బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 21, 2020 , 03:56:50

గుడి, చర్చి, మసీదులకు ఎవరూ వెళ్లకండి

గుడి, చర్చి, మసీదులకు ఎవరూ వెళ్లకండి

  • 15 రోజుల పాటు ఇండ్లలోనే ప్రార్థనలు చేసుకోండి :మతపెద్దల పిలుపు
  • సమావేశంలో కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, సీపీ సజ్జనార్‌

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరోనా వ్యాధి వ్యాప్తి నిరోధ చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రార్థనా స్థలాల్లో కేవలం అంతర్గత పూజలు, ప్రార్థనలు మినహా అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలను నిలిపివేయడానికి పలు మతాల ప్రతినిధులు ఏకగ్రీవంగా అంగీకరించారు. కోవిద్‌-19 వైరస్‌ వ్యాప్తి నివారణలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ మతాలకు చెందిన పెద్దలతో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతిక్‌ జైన్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలలో పూజలు, ప్రార్థనలు, తదితర మతపరమైన కార్యక్రమాలకు ప్రజలు హాజరుకావద్దన్నారు. తమ మతాలకు చెందిన పౌరులకు విజ్ఞప్తి చేయనున్నట్టు హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు తదితర మతాలకు చెందినపెద్దలు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చీలకు కనీసం 15 రోజుల పాటు వెళ్లకుండా తమ తమ ఇండ్లలోనే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 14 రోజుల పాటు ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలన్నారు. కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడం సమస్యలు కనిపిస్తే వెంటనే 104 లేదా పోలీసు, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు 524 మందిని పరీక్షించడం జరిగిందని తెలిపారు. దేశంలోని ఇతర నగరాల విమానాశ్రయాల నుంచి రైళ్ల ద్వారా ఎవరైనా వస్తే వారిని గుర్తించాలని ప్రజలకు సూచించారు.

వదంతులను నమ్మవద్దు : సీపీ సజ్జనార్‌

వాట్సాప్‌, సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ట్రాఫిక్‌ సిగ్నల్ల్లో ఇప్పటికే కరోనా వైరస్‌పై అవగాహన కల్పించడం జరుగుతున్నదన్నారు. రానున్న రోజుల్లో ఉగాది, శ్రీరామనవమి, జగ్నేకీరాత్‌, ఈస్టర్‌ తదితర పండుగలు వస్తున్నాయని, ఈ పండుగలను వ్యక్తిగతంగా నిర్వహించుకోవాలని విజ్ఞప్తిచేశారు. 

మీటర్‌ దూరంలో ఉండి మాట్లాడాలి : ఆరోగ్య సంస్థ ప్రతినిధి

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్‌ సీమ మాట్లాడుతూ తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు. చిన్న పిల్లలు, 60 సంవత్సరాలపై బడిన వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీటర్‌ దూరంలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మతాల మత పెద్దలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో.. కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ నుంచి కరోనా వైరస్‌ నివారణ చర్యలపై మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ప్రతిక్‌జైన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటింటికీ సమాచారం కోసం వెళ్లే అధికారులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. రోడ్డు పక్కన ఉండే టిఫిన్‌ సెంటర్లు, హోటల్స్‌ సరియైన పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే తాత్కాలికంగా మూసివేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు అవసరమైతే తప్పా బయటకి రాకూడదని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీపీఓ పద్మజారాణి, డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి, పీడీడీఆర్డీ ప్రశాంత్‌కుమార్‌, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కడున్నారు? 

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన (ఎన్‌ఆర్‌ఐ) వారిని గుర్తించడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జల్లెడ పడుతున్నది. ఒక వైద్యాధికారి, హెల్త్‌ సూపర్‌వైజర్‌, ఏఎన్‌ఎం ఆశాలతో కూడిన రాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఇందుకు నియమించారు. పల్లెల్లో ఎక్కడైనా ఉన్నారో కనిపెట్టడానికి దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, ఆశ వర్కర్లు గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వారు ఉంటే తెలుపాలని గ్రామస్థులకు సూచిస్తున్నారు. 

సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చిన వారికి ప్రత్యేకంగా చేతిపై ముద్ర

జిల్లాలో ఇప్పటి వరకు 22 చోట్ల క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి విదేశాల నుంచి వస్తున్న వారిని గురువారం వరకు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. శుక్రవారం నుంచి విదేశాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు వస్తున్న వారిని క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించడంలేదు. వారి నుంచి అఫిడవిట్‌ తీసుకుని 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంటామని హామీ పత్రం తీసుకుంటున్నారు. ఇలా సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇచ్చిన వారికి ప్రత్యేకంగా చేతిపై ముద్రవేసి ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పటికే గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 864 మందిని హోం క్వారంటైన్‌కు పంపించగా..నలుగురిని దవాఖానకు పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దాదాపుగా 5 విమానాలు విదేశాల నుంచి వచ్చాయి. కరోనా అనుమానితులను పరీక్షించిన అనంతరం నెగిటీవ్‌ రిపోర్టు వచ్చిన వారికి హోమ్‌ క్వారంటైన్‌ ముద్ర వేసి ఇంటికి పంపిస్తున్నారు. 


logo