శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 21, 2020 , 23:36:27

ఇంట్లోనే ఉందాం కరోనాను తరిమేద్దాం

ఇంట్లోనే ఉందాం కరోనాను తరిమేద్దాం

  • 24 గంటల పాటు బయటికి రాకుండా స్వచ్ఛంద కర్ఫ్యూ పాటిద్దాం
  • విపత్తును సమిష్టిగా ఎదుర్కొందాం
  • భవిష్యత్తును కాపాడుకుందాం 
  • ఇది మనకోసమేనని గుర్తించండి
  • నేడు నగరంలో ప్రజారవాణా బంద్‌
  • ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్‌, మెట్రో రైళ్లన్నీ రద్దు
  • అన్ని రకాల వ్యాపార సముదాయాలు మూసివేత 
  • ప్రైవేటు క్యాబ్‌లు.. ఆటోలు కూడా అదే బాటలో 
  • అత్యవసర సేవల కోసం మాత్రం 5 మెట్రో రైళ్లు, 12 ఎంఎంటీఎస్‌ రైళ్లు, 145 బస్సులు 

కరోనాను కట్టడి చేయడానికి ఒక్క రోజును త్యాగం  చేద్దాం.. విపత్తును ఆదిలోనే అంతం చేయడానికి అందరం కలిసి పోరాడుదాం.. వ్యాపారాలు మూసివేద్దాం.. పనులన్నీ పక్కనపెడుదాం.. ప్రజా రవాణా బంద్‌కు సహకరిద్దాం.. కరోనా మహమ్మారిలా మారకుండా.. 24 గంటల పాటు ఇండ్లలోనే ఉందాం.. వైరస్‌ ఆనవాళ్లు సమూలంగా మాయం చేయడానికి.. చైతన్యంతో ముందుకుసాగుదాం.. మన భవిష్యత్‌ కోసం..మనమే స్వీయ నిర్బంధం విధించుకుందాం.. ప్రభుత్వం పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేద్దాం..కరోనాను పూర్తిగా అంతమొందిద్దాం.

హైదర్‌నగర్ నమస్తే తెలంగాణ: కరోనా కట్టడికి భవ్యాస్‌ అపార్ట్‌మెంట్‌వాసులు ‘నిర్బంధ’ చర్యలతో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనతా కర్ఫ్యూకు సిద్ధమయ్యారు.  ప్రధానంగా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా వైరస్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సూచనలతో పాటు స్వీయ నియంత్రణ ద్వారా ఆవాస ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారు. వందలాది కుటుంబాలు నివాసముండే  అపార్టుమెంట్లలో స్వీయ నియంత్రణ మిగిలిన వారికీ ఆదర్శంగా నిలుస్తున్నది.

7 టవర్లు.. 940 కుటుంబాలు

శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని భవ్యాస్‌ తులసీ వనం అపార్ట్‌మెంట్‌ అత్యంత పెద్దదిగా గుర్తింపు పొందింది. ఇక్కడి ఎల్లమ్మబండ రోడ్‌లో ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌లో 12 ఫ్లోర్‌లతో ఏడు టవర్లు ఉన్నాయి. మొత్తం 940 కుటుంబాలు ఇందులో నివాసం ఉంటుండగా.. 3 వేలకు పైగా జనాభా నివసిస్తున్నది. ప్రధానంగా కరోనా వైరస్‌ను అరికట్టేందుకు అపార్టుమెంట్‌ ఆవరణలో ఉన్న ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీనికి తోడు ఆవరణలో ఉన్న ప్లే ఏరియా, పార్కులను, ఆటస్థలాలను మూసేశారు. తాజాగా క్యాబ్‌లను , డెలివరీ బాయ్స్‌ను లోపలకి అనుమతించడం లేదు. కార్లను శుభ్రం చేయడాన్ని నిలిపేశారు. ఇండ్లలో పని  చేసే పని మనిషులను సైతం ఆదివారం నుంచి అపార్టుమెంట్లలోకి రాకుండా నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రస్తుతానికి  ఇక్కడి సెక్యూరిటీ వద్ద పూర్తిస్థాయిలో స్క్రీనింగ్‌ చేసిన అనంతరమే కొత్త వ్యక్తులను లోపలికి అనుమతిస్తున్నారు. సెక్యూరిటీ సహా లిఫ్ట్‌, ఇతర పలు ప్రాంతాల్లో శానిటైజర్లను ఏర్పాటు చేశారు. 

