శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 21, 2020 , 03:45:26

ఆర్మీ పేరుతో.. చీటింగ్‌

ఆర్మీ పేరుతో.. చీటింగ్‌

  • ఆర్మీ ప్రొఫైల్‌తో ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనలు
  • వాహనాలు విక్రయిస్తామంటూ వల...
  • మాయమాటలతో బురిడీ..
  • లక్షలు కాజేస్తున్న సైబర్‌ నేరగాళ్లు
  • సైబర్‌క్రైమ్‌ ఠాణాలో మూడు ఫిర్యాదులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: సైబర్‌ క్రిమినల్స్‌.. రోజుకో మోసానికి పాల్పడుతున్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి.. నమ్మించి..లక్షలు కాజేస్తున్నారు. ఇంతకుముందు లాటరీ వచ్చిందని, ఏటీఎం, క్రెడిట్‌ కార్డుల అప్‌డేట్‌ అంటూ, గిఫ్ట్‌లు పంపిస్తున్నామంటూ నమ్మించి బురిడీ కొట్టించా రు. తాజాగా ఆర్మీ అధికారుల పేరుతో ఓఎల్‌ఎక్స్‌లో వాహనాలు అమ్మకానికి పెట్టి.. డబ్బులు కాజేస్తున్నారు...మూడు వేరు వేరు ఘటనల్లో సైబర్‌నేరగాళ్లు సుమారు రూ. రూ. 3.17 లక్షలు కాజేశారు.

  • చాదర్‌ఘాట్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఓఎల్‌ఎక్స్‌లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అమ్మకం ప్రకటన చూశాడు. అది ఆర్మీ అధికారిదని, ధర రూ. 65 వేలు అని ఆ ప్రకటన లో ఉండడంతో బాధితుడు అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి ధర ఫైనల్‌ చేసుకున్నాడు. ఆ తరువాత సైబర్‌నేరగాడు గూగుల్‌ పే ద్వారా రూ. 5100 అడ్వాన్స్‌గా పంపించాలంటూ సూచించగా..  బాధితుడు అలాగే పంపించాడు. ఆ తరువాత 21,000 చెల్లిస్తే.. వాహనాన్ని ఇంటికి పంపిస్తానని, ఆ తరువాత మిగతా డబ్బులు ఇవ్వమంటూ సూచించాడు. అయితే బాధితుడు 2100 మాత్రమే మొదట చెల్లించగా, అది కుదరదని ఒకేసారి రూ. 21 వేలు పంపించాల్సిందేనంటూ పట్టుబట్టడంతో మిగ తా డబ్బు పంపించాడు. నీవు రెండు సార్లు పంపించడంతో ఇక్కడ సిస్టమ్‌ ఒప్పుకోవడం లేదు.. తిరిగి మొత్తం ఒకేసారి పంపించూ అంటూ చెప్పడంతో మరోసారి 21,000 పంపించాడు. తిరిగి మరోసారి రూ. 15 వేలు పంపించాలంటూ సైబర్‌నేరగాడు కోరడంతో బాధితుడికి అనుమానం వచ్చి.. తన డబ్బు తనకు ఇవ్వాలని కోరాడు. నీవు ఇప్పటి వరకు పంపిన డబ్బంతా ఆర్మీ ఖాతాలోకి వెళ్లింది, రూ. 15 వేలు చెల్లిస్తేనే డబ్బు, నీకు వాహనం వస్తుంది, లేదంటే ఒక్క పైసా కూడా రాదంటూ బెదిరించడం ప్రారంభించాడు. దీంతో బాధితుడు సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. 
  • ఆర్మీ అధికారి ప్రొఫైల్‌తో యాక్టివాను రూ. 24 వేలకు విక్రయానికి పెట్టిన ప్రకటనను చూసిన ఓ యు వకుడు.. అందులో ఉన్న ఫోన్‌ నంబర్‌కు సంప్రదించాడు. అడ్వాన్స్‌గా రూ. 10 వేలు వసూ లు చేసి.. ఆ తరువాత అతనికి మాటలు చెబు తూ నాలుగు దఫాలుగా రూ.65 వేలు కాజేశాడు.
  • ఓఎల్‌ఎక్స్‌లో ఆర్మీ ప్రొఫైల్‌తో కారును విక్రయించేందుకు చూసిన ప్రకటనతో రూ. 1.95 లక్షలు ఓ బాధితుడు పోగొట్టుకున్నాడు. కారు విక్రయ ప్రకటనను చూసిన బాధితుడు ప్రకటనదారుడితో మాట్లాడాడు. తమకు గూగుల్‌ పే ద్వారా డబ్బు చెల్లించాలంటూ సూచించాడు. ఆ తరువాత మాటలు చెబు తూ, కొనుగోలుదారుడిని తికమక పెడుతూ చెల్లించిన డబ్బు తిరిగి వచ్చేస్తుంటూ నమ్మిస్తూ.. దఫ దఫాలుగా రూ. 1.95 లక్ష లు కాజేశారు. ఈ మేరకు బాధితులు వేరు వేరుగా సైబర్‌క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసులు దర్యాప్తు చేపట్టారు. 


logo