శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 23, 2020 , 00:56:39

‘కరోనా’ కట్టడికి సంపూర్ణ మద్దతు..

‘కరోనా’ కట్టడికి సంపూర్ణ మద్దతు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఆదివారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జనతా కర్ఫ్యూకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలిపి తమ ఇండ్లకే పరిమితమయ్యారు. రోడ్లపై పోలీసులు, మీడియా, జీహెచ్‌ఎంసీ, ఆరోగ్య శాఖకు సంబంధించిన అత్యవసర విభాగాల అధికారులు, సిబ్బంది మాత్రమే కన్పించారు. కొందరు రోడ్లపైకి రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ వాళ్లను అపి, ఈ కర్ఫ్యూ అనేది ప్రతి ఒక్కరి బాగు కోసమంటూ వారికి నచ్చజెబుతూ వారిని ఇంటికి తిరుగు ముఖం పట్టించారు. కొన్ని చోట్ల దండం పెడుతూ బయటకు వచ్చిన వారికి కనువిప్పు కలిగేలా విషయాన్ని వివరించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ తమ బృందంతో అసెంబ్లీ ప్రాంతంలో కొద్ది సేపు పర్యటించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ కోవెడ్‌-19 వైరస్‌తో మనమంతా యుద్ధ్దం చేస్తున్నాం.. సీఎం ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా ఇండ్లకే పరిమితమయ్యారన్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్‌, లా అండ్‌ అర్డర్‌ పోలీసులు బందోబస్తులో ఉన్నారని, దూర ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో వచ్చిన వారి కోసం ప్రత్యేకంగా రవాణా సౌకర్యాన్ని కల్పించామన్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చిన వారి కోసం ఆరు సెట్విన్‌ బస్సులను గోపాలపురం పోలీసులు ఏర్పాటు చేశారు. కరోనా విషయంలో పుకార్లు సృష్టించి వాటిని సోషల్‌మీడియా ద్వారా సర్క్యూలేట్‌  చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేశారో వారిపై అపిడెమిట్‌ డిసీజెస్‌ యాక్టు 1987పై కేసులు నమోదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని సీపీ తెలిపారు. ఒకరికొక్కరు దూరంగా ఉంటూ కరోనా వైరస్‌ను రూపు మాపేందుకు తోడ్పాటునందించాలని సీపీ కోరారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు తన బృందంతో అసెంబ్లీ వద్ద ఆదివారం ఉదయం పర్యటించి కరోనాను ఓడిద్దామంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.  

రోడ్లపైకి వచ్చిన వారికి కౌన్సెలింగ్‌ 

జనతా కర్ఫ్యూతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. ట్రాఫిక్‌, లా అండ్‌ అర్డర్‌ పోలీసులు మాత్రం రోడ్లపైనే ఉన్నారు. కార్లు, ద్విచక్రవాహనాలపై రోడ్లపైకి వచ్చే వాళ్లను ఆపి, వాళ్లకు పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అక్కడక్కడ క్యాబ్‌లు తిరుగుతుండటంతో పోలీసులు ఆపారు. పంజాగుట్ట ఠాణా పరిధిలో నలుగు క్యాబ్‌లను పోలీసులు ఆపి, వాళ్లకు కౌన్సెలింగ్‌ చేశారు, అలాగే నగరంలోని వివిధ ప్రాంతాలలో రోడ్లపైకి వచ్చిన వాహదారులను ఆపేసి కౌన్సెలింగ్‌ నిర్వహించిన అనంతరం వాళ్లను పంపించేశారు. బేగంపేట్‌ ప్రాంతంలో రోడ్డుపై ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి జలుబు, జ్వరంతో బాధపడుతుండడంతో బేగంపేట్‌ ట్రాఫిక్‌ పోలీసులు 108కు సమాచారం ఇచ్చి, అతడిని చికిత్స నిమిత్తం దావఖానకు తరలించారు.  

ఆన్‌లైన్‌ డెలివరీ యాప్స్‌ సేవలు బంద్‌

జనతా కర్ఫ్యూకు అన్ని హోటల్స్‌ మద్దతు తెలిపాయి. దీనికి తోడు పుడ్‌ డెలివరీ యాప్స్‌ నిర్వాహకులు కూడా తమ సేవలను నిలిపివేశారు. అలాగే ఈకామర్స్‌ వెబ్‌సైట్లలో కొనుగోలు చేసిన వారి వస్తువుల డెలివరీకి సంబంధించిన సేవల కూడా బంద్‌ అయ్యాయి. కొరియర్‌ సంస్థలు తమ సేవలు బంద్‌ చేసుకున్నాయి. అయితే నిన్ననే వస్తువులను తమ చేతిలోకి తీసుకొని ఆదివారం డెలివరీ చేయాలనుకున్న డెలివరీ బాయ్స్‌ ఒకరిద్దరు రోడ్లపైకి రావడంతో పోలీసులు అలాంటి వారిని ఇంటికి పంపించేశారు. ఆన్‌లైన్‌ సేవలు అందించే పుడ్‌ డెలివరీ యాప్స్‌లో మేం ఈ రోజు సేవలు బంద్‌ చేస్తున్నాం. మీరు మీ కుటుంబంతో ఇంట్లో ఉండండి.. మా సిబ్బంది కూడా వారి కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉంటారని, మన కోసం రోడ్లపై ఉంటూ సేవలు అందిస్తున్న వారికి చప్పట్లు కొట్టి వారికి మద్దతు తెలుపుదామంటూ హోం పేజీలో లోగోతో మేసేజ్‌లు పెట్టారు. ఇదిలా ఉండగా బైక్‌లను కిరాయికి ఇచ్చే సంస్థలు కూడా ఈ నెల 31 వరకు తమ సేవలను నిలిపివేశాయి. 

