అనంతరం వదిలిపెట్టారు.  లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డుకు భారీగా చేరుకోవడంతో రద్దీ కనిపించింది. ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. 

అప్రమత్తంగా ఉండాలి

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ కె. రవికుమార్‌ సిబ్బందికి సూచించారు. సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వారాసిగూడలో  ప్లకార్డులతో డిప్యూటీ కమిషనర్‌ రవికుమార్‌, చిలకలగూడ ఇన్‌స్పెక్టర్‌ ఏసీ బాలగంగిరెడ్డి, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు.  తుకా రాంగూట్‌ శ్రీప్రసన్న వేంకటేశ్వర ఆలయంలో 25వ తేదీ నుంచి జరగాల్సిన యజ్ఞాలు, హోమాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ పేర్కొన్నది. తార్నాక పరిధిలోని నల్ల కుంటలో ట్రాఫిక్‌ సీఐ నరేందర్‌రావు వాహన దారులను అడ్డుకొని అత్యవసరం లేకున్నా బయట తిరిగే వారిని హెచ్చరించి పంపించారు.  

నిత్యావసరాల కోసం బారులు

సనత్‌నగర్‌ డీ-మార్ట్‌లో కొనుగోలుదారుల తాకిడి అధికంగా కని పించింది. అందరిని ఒకేసారి మార్ట్‌లోకి అనుమతించకుండా ఏకకాలంలో 25 మంది ప్రవేశానికి అవకాశం కల్పించి 20 నిమిషాల్లో కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. కరోనా నియంత్రణకు మాల్‌ ర్వాహకులు చేపట్టిన విధానం బాగుందని కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేశారు.  

కూకట్‌పల్లి హుడా ట్రక్‌ పార్కులో వందల సంఖ్యలో లారీలు నిలిచిపోయాయి. రోడ్డెక్కిన 30 ఆటోలను సీజ్‌ చేశామని సీఐ లక్ష్మీనారాయణరెడ్డి తెలిపారు. కూకట్‌పల్లి మెట్రో షాపింగ్‌మాల్‌తోపాటు డీమార్ట్‌, రత్నదీప్‌, పాలమార్‌ స్టోర్‌ల వద్ద జనం రద్దీగా కనిపించారు. ఏసీపీ సురేందర్‌రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.  పారిశ్రామికవాడలో మూడు ఫ్యాన్‌ విడిభాగాల పరిశ్రమలలో కార్మికులు పనిచేస్తున్నట్లు గమనించి ఆయా కంపెనీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కరోనా కట్టడికి  ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం  సూచిస్తే  షోరూమ్‌లు,  కార్ఖానాలు, వ్యాపార కేంద్రాలు తెరిచి ఉండటం బాధాకరమని, చిన్నపాటి నిర్లక్ష్యం  సమాజం మొత్తానికి చేటు తెచ్చి పెడుతుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాంక్ష వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు రామారావు ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ సిబ్బందికి ఆహారం, మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు అందుబాటులోకి తెస్తున్నట్లు కూకట్‌పల్లి జడ్సీ వి.మమత అన్నారు. జోన్‌ పరిధిలోని ఐదు సర్కిళ్లలో విదేశాలనుంచి వచ్చినవారు 615 మంది ఉండగా వారందరికీ ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. 

చిట్కాలు పాటించాలి

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలని ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం తన నివాసంలో ఎమ్మెల్యే తన కుమారుడితో కలిసి యోగాసనాలు వేశారు.   


logo
>>>>>>