మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 23, 2020 , 23:46:14

బయటికొస్తే.. బండి ఠాణాకే

బయటికొస్తే.. బండి ఠాణాకే

  • నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కినవాహనాలు సీజ్‌
  • రోడ్లపై సెల్ఫీ దిగితే కేసులు
  • గాంధీ దవాఖానలో నేటి నుంచి ఓపీ సేవలు బంద్‌
  • హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌లు అంజనీకుమార్‌, మహేశ్‌భగవత్‌,  సజ్జనార్‌

లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను సీజ్‌ చేస్తామని పోలీసులు ప్రకటించారు. అత్యవసర పరిస్థితుల్లో  ద్విచక్రవాహనంపై ఒక్కరికి, కారులో ఇద్దరు ప్రయాణించడానికి మాత్రమే అనుమతిస్తామన్నారు. ఐదుగురికి మించి రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రోడ్లపై సెల్ఫీలు దిగితే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కాగా తొమ్మిది రోజుల లాక్‌డౌన్‌లో భాగంగా తొలిరోజు సరుకులు తీసుకోవడానికి ప్రజలు ఉదయం వేళ భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు.  సాయంత్రానికల్లా ట్రాఫిక్‌ రద్దీ తగ్గింది.  లాక్‌డౌన్‌, ప్రజా రవాణా బంద్‌ నేపథ్యంలో గాంధీ దవాఖానలో నేటి నుంచి ఓపీ సేవలు నిలిపివేస్తున్నారు. అలాగే హెచ్‌ఎండీఏ తార్నాక కార్యాలయంలోకి సందర్శకుల అనుమతిని నిలిపివేశారు. 

-సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ


బయట తిరిగితే కఠిన చర్యలు

  • సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌

 రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ హెచ్చరించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌తో కలిసి ఆయన గచ్చిబౌలీ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 3671 మందిని క్వారంటైన్‌కు పంపామని వారు తమ గడువు తీరకముందే ఇతర ప్రాంతాలకు సంచరించినట్లు తెలిస్తే మాత్రం చాలా తీవ్రమైన చర్యలు ఉండడంతో పాటు వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కొంత మంది కుంటి సాకులు చెపుతూ తిరుగుతున్నట్లు మా తనిఖీల్లో బయటపడిందని అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీపీలు విజయ్‌కుమార్‌, వెంకటేశ్వరరావు, అదనపు డీసీపీ గౌసు మొయినుద్దీన్‌, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

పాతనగరంలో సీపీ అంజనీకుమార్‌ పర్యటన

చార్మినార్‌ : ప్రభుత్వం విధించిన ఆంక్షలను దాటుకుంటూ బయటకువస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు, వ్యాపార సముదాయాలు, నగరంలోని పరిస్థితులను పరిశీలిస్తూ సోమవారం పాతనగరంలో పర్యటించారు. చార్మినార్‌ సమీపంలోని మూసివేసిన మార్కెట్‌ ప్రాంతాల పరిస్థితి, వాహనదారుల రాకపోకలు, శాంతి భద్రతలు, ముస్లింల షబ్బే బరాత్‌ నేపథ్యంలో ఆయన చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. షబ్బే బరాత్‌ నేపథ్యంలో ముస్లిం సోదరులు ఇండ్లల్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్త్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


logo
>>>>>>