గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 23, 2020 , 00:49:35

అంతా నిశ్యబ్దం..

అంతా నిశ్యబ్దం..

  • జనతా కర్ఫ్యూకు ప్రజల సంపూర్ణ మద్దతు
  • నిర్మానుష్యంగా రోడ్లు, కాలనీలు
  • అత్యవసర సేవల్లో పోలీస్‌, ఆరోగ్యం, జీహెచ్‌ఎంసీ సిబ్బంది
  • చప్పట్లతో ప్రజల మద్దతు  

(నమస్తే తెలంగాణ బృందం) : కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపునకు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, వాణిజ్య కేంద్రాలు, పరిశ్రమలతో పాటు అన్ని కార్యకలాపాలు నిలిపివేశారు. మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు ఇతర వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇంట్లోకి చేరుకుని మరికొందరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండానే ఉండిపోయారు. సాయంత్రం 5గంటలకు ఇండ్లపైకి, ఇంటి ముందు నిలబడి అత్యవసర సేవలందిస్తున్న డాక్టర్లు, పోలీసులు ఇతర సిబ్బందిని అభినందిస్తూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. 

సేవలు భేష్‌...

 ప్రజలంతా జనతా కర్ఫ్యూలో భాగంగా ఇంటివద్దనే ఉంటే జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీస్‌, ఆరోగ్య శాఖల అధికారులు తమతమ సేవల్లో నిమగ్నమయ్యారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రధాన రోడ్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, హోటళ్లు, జనసమూహం ఉండే ప్రాంతాల్లో రసాయనాలను పిచికారి చేశారు. అలాగే పారిశుధ్య విభాగం సిబ్బంది రోడ్లపై చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ పోలీసులు రోడ్లపై పహారాకాస్తూ జనతా కర్ఫ్యూలో ప్రజలు భాగస్థులు కావాలని కోరారు. ఎక్కడా జనసమూహాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది విదేశీ ప్రయాణాలు ముగించుకుని వచ్చిన ఇండ్లకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. జలమండలి సిబ్బంది సీవరేజీ సమస్యలను పరిష్కరించారు. ప్రజలంతా ఇంటికే పరిమితమైనా ప్రభుత్వ సిబ్బంది మాత్రం సేవలందించడంతో ప్రజలంతా వారి సేవా నిరతికి ధన్యవాదాలు చెబుతున్నారు.


logo
>>>>>>