శనివారం 28 మార్చి 2020
Hyderabad - Mar 23, 2020 , 00:30:33

జనతా కర్ఫ్యూకు స్వచ్ఛందంగా ముందుకు

జనతా  కర్ఫ్యూకు  స్వచ్ఛందంగా ముందుకు

  • ఇండ్లకే పరిమితమైన జనం
  • నిర్మానుష్యంగా రహదారులు, వ్యాపారకేంద్రాలు
  • ఇండ్లల్లో టీవీలకు అతుక్కుపోయిన ప్రజలు

కరోనా వైరస్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ప్రధానమంత్రి, సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు స్వీయ నిర్బంధానికి పట్టణాలు, పల్లెలు ఏకమై జనతా కర్ఫ్యూ సక్సెస్‌ చేశారు.  ఉదయం 7 గంటల నుంచి స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, మార్కెట్లు, హోటళ్లు, ఇతర ప్రభుత్వ , ప్రైవేట్‌ సంస్థలు బంద్‌ పాటించాయి. అన్ని రవాణా వ్యవస్థల రద్దుతో జనజీవనం స్తంభించింది. జనసంచారం లేక జాతీయ, అంతరాష్ట్ర రహదారులు, అవుటర్‌ రింగ్‌రోడ్డు, విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు బోసిపోయాయి. రోడ్లపై పోలీసులు తప్పా ఎవరూ కనపడలేదు.  హైటెక్‌సిటీ, ఐటీ కారిడార్‌లు బోసిపోయాయి. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా మారి వెలవెలబోయాయి. వారాలతో సంబంధం లేకుండా 24/7 తమ కార్యకలాపాలు కొనసాగించే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) సంస్థలు సైతం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నాయి. ఐటీ కారిడార్లు, మాదాపూర్‌ సైబర్‌ టవర్స్‌, ఐకియా రోడ్డు, బయోడైవర్సిటీ జంక్షన్లు ఇలా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు సైతం ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇలాగే కొనసాగితే కరోనాను అడ్డుకోవడంలో తెలంగాణ రాష్ట్రం 100 శాతం విజయం సాధిస్తుందని ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ సేవలు మినహా ఆర్టీసీ, ప్రైవేట్‌ సేవలు నిలిపోయాయి. మెడికల్‌ దుకాణాలు తెరిచి ఉంచారు. కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలని, తమ తమ ఇండ్లలో నుంచి బయటకు రావద్దని పోలీసులు రోడ్లపైకి వచ్చిన పలువురికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించి వేశారు.  వైద్య విభాగం, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు, మీడియా, ఇతర అత్యవసర విభాగాల్లో సేవలందిస్తున్న వారికి ప్రభుత్వ సూచన మేరకు రాజేంద్రనగర్‌, అబిడ్స్‌, నాంపల్లి, కార్వాన్‌, ముషీరాబాద్‌, నియోజకవర్గవాసులు  కొందరు తమ నివాసాల ఎదుట, మరికొందరు బాల్కనీలలో సాయంత్రం 5 గంటలకు 5 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూ కృతజ్ఞతలు తెలిపారు. నేను సైతం అన్న రీతిలో కరోనా కట్టడికి జనకర్ఫ్యూకు మద్దతుగా ఎండ దంచి కొట్టింది. ఎక్కడ చల్లదనం కనిపించలేదు. కరోనా మహమ్మారిని తరిమే వేడి వాతావరణం కన్పించింది. ఇండ్లలో ఉక్కబోతతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. 

-  జోన్‌ బృందం, నమస్తే తెలంగాణ


logo