 తప్పుడు ప్రచారాలు చేస్తే ఏడాది జైలు : సీపీ మహేశ్‌ భగవత్‌ 

 మన్సూరాబాద్‌, మార్చి 22: కరోనా వైరస్‌పై ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. కరోనా కట్టడి కోసం చేపట్టిన జనతా కర్ఫ్యూ ను పరిశీలించిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంపు కార్యాలయంలో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌పై ట్విట్టర్‌, వాట్సఫ్‌ తదితర సోషల్‌ మీడియాలో రూమర్లు సృష్టించే వారిపై  ఒక సంవత్సరం జైలు శిక్ష విధింపజేస్తామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసిన నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. జనతా కర్ఫ్యూకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించి విజయవంతం చేశారని సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.  రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 22 చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.   విదేశాల నుంచి వచ్చే వారి  వివరాలను డయల్‌ 100 లేదా రాచకొండ కమిషనరేట్‌ వాట్సాప్‌ నంబర్‌  94906 17111కు ఫోన్‌ చేసి పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.  అంతేకాకుండా డూప్లికేట్‌ శానిటైజర్లు తయారు చేసిన కేసు లో చర్లపల్లిలో కొందరిని అరెస్టు చేసి రూ. 40 లక్షల శానిటైజర్లు.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఆరుగురిని అరెస్టు చేసి రూ. కోటి విలువైన డుప్లికేట్‌ శానీటైజర్లను స్వాధీనం చేసుకున్నామని  తెలిపారు. కరోనా కట్టడి కోసం అందరూ కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. 

 వైద్యుల సేవలు ఎనలేనివి.. 

  • కరోనా నియంత్రణలో సేవలందిస్తున్న వివిధ శాఖలకు 
  • చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపిన సీపీ, జిల్లా కలెక్టర్‌

కొండాపూర్‌, మార్చి 22 : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా నిరంతరం సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, డిజాస్టర్‌ టీమ్స్‌, ఇతర శాఖల అధికారులకు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మాదాపూర్‌లోని సైబర్‌ టవర్స్‌ జంక్షన్‌లో సైబారాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, ఇతర పోలీసు అధికారులతో కలిసి చప్పట్లతో కృతజ్ఞతలు తెలిపారు. గత నెల రోజులుగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ దవఖానల్లో నిరంతరం వైరస్‌ను అరికట్టేందుకు పోరాడుతున్న వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎస్‌ఎం విజయ్‌ కుమార్‌, ఏడీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్‌బీ ఏసీపీ రవికుమార్‌, మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.   

కరోనా అనుమానితుల ఇండ్లు జియో ట్యాగింగ్‌ 

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : : రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కరోనా అనుమానితుల ఇళ్లను జియో ట్యాగింగ్‌ చేశారు. ఐసోలేషన్‌లో ఉన్న వారందరినీ, వారి కదలికలను నిత్యం గమనించేందుకు ఈ జియో ట్యాగింగ్‌ ద్వారా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తారు. టీఎస్‌ కాప్‌లో ఉన్న అప్లికేషన్‌ ద్వారా విదేశాల్లో నుంచి వచ్చి ఐసోలేషన్‌లో ఉన్న వారి ఇంటిని జియో ట్యాగ్‌ చేస్తారు. దీంతో వారి ఇంటి నంబరు, ఇంట్లో ఎంత మంది నివాసం ఉంటున్నారు. విదేశాల నుంచి ఎప్పుడు వచ్చారు. ఏ దేశం నుంచి వచ్చారు. వారు ఎన్ని రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి ఇలా అన్ని వివరాలను పోలీసులు అప్లికేషన్‌లో భద్రపరుస్తున్నారు.  ఈ జియో ట్యాగ్‌ను పెట్రోలింగ్‌, గల్లీ గస్తీ సిబ్బంది ట్యాబ్‌లకు అనుసంధానం చేశారు. వీటి ఆధారంగా చేసుకుని పెట్రోలింగ్‌ సిబ్బంది వారి విధుల్లో భాగంగా ఐసోలేషన్‌లో ఉన్న వారి కదలికలు గురించి తెలుసుకుంటారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఏలా ఉంది.. ఐసోలేషన్‌లో వారి ఏలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ ఇంట్లోని వారు ఏలాంటి వైద్య సేవలు పొందుతున్నారు. ఇలా అన్నింటిని పెట్రోలింగ్‌ సందర్భంగా పరిశీలించి పోలీసులు అప్రమత్తమవుతారు. 


logo