మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 23, 2020 , 00:52:31

సంఘీభావ సంకేతం

సంఘీభావ సంకేతం

  • చప్పట్లతో దద్దరిల్లిన నగరం
  • కరోనా కట్టడికి పనిచేసే వారందరికి కృతజ్ఞతలు
  • స్వచ్ఛందంగా పాల్గొన్న జనం
  • సోషల్‌ మీడియాలోనూ  స్పందన

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నిరంతరం శ్రమిస్తున్న అధికారులు, సిబ్బందిని నగరవాసులు చప్పట్లతో అభినందించారు.  నగరవాసులంతా ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఒక్కసారిగా బయటకొచ్చి ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేశారు. జనతా కర్ఫ్యూకు నగరవాసుల నుంచి విశేష స్పందన వచ్చింది. స్వచ్ఛందంగా ఎవరికివారు ఇంట్లోనే ఉండి ప్రభుత్వ పిలుపునకు మద్దతిచ్చారు. భయంకర వ్యాధి కరోనా కట్టడి కావాలంటూ నినదించారు. అపార్ట్‌మెంట్‌లు, బాల్కనీలు, టెర్రస్‌, కిటికీల వద్ద కుటుంబ సభ్యులు చప్పట్లతో  కరోనా కట్టడిపై ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి జేజేలు పలికారు. జనం ఒక్క తాటిపైకి వచ్చి క్రమశిక్షణతో జనతా కర్ఫ్యూను విజయవంతం చేసి సంఘీ భావ సంకేతాన్ని ప్రదర్శించడం ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. 

 చిన్నారుల నుంచి వృద్ధుల వరకు....

చిన్నారుల నుంచి వృద్ధుల వరకు చప్పట్లు కొడుతూ సం దడి చేశారు. కొంతమంది చిన్నారులు పల్లెం, గ్లాసులు, స్లేట్స్‌పై కర్రలతో చప్పుడు చేస్తూ కరోనా కట్టడికి సేవలందిస్తున్న వైద్యులకు జేజేలు పలికారు. కాలనీలన్నీ చప్పట్లతో మార్మోగాయి. మరోవైపు కార్యాలయాలు, అత్యవసర సేవలందించే విభాగాల వద్ద ఉద్యోగులు చప్పట్లు కొడుతూ వైద్య సేవలకు సంఘీభావం పలికారు. ఇంకోవైపు వాట్పాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో సంఘీభావ సంకేతానికి సంబంధించిన వీడియోలు షేర్‌ చేశారు. సినీతారల నుంచి కూడా స్పందన బేషుగ్గా వచ్చింది. మొత్తంగా హైదరాబాదీలు జనతా కర్ఫ్యూను క్రమశిక్షణతో పాటించి.. దుఖ సమయంలో ఒక్కటిగా ఉండి.. కరోనాపై కదం తొక్కడం విశేషం. logo
>>>>>>