అపార్టుమెంట్లలో పార్కింగ్‌ ప్రాంతాల్లో  కరోనా నివారణకు రసాయనాలను పిచికారి చేయిస్తున్నారు. ఇక్కడి అపార్టుమెంట్‌కు 600 మంది వరకూ విజిటర్ల తాకిడి ఉంటుంది.  దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం మరింతగా పెరిగితే అసోసియేషన్‌ అందించే గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతించే నిర్ణయాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల   కొద్ది రోజుల పాటు అపార్ట్‌మెంట్‌ల్లో నివసించే వ్యక్తులను కలిసేందుకు వచ్చే వారిని స్వీయ నియంత్రణ చేసుకోవాలని ఇప్పటికే సూచించారు. వైరస్‌ తీవ్రతను బట్టి మరిన్ని కఠిన నిర్ణయాలను తీసుకుని పక్కాగా అమలు చేస్తామని భవ్యాస్‌ తులసీ వనం నివాసి  సాత్నూర్‌ శిరీష తెలిపారు. అత్యంత ప్రమాదకర వైరస్‌ వ్యాపించకుండా అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ జారీ చేసే సూచనలు పకడ్బందీగా పాటిస్తామని నివాసితులు దువ్వూరి కనకదుర్గ, ప్రతాప్‌లు తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత...కామన్‌ పరిసరాల వినియోగంపై జాగ్రత్త వహిస్తామని ,స్వీయ నిర్బంధంతో వైరస్‌ను దరిచేరకుండా జాగ్రత్త పడతామని  నివాసితులు సువర్ణలత, నరేశ్‌, విజయ్‌, సౌజన్యలు పేర్కొన్నారు. అపార్టుమెంట్‌లో ఇప్పటికే కరచాలనం సంప్రదాయానికి స్వస్తి పలికి.. సంప్రదాయ బద్ధంగా రెండు చేతులతో నమస్కారంతో చేసుకుంటున్నారని  హిమబిందు, కిశోర్‌లు తెలిపారు.  దీనికి తోడు నేటి జనతా కర్ఫ్యూ సందర్భంగా అపార్టుమెంట్‌కు పూర్తి స్థాయిలో తాళం వేయాలని, అపార్టుమెంట్‌లోని వారు బయటకు వెళ్లటం , బయటి వారు లోపలకి రాకుండా సంపూర్ణంగా పాటించాలని నిర్ణయించామన్నారు.

అపార్ట్‌మెంట్లలో  ‘అప్రమత్తం’

మాదాపూర్‌:   కరోనా (కొవిడ్‌ 19) కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యాసంస్థలు, బార్లు, పబ్‌లు మూసివేసింది. బస్సులు, మెట్రో రైళ్లలో రసాయనాలు పిచికారి చేస్తూ రక్షణ ఏర్పాట్లు చేస్తున్నది.  వీటిలో భాగంగా ఐటీ హబ్‌గా పేరొందిన మాదాపూర్‌లో పలువురు అపార్ట్‌మెంట్‌ వాసులు, హాస్టల్‌ యజమానులు, పార్క్‌ల్లోకి వచ్చి పోయే వారిని అప్రమత్తం చేస్తున్నారు. కరోనా వైరస్‌ను  అరికట్టే దిశగా అడుగులు వేస్తు పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారు.  

