బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 21, 2020 , 23:59:17

ఆతిథ్య రంగానికి ఆటుపోట్లు

ఆతిథ్య రంగానికి ఆటుపోట్లు

  • దెబ్బకొట్టిన కరోనా
  • బుకింగ్స్‌ లేక విలవిలలాడుతున్న హోటళ్లు
  • వెలవెలబోతున్న ఫుడ్‌ కోర్టులు

హైదరాబాద్‌ అంటే ఆతిథ్యానికి కేరాఫ్‌ అడ్రస్‌. వ్యాపారులు, సినీతారలు, పర్యాటకులు ఇలా.. ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక నగరాన్ని సందర్శించాలనుకుంటారు. ఓ నాలుగైదు రోజులు ఇక్కడే విడిది చేయాలనుకుంటారు. కానీ కరోనా వైరస్‌ ప్రభావంతో ఆతిథ్య రంగం విలవిల్లాడుతున్నది. ఒకప్పుడు అతిథులు, సందర్శకులతో నిండిపోయిన హోటళ్లన్నీ ఇప్పుడు.. ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో దారుణంగా పడిపోయింది.  

సిటీబ్యూరో/ బంజారాహిల్స్‌/చందానగర్‌, గచ్చిబౌలి: కరోనా భయంతో ఆతిథ్య రంగం విలవిలలాడుతున్నది. ఆదాయం పడిపోయి హోటళ్లు, ఫుడ్‌ కోర్టులు, ఫుడ్‌ డెలివరీ సర్వీసుల పరిస్థితి దయనీయంగా మారింది. నగరంలో స్టార్‌, మధ్య తరహా హోటళ్లు 1400 పైగా ఉన్నాయి. ఇందులో సింహాభాగం  ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. కొన్ని స్టార్‌ హోటళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 15 శాతానికి మించకపోగా, మధ్య రకం వాటిలో 4 -6 శాతం మాత్రమే. కొన్ని హోటళ్లు జీరో ఆక్యుపెన్సీని సైతం చవి చూస్తున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

కానరాని బల్క్‌ బుకింగ్స్‌.. 

నగరంలోని చాలా హోటళ్లు బల్క్‌ బుకింగ్‌ ద్వారానే ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. అంతర్జాతీయ సదస్సులు, సెమినార్లు, వేడుకలు, పార్టీలు, ఫంక్షన్లు, సినిమా షూటింగ్స్‌, వీటికి ప్రధాన ఆదాయవనరుగా ఉంటాయి. రోజుల తరబడి ఆయా హోటళ్ల్ల గదులు, ఆహార పదార్థాలను బల్క్‌ బుకింగ్‌ పద్ధతిలో ఆర్డర్‌ చేస్తారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇవన్నీ రద్దు చేసుకున్నారు. ఒకప్పుడు అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కోసం ఎగబడేవారు. ఇప్పుడు హోటళ్లన్నీ ఎవరూ వస్తారని వేచి చూస్తున్నట్లు దర్శనమిస్తున్నాయి.

  • మాదాపూర్‌, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లోని  హోటళ్లలో ఐటీ రంగ నిపుణులు, ఉద్యోగులు, పర్యాటకులు విడిది చేస్తుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు. కంపెనీలను విస్తరించాలనుకునే వారు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక కంపెనీల సమావేశాల కోసం ఢిల్లీ, ముంబైల నుంచి వచ్చే వారు సైతం ఇక్కడి హోటళ్లలోనే బస చేస్తారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీరందరికీ రాకపోకలపై ఆంక్షలు విధించడంతో కొన్ని హోటళ్లలో బుకింగ్స్‌ జీరో ఆక్యుపెన్సీకి పడిపోయింది.
  • బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ -2లోని ఓ ప్రముఖ హోటల్‌లో 209 రూములు, 45 సూట్‌ రూములున్నాయి.  ఎక్కువగా విదేశీయులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు బస చేస్తుంటారు. సాధారణంగా రూములు దొరకాలంటే ఇబ్బందిగా ఉండే ఈ హోటల్‌ ఇప్పుడు.. గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. రోజుకు సరాసరిగా కేవలం 10 -12 శాతం ఆక్యుపెన్సీ రేషియో మాత్రమే ఉంటున్నది. 

నిర్వహణ భారం..

ఈ హోటళ్లన్నీ సెంట్రల్‌ ఏసీ సౌకర్యం గలవి కావడంతో విద్యుత్‌ బిల్లులు, నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇప్పుడు ఆదాయ వనరులు సమకూరడం లేదు. మరికొద్ది రోజులు ఇదే  పరిస్థితులుండే అవకాశముండడంతో చాలా హోటళ్లు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌కు సిద్ధపడుతున్నాయి. అలాగే ఆన్‌లైన్‌ ఫుడ్‌ ఆర్డర్స్‌ పైనా కరోనా ఎఫెక్ట్‌  పడింది.  12 గంటల్లో ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌కి 25 నుంచి 40 వరకు ఆర్డర్లు దొరికేవి. ఇప్పుడా సంఖ్య 10 నుంచి 15కు మించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బుకింగ్స్‌ పడిపోయాయి 

కరోనా ప్రభావంతో హోటళ్లలో బుకింగ్స్‌ దారుణంగా పడిపోయాయి. ఒకప్పుడు 80 శాతం గదులు బుక్కవ్వగా, తాజాగా 10 శాతం గదులు మాత్రమే. రోజు వారీ నిర్వహణ ఖర్చులు సైతం రావడం లేదు. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే నష్టాన్ని భరించడం కష్టమే.

 -రఘు, జీఎం ఆర్క్‌ బొటిక్‌, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ 

నిర్వహణ కష్టంగా ఉంది... 

కరోనా వల్ల గతంలో రోజుకు కనీసం రోజుకు సుమారు రూ.70 వేల గిరాకీ అయ్యేది. కానీ నేడు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు రావడం కష్టంగా ఉంది. 70 శాతానికి పైగా వ్యాపారం దెబ్బతింది. ఆన్‌లైన్‌ ఆర్డర్లు అస్సలు రావడం లేదు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు నిర్వహణ చాలా కష్టంగా ఉంది. 

-విజయ్‌భాస్కర్‌,  గ్రీన్‌ ట్రీట్‌ ఫుడ్‌ కోర్ట్‌ మేనేజర్‌

లక్ష్యం చేరుకోలేని పరిస్థితి

కరోనా ఎఫెక్ట్‌తో మాస్క్‌, గ్లౌస్‌లు పెట్టుకెళ్లినా కస్టమర్స్‌ ఫుడ్‌ ఆర్డర్స్‌ ఇవ్వడానికి భయపడుతున్నారు. రోజు సాధారణంగా 14 ఆర్డర్లు డెలివరీ ఇస్తేనే కమిషన్‌కు ఇతర ప్రోత్సాహకాలు తోడై మొత్తం రూ.700 వస్తాయి. ఇప్పుడు టార్గెట్‌కు చేరుకునే పరిస్థితే కనిపించడం లేదు. 

-జయ ప్రకాశ్‌, జొమాటో డెలివరీ బాయ్‌,  మియాపూర్‌


logo