శనివారం 28 మార్చి 2020
Hyderabad - Mar 21, 2020 , 03:28:24

మా పిల్లలు.. ఎట్లున్నరో

మా పిల్లలు.. ఎట్లున్నరో

  • విదేశాల్లో ఉన్న బిడ్డల కోసంనగరంలోని తల్లిదండ్రుల చింత
  • ‘కరోనా’ వైరస్‌ బారిన పడకూడదంటూ దేవుళ్లకు వేడుకోలు 
  • తల్లిదండ్రుల యోగక్షేమాలూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న బిడ్డలు

సిటీబ్యూరో/మొయినాబాద్‌/ మారేడ్‌పల్లి, నమస్తే తెలంగాణ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి వణికిస్త్తుంది. ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలో కూడా కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో కరోనా వ్యాప్తి ప్రభావం తక్కువగానే కనిపిస్తున్నా.. కొన్ని రాష్ర్టాలలో చాపకింద నీరులా వ్యాప్తిస్తుంది. అయితే కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు విస్తృతస్థాయిలో చర్యలు చేపడుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరసలోనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ఇలా ఉంటే ఉద్యోగం, చదువు రీత్యా ఆయా దేశాలలో స్థిరపడిన వారు, ఓల్డ్‌ఏజ్‌ హోంల్లో ఉండే ఒంటరి తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారు. కళ్లు ముందున్న వాళ్లే ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటుంటే ఉద్యోగరీత్యా ఒంటరిగా వదిలేసిన మా పిల్లలు ఎలా ఉంటున్నారన్న చింత తల్లిదండ్రుల్లో కనబడుతుంది. మరోవైపు దేశం కానీ దేశంలో మా బిడ్డ ఎట్లున్నడో అని సినీయర్‌ సిటీజన్స్‌ గాబరా పడుతున్నారు. అసలే వృద్ధ దంపతులపై కరోనా వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న భావిస్తూ కొందరూ పిల్లలైతే ఒన్‌స్టాప్‌ సీనియర్‌ కేర్‌ ప్లాట్‌ఫామ్‌ లాంటి సంస్థలను ఆశ్రయిస్తూ బాగోగులు చూస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో  రోజూ పదుల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని, తమ తల్లిదండ్రులను కంటి రెప్పలా కాపాడాలంటూ అభ్యర్థిస్తున్నారని అన్వయ ఫౌండర్‌ ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. 

రాష్ట్ర నలమూలల నుంచి విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు తమ తల్లిదండ్రుల యోగక్షేమాలపై ఆరాటపడుతున్నారు. ఇదే సమయంలో తమ పిల్లల బాగుగులు తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ఆసక్తి కనబర్చుతున్నారు. ఇరువురు అందుబాటులోకి ఉన్న  ఆన్‌లైన్‌ సేవలను, నెట్‌వర్కులను వినియోగించుకుని ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం మీరు ఉంటున్న దేశంలో ఎలా ఉంది ? మీరు ఎలా ఉన్నారని తల్లిదండ్రులు తెలుసుకుంటున్నారు. తమ ప్రాంతంలో కొన్ని చోట్ల కరోనా వైరస్‌ ఉన్న విషయం వాస్తవమే.  ఇక్కడి ప్రభుత్వం కరోనా వైరస్‌ను అరికట్టడానికి  గట్టి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరిస్తున్నారు. మేము బాగానే ఉన్నాం. మీరు మంచిగా ఉండాలని విదేశాల్లో ఉన్న కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రులకు చెబుతున్నారు.  మా పిల్లలు ఉన్న దేశంలో వారు నివాసముండే ప్రాంతంలో కరోనా ప్రభావం పెద్దగా లేదంటా..కరోనా వైరస్‌ ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని పిల్లల తల్లిదండ్రులు చెప్పారని పిల్లల  తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని చార్లెటి ప్రాంతంలో ఉండే సురంగల్‌ గ్రామానికి చెందిన ఈగ మాణిక్‌రెడ్డితో నమస్తే తెలంగాణ  కరోనా ప్రభావం గురించి ఆరా తీయగా బాగానే ఉన్నామని ఆయన చెప్పాడు.

