ఆదివారం 29 మార్చి 2020
Hyderabad - Mar 21, 2020 , 23:47:55

కరోనా ధాటికి ‘ఆర్థికం’ కుదేలు

కరోనా ధాటికి ‘ఆర్థికం’  కుదేలు

  • చితికిపోతున్నచిన్న కంపెనీల ఆర్థిక స్థితి
  • ఉద్యోగులకు స్వచ్ఛంద సెలవులు
  • పనివేళల్లో కుదింపు

కరోనా కాటుకు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. మనిషి మనిషికి మధ్య దూరంగా ఉంటేనే కరోనా వైరస్‌ను అరికట్టగలం, అందుకు ప్రజలు భయటకు రాకుండా ఉండడమే మంచిదని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో చెబుతూ ఆచరిస్తుండగా వ్యాపార చక్రం అనేది ఆగిపోయింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనే చైన్‌లో ఉండే వివిధ రకాలైన వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఎక్కువగా ఇతర దేశాలపై ఆధారపడి భారతదేశంలో పనిచేసే వ్యాపారాలపై ఎక్కువగా కన్పిస్తున్నది. ఫలితంగా పలు కంపెనీలు మూత పడుతుండగా కొన్ని పని వేళలు కుదించాయి. మరికొన్ని సంస్థలు తాత్కాలికంగా సెలవులు ప్రకటిస్తున్నాయి. పనులు దొరకక రోజూవారి కూలీలు విలవిలలాడుతున్నారు. అన్నదాత ఆందోళనలో పడ్డాడు. ఇదిలా ఉండగా పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందోననే భయం వెంటాడుతూనే ఉన్నది. దీంతో నిరుద్యోగులు పెద్ద మొత్తంలో పెరిగిపోయే పరిస్థితులు అన్నిప్రాంతాల్లో, అన్ని రంగాల్లో కనిపిస్తున్నాయి.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కొవిడ్‌-19 ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గడగడలాడిస్తున్నది. శతాబ్దానికోసారి ఉపద్రవంలా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూ ప్రజలను హరించేస్తున్నాయి. గతంలో వచ్చిన ఉపద్రవాలు ఒక ప్రాంతానికి ఒక ఖండంలోనే దాని ప్రభావాన్ని ఎక్కువగా చూపించాయి. తాజాగా వచ్చిన కరోనా ముందుగా ప్రారంభమైంది చైనాలో అయినా.. నేడు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు అది వ్యాప్తి చెందింది. రెండు నెలల కిందట కేవలం చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారి పోతుంది.. కంపెనీలు అక్కడ మూతపడ్డాయి అంటూ వచ్చిన వార్తలు ఇప్పుడు ప్రతిదేశంలోను ప్రజలకు ప్రత్యక్షంగా కన్పిస్తున్నాయి. మనిషి మనిషికి మధ్య దూరంగా ఉంటేనే కరోనా వైరస్‌ను అరికట్టగలం. దాంతో ప్రజలు బయటకురాకుండా ఉండడమే శ్రేయస్కరమంటూ ప్రపంచంలోని అన్ని దేశాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. దీంతో వ్యాపార చక్రం అనేది ఆగిపోయింది. చక్రం సరిగ్గా నడుస్తున్నప్పుడు వ్యవస్థ సాఫీగా ముందుకు వెళ్తుంది.. ఎక్కడో ఓ దగ్గర ఆ చైన్‌ తెగిపోయినా... ఆగిపోయినా.. ఆ చైన్‌లో ఉండే వారందరికి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనే చైన్‌లో ఉండే వివిధ రకాలైన వ్యాపారాలు ఆగిపోవడం.. ఒక దానిలో ఒక దానిపై మరొకటి ఆధారపడడంతో ఆ ప్రభావం అందరిపై పడుతున్నది. 

ఇతర దేశాలపై ఆధారపడే సంస్థలపై తీవ్ర ప్రభావం

గుండు పిన్‌ అమ్మే దగ్గర నుంచి విమానం అమ్మే విక్రయదారుడి వరకు అన్ని రకాల వ్యాపారాలపై దీని ప్రభావం స్పష్టంగా కన్పిస్తున్నది. ఐటీ, ఐటీ ఎనేబుల్డ్‌, టూరిజం, ట్రావెలింగ్‌, తయారీ సంస్థలు ఇలా అన్ని రకాల సంస్థలను కరోనా ఒక కుదుపు కుదిపేస్తున్నది. ఎక్కువగా ఇతర దేశాలపై ఆధారపడి భారత దేశంలో పనిచేసే వ్యాపారాలపై ఈ ప్రభావం మరింతగా కన్పిస్తున్నది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ అధికారం చేపట్టిన తరువాత ఔట్‌సోర్సింగ్‌ సంస్థలకు భారత్‌లో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అయినా ఆ పరిస్థితులను తట్టుకుంటూ భారతదేశంలో కొన్ని ఐటీ ఎనేబుల్డ్‌ సంస్థలైన కాల్‌సెంటర్లు, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ సంస్థలు కొసాగుతున్నాయి. ఆమెరికా నుంచి ఈ సంస్థలకు పనులు ఎప్పటికప్పుడు వస్తుంటాయి.. వాటి ఆధారంగా నెలవారిగా బిల్లులు వస్తుంటాయి. 30 నుంచి 40 శాతం పనులు తగ్గిపోవడంతో భారత్‌లో ఆమెరికా, అస్ట్రేలియా, కెనడా వంటి దేశాలపై ఆధారపడి పనిచేస్తున్న సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అక్కడి నుంచి పనులు రాకపోవడంతో ఇక్కడ ఉద్యోగులకు కొన్ని సంస్థలు తాత్కాలికంగా సెలవులు ఇచ్చేస్తున్నారు. పరిస్థితిని ఉద్యోగులు కూడా అర్ధం చేసుకుంటూ యజమాన్యాలకు సహకరిస్తున్నారు. పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందోననే ఆందోళనలో ఆయా సంస్థల ఉద్యోగులు, నిర్వాహకులు ఉన్నారు. 

