శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 21, 2020 , 09:02:57

కరోనాకు నో ఎంట్రీ

కరోనాకు నో ఎంట్రీ

  • కొవిడ్‌ 19ను ఎదుర్కొనేందుకు దీటైన చర్యలు చేపట్టిన కాలనీలు
  • ప్రవేశ ద్వారం వద్దే శానిటైజేషన్‌ ఏర్పాట్లు
  • సెక్యూరిటీ గేటు వద్దే ఇన్‌ఫ్రారెడ్‌ థర్మామీటర్లు
  • విదేశాల నుంచి వచ్చినవారికి పరీక్షలు..
  • పనిచేసే సిబ్బందికి మాస్కులు ధరించేలా సూచనలు
  • లిఫ్టు, మెట్లు, పరిసరాలు శుభ్రం

కొవిడ్‌ 19 వైరస్‌పై నగరంలోని వివిధ కాలనీలు, పలు గేటెడ్‌ కమ్యూనిటీలు యుద్ధం ప్రకటించాయి. ప్రవేశద్వారం వద్దే వైరస్‌ను అడ్డుకునేలా సంక్షేమ సంఘాలు రక్షణ చర్యలు చేపట్టాయి. వచ్చిన వారందరినీ ప్రాథమికంగా థర్మామీటర్‌లలతో పరీక్షిస్తున్నారు. అనుమానితులను వెంటనే వెనక్కి పంపుతున్నారు. గేటు వద్దే కాళ్లు చేతులు శుభ్రం చేసుకునేందుకు బకెట్లో నీళ్లు, సబ్బు, శానిటైజర్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు లిఫ్టులు, మెట్లు శుభ్రం చేస్తున్నారు. పరిసర ప్రాంతాలన్నీ వైరస్‌ బారిన పడకుండా రసాయనాలతో పిచికారి చేస్తున్నారు. డెలివరీ బాయ్స్‌ను అపార్టుమెంట్లలోని ఫ్లాట్స్‌ వరకు రానీయకుండా వాటిని సెక్యూరిటీ వద్దే వదిలి వెళ్లాలని సూచిస్తున్నారు. జిమ్‌లను, పార్కులను మూసివేసి వైరస్‌ వ్యాప్తిని కట్టుదిట్టంగా ఎదుర్కొనేలా పటిష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నాయి. 

నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని హిల్‌కౌంటీ (మైటాస్‌హిల్స్‌) 1188 విల్లాలతో 3800 మంది జనాభాతో నగరంలో అతిపెద్ద గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఐటీ,కార్పొరేట్‌ కంపెనీల ఉద్యోగులు, వివిధ స్టార్టప్‌ల నిర్వాహకులే ఇక్కడ అధికంగా నివాసం ఉంటున్నారు. ఈ కాలనీ నుంచి ప్రతినిత్యం వందలాది మంది పారిశ్రామిక వేత్తలు ప్రతిరోజూ వృత్తిరీత్యా నగరంతోపాటు దేశవిదేశాలకు వెళ్లి వస్తుంటారు. ఈ కాలనీలో వివిధ పనులను నిర్వహించే సెక్యూరిటీ గార్డులు, గార్డెన్ల నిర్వాహకులు, హౌస్‌ కీపింగ్‌, క్యాబ్‌డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఇండ్లల్లో  పనిచేసే మహిళలందరూ కలిపి 1000 మందికిపైగానే ఉంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు హిల్‌కౌంటీ సంక్షేమసంఘం సభ్యులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. 

రండి..చేతులు కడుక్కోండి

కాలనీలోకి ప్రవేశించగానే సందర్శకులను సిబ్బంది ఉష్ణోగ్రత పరిశీలిస్తారు. కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కునేలా బకెట్లలో నీళ్లు, సబ్బు, శానిటైజర్‌లను గేటు వద్దే అందుబాటులో ఉంచారు. కాలనీ అంతా ఐసోప్రోఫైల్‌ ఆల్కహాల్‌ స్ప్రేను చల్లి క్రిమి సంహారక నియంత్రణ చర్యలు చేపట్టారు. కరోనా వ్యాధిపై అవగాహన కలిగేలా పలుచోట్ల బ్యానర్లను ఏర్పాటు చేశారు. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే లోపలికి రావద్దని, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవాలని,సామూహిక ప్రదేశంలో ఉండొద్దంటూ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. 