నా కుమారుడు క్షేమంగానే ఉన్నాడు..

నా పేరు ఆనందరావు రిటైర్డు రైల్వే ఉద్యోగిని. నాకు ఇద్దరు ఒక పాప, బాబు. ఉన్నత చదువుల నిమిత్తం నా కుమారుడు సందీప్‌ ఆనందరావు 2018 సంవత్సరంలో ఇటలీకి పంపాను. అక్కడ మిలాన్‌ నగరంలో మాస్టర్‌ ఇన్‌ డాటా సైన్స్‌ కోర్సును చదువుతున్నాడు. ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయాప్రాంతాల్లో కరోనా వైరస్‌తో పలువురు దవాఖానల పాలైయ్యారని టీవీల ద్వారా విన్నాం. వెంటనే నా కుమారుడికి ఫోన్‌ చేసి ఇటలీలో కరోనా వైరస్‌ ప్రభావంపై వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం. మిలాన్‌ ప్రాంతంలో కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో... అక్కడ ఉన్న తోటి విద్యార్థులతో పాటు సందీప్‌ ఆనందరావు కూడా పక్కనే ఉన్న ‘మల్టా’ అనే (ధీవికి) ప్రాంతానికి చేరుకొని సురక్షితంగా ఉన్నారు. విదేశాల్లో కరోనా వైరస్‌ ప్రభావం రోజు రోజుకూ అధికం అవుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థతి నెలకొంది. నా కుమారుడితో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితి రోజు అడిగి తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం నాకుమారుడు క్షేమంగానే ఉన్నాడు. మరో మూడు, నాలుగు నెలల్లో చదువు పూర్తి అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఈ వైరస్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విదేశాల నుంచి ఇండియాకు విమానాలను నడుపాలని, అందులో కేవలం ఇండియాకు చెందిన వారికి మాత్ర మే అనుమతి ఇవ్వాలి. నగరానికి చేరుకున్న తరువాత వారికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత ఇంటికి పంపిస్తే కుటుం బ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. 

-ఆనందరావు, రిటైర్డు రైల్వే ఉద్యోగి, రెజిమెంటల్‌బజార్‌ 


నా కొడుకు, కోడలు బాగానే ఉన్నారు..

నా కొడుకు ఉద్యోగం రీత్యా అమెరికాలో భార్య పిల్లలతో ఉంటున్నాడు. అమెరికాలోని న్యూజెర్సీలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపనీలో ఉద్యోగి. కరోనా ప్రభావం అమెరికాలో చాలా సీరియస్‌గా ఉందంట.  నా కొడుకు కంపెనీకి వెళ్లకుండా ఇంటి నుంచే పని చేస్తున్నాడు. ఫోన్‌ చేయక ముందు కొంత ఆందోళన చెందాను. బాగానే ఉన్నా. అన్న జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మీరు ఎవరు ఆందోళన చెందొద్దు అని  చెప్పాడు. ఇప్పుడు నాకు   సంతోషంగా ఉంది.  

-సీతారాం, మొయినాబాద్‌

నా బిడ్డ మంచిగానే ఉంది..

నా బిడ్డ, అల్లుడు, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. చైనాలో కరోనా వచ్చిందని కొంత ఆందోళనకు గురైయ్యా...  తరువాత అమెరికాలో కూడా కరోనా వైరస్‌ ప్రభావం ఉందని వార్తలు వస్తే అప్పుడు చాలా ఆందోళన చెందా. నా బిడ్డ అమెరికాలో ఉంది, ఎలా ఎందో అని భయపడ్డాను. ఫోన్‌ చేసి బాగానే ఉన్నానని, హైదరాబాద్‌లో ఉన్న నా కొడుకుకు సమాచారం ఇవ్వడంతో అప్పుడు సంతోషమైంది. ప్రస్తుతం నా బిడ్డ, అల్లుడు పిల్లలు బాగానే ఉన్నారని చెప్పారు. 

-పుష్పమాలదేశాయి,మొయినాబాద్‌ 


logo