శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 21, 2020 , 23:52:59

కాపాడి.. క్వారీలో మునిగి..

కాపాడి.. క్వారీలో మునిగి..

  • ఇద్దరు చిన్నారులు మృతి...
  • క్వారీగుంతలో పడిన పిల్లలను రక్షించి.. తిరిగి అందులో పడిన తల్లి
  •  ఆ తల్లిని  కాపాడబోయి.. మరో ఇద్దరు పిల్లలు అందులోకి...
  •  నీట మునిగి ఇద్దరు  బాలలు దుర్మరణం
  •  జవహర్‌నగర్‌, అరుంధతి నగర్‌లో విషాదం

జవహర్‌నగర్‌: ఆడుకుంటూ వెళ్లి ఇద్దరు చిన్నారులు క్వారీ గుంతలో పడ్డారు... వారిని రక్షించిన తల్లి.. తిరిగి అందులోనే పడిపోయింది... గమనించిన పక్కనే ఆడుకుంటున్న మరో ఇద్దరు చిన్నారులు ఆ తల్లిని కాపాడి... వారు మాత్రం అందులోనే పడిపోయారు... మహిళ తేరుకుని వారిని రక్షించే క్రమంలోనే ఆ ఇద్దరు ఇన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు. అయితే చిన్నారులకు తల్లిలేని లోటును తీర్చిన ఆ ఇద్దరు చిన్నారులు మాత్రం.. వారి కుటుంబ సభ్యులకు లేని లోటును మిగిల్చారు. ఈ ఘటనతో రెండు కుంటుంబాల్లో తీవ్ర విషాద ఛాయ లు అలుముకున్నాయి. ఈ సంఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... సీఆర్‌పీఎఫ్‌ అరుంధతి నగర్‌కు చెందిన  రామకృష్ణ, నాగేంద్రమ్మ దం పతులకు ఇద్దరు కుమారులు.. వారిలో హేమంత్‌(12) చిన్నవాడు. అలాగే.. సంజు యాదవ్‌, సుకంతి దంపతులకు ఏడుగురు సంతా నం.. వారిలో రాహుల్‌ (10) చిన్నవాడు. కరోన వైరస్‌ కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పిల్లలు ఇంటి వద్దే ఉంటున్నారు. కాగా.. స్థానికంగా నివాసముండే సరిత అనే మహిళ శనివారం బట్టలు ఉతకడానికి సమీపంలో ఉన్న క్వారీ గుంత వద్దకు.. తన ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ గుంతలో పడ్డారు. పిల్లలను రక్షించిన.. ఆ తల్లి తిరిగి గుంతలో పడింది. సమీపంలో ఆడుకుంటున్న హేమంత్‌(12), రాహుల్‌ (10) మహిళ అరుపులతో క్వారీ గంత వద్దకు వచ్చి.. ఆమె ను కాపాడి..గట్టుపైకి లాగారు. అంతలోనే పిల్లలు తిరిగి క్వారీ గుంత లో  పడ్డారు. గట్టుపైకి వచ్చిన మహిళ.. ఆ పిల్లలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పిల్లలు గుంతలో మునిగి పోయారు. వెం టనే విషయాన్ని స్థానికులకు తెలుపగా.. క్వారీ గుంత వద్దకు వచ్చి నీటిలో మునిగిన పిల్లలను బయటికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతి చెందిన చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. కాగా.. పాఠశాలకు వెళ్లి ఉంటే మా పిల్లలు బతికి ఉండేవారని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడిపెట్టించింది. ఇద్దరు చిన్నారుల మృతితో అరుంధతి నగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. 


logo