మాదాపూర్‌లోని పలు అపార్ట్‌మెంట్లలో ముందస్తు చర్యలు చేపడుతూ లిపో ప్రొపైల్‌ అల్కాహాల్‌తో అపార్ట్‌మెంట్‌లోకి వచ్చి పోయే వారికి శానిటైజేషన్‌ చేస్తున్నారు. ఇందులో లిఫ్ట్‌లు, స్విచ్‌ బోర్డులు, టేబుళ్లు, బల్లలతో పాటు ఇతర వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ వారికి అవసరం నిమిత్తం స్ప్రేలు, ఫేస్‌ మాస్క్‌లను అందుబాటులో ఉంచుతున్నారు. 

ముందు జాగ్రత్తలు ... 

కరోనా కట్టడి కోసం పలువురు అపార్ట్‌మెంట్‌ , హాస్టల్‌ వాసులు పటిష్ట ఏర్పాట్లను చేస్తున్నారు. ముఖ్యంగా అయ్యప్ప సొసైటీ రోడ్డు నంబర్‌ 35లోని శ్రీ లక్ష్మి నిలయం, రోడ్డు నంబర్‌ 36లో గీతా రెసిడెన్సీ, ఎన్‌ కన్వెన్షన్‌ మార్గంలో ఉన్న జైన్‌ శ్రీకర్‌ అపార్టుమెంట్‌, మణికంఠ హాస్టల్‌, శ్రీ లక్ష్మి హాస్టల్‌తో పాటు పలు పార్కుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తూ మాస్కులను ధరిస్తున్నారు. సేల్స్‌ బాయ్స్‌, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌లు ఆర్డర్‌లను అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌లకు  అందజేసి వెళ్తున్నారు. 

వచ్చిపోయే వారికి ...

అపార్ట్‌మెంట్‌లో లోపలికి బయటకు వచ్చే వారితో పాటు బయటి వారు ఎవరైన వస్తే శానిటైజేషన్‌ చేస్తున్నారు. లిఫ్ట్‌లలో వెళ్లే వారికి టూత్‌పిక్‌లను అందుబాటులో ఉంచారు. దీంతో లిఫ్ట్‌ ద్వారా వెళ్ళే వారు టూత్‌పిక్‌లను ఉపయోగించి బటన్‌ నొక్కి పక్కన ఉంచిన ట్రాష్‌ బిన్‌లో వేసేలా ఏర్పాట్లు చేశారు. లిఫ్ట్‌ సైజును బట్టి నాలుగు నుంచి ఐదు మంది వెళ్లేలా ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేశారు. అపార్ట్‌మెంట్లలో విదేశీ, విమాన ప్రయాణం చేసి వచ్చిన వారు ఉంటే 15 రోజుల పాటు కట్టుదిట్టం చేసి క్వారంటైన్‌లో ఉండేలా ఏర్పాట్లు చేశారు. 

భద్రత చర్యలు..

చుట్టు పక్కల అపార్ట్‌మెంట్‌ వాసులు కరోనాను వ్యాపించకుండా భద్రత చర్యలు చేపట్టడంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ వాసులు సైతం జాగ్రత్తలు పాటిస్తున్నారు. మరో రెండు రోజుల్లో చుట్టు ప్రక్కల అపార్ట్‌మెంట్‌ వాసులు అప్రమత్తమయ్యే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. 

పార్కుల్లో ఏర్పాట్లు..

మాదాపూర్‌లోని కల్చరల్‌ సొసైటీ పార్కు, స్వామి వివేకానంద పార్కు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ పార్కు, సెంట్రల్‌ కమ్యూనిటీలో సైతం తగు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళ వాకింగ్‌ చేసేందుకు వచ్చిన వారు ఒకరితో మరొకరు దూరంగా నిలబడి మాస్క్‌లను ధరించి మాట్లాడాలని సొసైటీ అధ్యక్షులు పెద్ద మధుసూదన్‌రెడ్డి, చిన్న మధుసూదన్‌రెడ్డిలు పార్కులకు వచ్చి పోయే వారికి తగు సూచనలు చేసున్నారు.

