శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 22, 2020 , 04:12:01

అమ్మకు తోడుగా..

అమ్మకు తోడుగా..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఉదయం నిద్ర లేచిన మొదలు.. స్కూల్‌కు వెళ్లే వరకు అమ్మ అంతా హడావిడిగానే ఉంటుంది. టిఫిన్‌ తయారీ, బాక్స్‌ సర్దడం.. తదితర పనులతో వారు బిజీబిజీగా గడుపుతారు. స్కూలు వ్యాన్‌ రాగా నే పిల్లలు వెళ్లిపోతారు. అంతటితోనే అమ్మ పని అయిపోయిందని భావిస్తారు చిన్నారులు.  కానీ ఆ తర్వాతే అమ్మ శ్రమ మొదలవుతుందని వారికి తెలియదు. కొంతమంది తల్లులు.. పిల్లలను స్కూల్‌కు పంపించాక.. త్వరత్వరగా పనులు ముగించుకుని ఉద్యోగానికి పరుగులు తీస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే నగరంలో ప్రతి అమ్మది ఓ సాహసమే. ఈ పరిస్థితుల్లో అమ్మకు చేదోడు వాదోడుగా పిల్లలు నిలుస్తున్నారు. ప్లేట్స్‌ కడగడం.. బుక్స్‌ సర్దడం.. కూరగాయలు తరగడం.. బట్టలు ఉతికాక ఆరవేయడం.. బట్టలు మడతపెట్టుకోవడం తదితర పనులను చేస్తూ కరోనా భారం అమ్మలపై పడకుండా అండ గా నిలుస్తున్నారు.  

పనిమనుషులు దూరంగా.. 
ఇంట్లో పనులు చేయడానికి నగరంలో సుమారు 80 శాతం ఇంటి యజమానులు పనిమనుషులపైనే ఆధారపడుతారు.  దంపుతులు ఉద్యోగాలు చేసేవారయితే పనిమనుషులు లేకుండా ఉండటం కష్టం. అలాంటిది కరోనా ప్రభావంతో పనిమనుషులు ఇండ్లలోకి రావ డం లేదు. కొంతమంది యజమానులు వారిని వద్దంటున్నారు. కొన్ని రోజులు తమ పనులు తామే చేసుకుంటామని వారికి తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో పనంతా గృహిణులపైనే పడుతుంది. అందుకే పిల్లలు చిన్న చిన్న పనుల్లో అమ్మనాన్నలకు సహకరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.  


logo