విదేశాల నుంచి రాగానే.. ఐసోలేషన్‌

విదేశీ పర్యటనలు ముగించుకొని వచ్చిన కాలనీ వాసులను పరీక్షించేందుకు అక్కడే ఓ నోడల్‌ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఎవరికైనా వ్యాధి ఉందని తేలితే వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు.  14మంది కౌంటీహిల్స్‌ వాసులు ఇటీవల జపాన్‌, హాంకాంగ్‌, యూఎస్‌తో పాటు ఇత ర దేశాలు పర్యటించి వచ్చారు. వీరందరినీ కాలనీలోకి అనుతించకుండా ముందస్తుగానే పరీక్షలను నిర్వహించారు. వీరిలో ఒక్కరు అనుమానితుడిగా తేలడంతో చికిత్స నిమిత్తం గాంధీ అస్పత్రిలో చేర్చారు. మిగిలిన 13 మందిని వారి ఇళ్లలోనే 14 రోజులపాటు ఐసోలేషన్‌ ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. 

వ్యక్తిగత పరిశుభ్రతతోనే...ఎదుర్కోగలం

వ్యక్తిగత శుభ్రత పాటిస్తే కొవిడ్‌ 19 వైరస్‌ను దీటుగా ఎదుర్కోవచ్చు. మురికివాడల్లో తప్పనిసరిగా దీనిపై అవగాహన కల్పించాలి. ఇందుకు స్వచ్ఛంద సంస్థలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా పాలుపంచుకోవాలి. సామాజిక బాధ్యతలో భాగంగానే మా హిల్‌కాలనీలోకి వైరస్‌ రాకుండా ముందు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుంటున్నాం. బయటి నుంచి లోపలివచ్చే ప్రతిఒక్కరినీ కాళ్లు, చేతులు సబ్బుతో కడుక్కున్న తర్వాతే లోపలికి రానిచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. అదే సమయంలో లోపలికి వచ్చే ప్రతిఒక్కరి శరీర ఉష్ణోగ్రతను లెక్కిస్తున్నాం.

- సోలిపురం రాంరెడ్డి, హిల్‌ కౌంటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, బాచుపల్లి

ప్రభుత్వ చర్యలు అభినందనీయం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరో నా వ్యాధి నివారణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయం. అయితే ప్రభుత్వం ఇస్తు న్న సూచనలను సామాన్య ప్రజలు పాటిస్తే కరోనాను పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంది. మా కాలనీలో వ్యక్తిగత శుభ్రతతోపాటు కాలనీ పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. 

-చిట్టిబాబు, హిల్‌కౌంటీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి, బాచుపల్లి

పది రోజుల ముందే అప్రమత్తమయ్యాం

కోవిడ్‌19 వ్యాప్తిని అరికట్టే క్రమంలో హిల్‌ కౌంటీలో పదిరోజుల క్రితమే కార్యాచరణ ప్రారంభించాం. మా కాలనీలో ఉండే పలువురు వివిధ దేశాల నుంచే వస్తూపోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం కూడా ఎక్కువగానే ఉండటంతో మేం అప్రమత్తమయ్యాం. కాలనీలో లక్ష రూపాయాలతో ముందస్తుగా స్ప్రే చల్లాం. బయట నుంచి వచ్చే వారిని పరీక్షించడం వంటి చర్యలను మొదలు పెట్టాం.

-రత్నగోపాల్‌, హిల్‌ కౌంటీ సంక్షేమ సంఘం చైర్మన్‌, బాచుపల్లి


logo