ఉచితంగా మాస్కులు, హోమియోమందులు

కేపీహెచ్‌బీ కాలనీ: కరోనా కట్టడికి కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని వసంతనగర్‌ సొసైటీ, కట్టా సేవా కేంద్రం ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే దిశగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ కాలనీలో హోమియో మందులు, మాస్క్‌లను పంపిణీ చేస్తూ ముందస్తు జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తున్నారు. వసంతనగర్‌ సొసైటీ ఆధ్వర్యంలో... కాలనీలో ప్రజలందరికీ కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కాలనీ వాసులకు హోమియో మందులను పంపిణీ చేశారు. అలాగే సొసైటీ ఆఫీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు, కార్మికులకు మాస్క్‌లను పంపిణీ చేశారు. సొసైటీ సభ్యులు సైతం నిత్యం మాస్క్‌లను ధరిస్తున్నారు. అలాగే కట్టా సేవా కేంద్రం ఆధ్వర్యంలోనూ మాస్క్‌లు, హోమియో మందులను పంపిణీ చేస్తూ పలువురుకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

వసంతనగర్‌ కాలనీలో..

కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్‌లోని వసంతనగర్‌ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కాలనీలో ప్రత్యేక క్యాంప్‌ల ద్వారా అవగాహన కల్పిస్తూ, ప్రజలకు హోమియో మందులను పంపిణీ చేశారు. నిత్యం సొసైటీ కార్యాలయంలో పంపిణీ చేసేందుకు హోమియో మందులను అందుబాటులో ఉంచారు. అలాగే సొసైటీ ఆఫీస్‌లో వివిధ బిల్లులు చెల్లించేందుకు, వివిధ సమస్యలను సొసైటీ సభ్యులకు తెలియజేయడానికి వచ్చే ప్రజలకు కరోనా వైరస్‌ వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. సొసైటీ పరిధిలోని 2,500 కుటుంబాలను ఎస్‌ఎంఎస్‌లను పంపి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని కోరుతున్నారు. ముఖ్యంగా సొసైటీలో పనిచేసే ఉద్యోగులకు, కార్మికులను నిత్యం మాస్క్‌లు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. సొసైటీ సభ్యులూ మాస్క్‌లు ధరించడం, కార్యాలయంలో శానిటైజేషన్‌ లాంటి రక్షణ చర్యలు పాటిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని దగ్గు, తమ్ము, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని, ఇతరులకు వ్యాప్తి చెందకుండా బాధ్యతగా వ్యవహరించాలని ప్రచారం చేస్తున్నారు. 

కరోనా కట్టడికి గాయత్రి యజ్ఞం

ఎల్బీనగర్‌: కరోనా వైరస్‌ దేశం నుంచి పోవాలని కోరుతూ  కొత్తపేట డివిజన్‌ మోహన్‌నగర్‌ శృంగేరీ కాలనీవాసులు గాయత్రి యజ్ఞం నిర్వహించారు. యజ్ఞంలో మహిళా మండలి ప్రతినిధి విజయకుమారి, యోగా ఇన్‌స్ట్రక్టర్‌ వి. ధనలక్ష్మితో పాటు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌. కన్నయ్య ముదిరాజ్‌తో పాటు స్థానిక మహిళలు పాల్గొన్నారు. గాయత్రి యజ్ఞాన్ని పండిత్‌ ధర్మవీర్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు కరోనా వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు తులసి, మాధవి, సుధ, శైలజ, వందన, శ్రీదేవి, మాధవీలత, మీనాకుమారి, విజయలక్ష్మి, నందిని, భారతి, ఉమ, అనుపమ, భార్గవి తదితరులు పాల్గొన్నారు. 


logo