మెడికల్‌ వ్యవస్థది ఇదే దారి..!

మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ ఇండస్ట్రీని చూస్తే.. ఈ ఇండస్ట్రీ సైతం ప్రతికూల వాతావారణాన్ని ఎదుర్కొంటుంది. ప్రజలు అనారోగ్యాలకు గురైతే దవాఖానలకు వెళ్తారు.. అయితే కరోనా వైరస్‌తో అత్యవసరమైతేనే ప్రజలు దవాఖానకు వెళ్తున్నారు. అమెరికాలో అత్యవసర పరిస్థితులుంటేనే తమ వద్దకు రావాలంటూ వైద్యులు రోగులకు ఆన్‌లైన్‌ సేవలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దవాఖానలకు సాధారణ రోగులు రాకపోవడంతో.. అక్కడి నుంచి ప్రతి రోజు ఆయా దవాఖానల నుంచి ఇండియాకు వచ్చే ట్రాన్స్‌స్క్రిప్షన్‌ పనులు తగ్గాయి. 

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో..

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలోను కొత్తగా జీతాలు పెంచే పరిస్థితులలో ఆయా సంస్థలు లేవు. ఎప్పటికప్పుడు ఆయా కంపెనీలకొచ్చే ప్రాజెక్టులలో నాణ్యతను పెంచడం, ైక్లెయింట్‌తో తరుచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ, కొత్త కొత్త ప్రాజెక్ట్‌లపై కంపెనీలు ఫోకస్‌ చేస్తుంటాయి. స్టార్టప్‌ కంపెనీలు తమ ప్రాడెక్ట్స్‌ను మార్కెటింగ్‌ చేసుకోవడం.. పెట్టుబడుదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటారు. విదేశాలకు, ఇతర రాష్ర్టాలకు ఆయా కంపెనీలోని మార్కెటింగ్‌ టెక్నికల్‌ టీమ్‌ వెళ్లి వస్తూ తమ ైక్లెయింట్స్‌ను కలుస్తుంటుంది. ప్రయాణాలు పూర్తిగా ఆగిపోయాయి, ఉన్న ప్రాజెక్ట్‌లకు కొన్ని సంస్థలకు ఇతర దేశాల నుంచి వచ్చే ఫండింగ్‌ కూడా ఆగిపోయింది. వేచి చూసే ధోరణిలో పెట్టుబడిదారులు ఉండడంతో ఉద్యోగాలపై ఈ ప్రభావం తీవ్రంగా కన్పిస్తున్నది. ప్రతియేడు ఐటీ సంస్థలో పనిచేసే ఉద్యోగి ప్రతిభను బట్టి అతనికి వచ్చే జీతంలో 20 శాతం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చాలా కంపెనీలలో ప్రతిభ ఆధారంగా ఇచ్చే జీతాన్ని నిలిపివేశాయి. ఇలా ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండడంతో అన్ని సంస్థలు ఇప్పుడు ప్రతికూల వాతావారణాన్ని ఎదుర్కొంటున్నాయి.

కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయి

ఐటీ రంగంపై కొవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉంది.. మున్ముందు దీని తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రారంభం కాబోయే ప్రాజెక్టులు వాయిదా పడుతున్నాయి. ఇతర దేశాలతో ముడిపడి ఉండడం, దాంతో పాటు ఆయా దేశాలకు ప్రయాణించేందుకు అనువైన వాతావరణం ఏర్పడాలి. అందరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇచ్చేందుకు ప్రస్తుతం కష్టంగానే ఉంటుంది. ఇది సంస్థలకు ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయి. కొత్త వారిని ఎంచుకునే ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఇది నిరుద్యోగత పెరుగడంపై ప్రభావాన్ని చూపుతుంది. ఆన్‌లైన్‌ టెలీ మెడిసిన్‌ సర్వీసెస్‌కు ప్రాధాన్యత పెరిగిందని ఓ ప్రైవేట్‌ ఐటీ సంస్థలో చీఫ్‌ టెక్నికల్‌ అఫీసర్‌(సీటీఓ) చకిలం సాయిప్రసాద్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

-చకిలం సాయిప్రసాద్‌, సీటీవో

మా ఉద్యోగులకు సెలవులిచ్చాం

తాము మెడికల్‌ ట్రాన్స్‌స్క్రిప్షన్‌ పనులు చేస్తుంటాం. మేం ఇండియాలో మరో సంస్థపై ఆధారపడి పనిచేస్తున్నాం. రోజు వారీగా వచ్చే పనులు తగ్గడంతో దాని ప్రభావం మాపై పడింది. నెల రోజులుగా కేవలం 30 శాతం పనులు మాత్రమే వస్తున్నాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నాం. అందుకే వీలైనంత మందిని సెలవులలో వెళ్లాలని కోరాం. మా ఉద్యోగులు పరిస్థితిని అర్ధం చేసుకొని సహకరిస్తున్నారు. వచ్చే నెలలో పరిస్థితి చక్కబడుతుందని ఆశిస్తున్నామని దిల్‌సుఖ్‌నగర్‌లోని రామ్‌ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మేనేజర్‌ రాము అన్నారు.                                                

- ముకుంద్‌రెడ్డి, మేనేజర్‌, ఆర్‌ఐటీlogo