శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 20, 2020 , 03:18:22

18.5 కిలోమీటర్లు..8 గంటల్లో సర్వే

18.5 కిలోమీటర్లు..8 గంటల్లో సర్వే

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పై చిత్రంలో కనిపిస్తున్నది మొబైల్‌ లైడర్‌ వాహనం.. దీని ఖరీదు సుమారు రూ.6కోట్లు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ వాహనాన్ని ఓ ప్రముఖ కన్సల్టెన్సీ కీలక ప్రాజెక్టు రూపకల్పనలో సర్వేకు వినియోగించారు. ఒక ప్రాజెక్టు సర్వేకు ఇప్పటి వరకు డ్రోన్‌ వినియోగించగా, తొలిసారిగా రోడ్డుపై నుంచే ప్రతి అంశాన్ని రికార్డు చేసే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వాహనాన్ని ఉపయోగించారు. వాహన ప్రత్యేకతలను పరిశీలిస్తే.. సాధారణ వాహనంలాగే రోడ్డుపై వెళుతుంది. 10-15 కిలోమీటర్‌ ఫర్‌ అవర్‌ వేగంతో ఈ వాహనాన్ని ఆయా ప్రతిపాదిత ప్రాజెక్టు మార్గంలో నడిపిస్తారు. ప్రతి ఐదు వందల మీటర్ల చొప్పున వాహనాన్ని నడిపిస్తూ డిప్రెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం(డీజీపీఎస్‌) ద్వారా శాటిలైట్‌ కో ఆర్డినేషన్‌ చేస్తారు. వాహనంపై భాగాన డీజీపీఎస్‌, లైడర్‌, త్రీడీ కెమెరాలతో ఆపరేట్‌ చేస్తారు. వాహనం మూడు వైపులా(వాహనం ఎదురుగా, కుడి, ఎడమ వైపు (x, y, z)150 మీటర్ల మేరలో చుట్టూ ఉన్న ప్రతి అంశాన్ని పసి గడుతుంది. x, y, z భాగాలుగా విభజించి ఎక్కడెక్కడ ఆస్తులు, భవన నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి? ఎంత విస్తీర్ణం, భవనం ఎత్తు ఎంత ఉంది? చిన్న వస్తువు నుంచి పెద్ద నిర్మాణాల ప్రతిదీ పసిగట్టి ప్రత్యేక డేటాలో నిక్షిప్తం అవుతాయి. ఆ తర్వాత రికార్డు అయిన వివరాలను ప్రాసెస్‌ చేస్తారు. సాధారణంగా కిలోమీటర్‌ మేర మనుషులు సర్వే చేయాల్సి వస్తే పది రోజుల సమయం తీసుకుంటున్నది. కానీ ఈ మొబైల్‌ లైడర్‌ సర్వేతో గంటల్లో సర్వే పూర్తి కానున్నది. ఈ విధానంతో సమయంతోపాటు ఖర్చు కూడా ఆదా కానున్నది. అయితే 18.5 కిలోమీటర్ల మేర ప్రతిపాదిత ప్రాజెక్టు మార్గాన్ని కేవలం 8 గంటల్లో పూర్తి చేసి సర్వే ప్రక్రియలో తనదైన పనితీరుకు కనబర్చి ఔరా అనిపించింది. ఈ వాహనంతో పగలు, రాత్రి సర్వే చేసే వీలుంటుంది. అయితే ఈ సర్వే మాత్రం ట్రాఫిక్‌ లేని సమయంలో పగలు చేశారు. కాగా ఇప్పటి వరకు చైన్‌/రేజింగ్‌ రైడ్స్‌, టెలీస్కోప్‌, టోటల్‌ స్టేషన్‌ సర్వే, డోన్‌ లైడర్‌ సర్వేలు ఉండగా, తాజాగా డీజీపీఎస్‌ సర్వే చేయడం ఇదే ప్రప్రథమం కావడం గమనార్హం.

     నాగ్‌పూర్‌ తరహాలో సికింద్రాబాద్‌ ఫ్యారడైజ్‌ నుంచి మేడ్చల్‌ కండ్లకోయ ఔటర్‌ రింగు రోడ్డు వరకు 18.50 కిలోమీటర్ల మేర డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఫీజుబులిటీ అధ్యయనం కోసం హెచ్‌ఎండీఏ కన్సల్టెన్సీలను ఆహ్వానించగా, ఆర్వీ కన్సల్టెన్సీకి ఈ ప్రాజెక్టు రూపక్పలన బాధ్యతలు అధికారులు అప్పగించారు. రెండంతస్తుల వంతెన ఏర్పాటులో నిర్మాణం ఎన్ని కిలోమీటర్లు? ఎన్ని ర్యాంపులు అవసరం? భూ సేకరణ? ఆస్తుల స్వాధీనం? పాదచారుల సౌకర్యాలు, స్ట్రీట్‌ లైట్లు, బస్‌స్టేషన్లు ఎక్కడెక్కడ అవసరం? తదితర సమగ్ర వివరాలతో డిటెల్ట్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను సదరు కన్సల్టెన్సీ హెచ్‌ఎండీఏకు నివేదిక అందించనున్నది.  


logo