శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 20, 2020 , 03:13:33

నగరంలో భారీ వర్షం

నగరంలో భారీ వర్షం

సిటీబ్యూరో/బంజారాహిల్స్‌, నమస్తే తెలంగాణ : ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌ వ్యాప్తంగా గురువారం వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టినప్పటికీ సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గ్రేటర్‌ పరిధిలోని తిరుమలగిరిలో అత్యధికంగా 4.3సెం.మీ వర్షపాతం నమోదు కాగా, హబ్సిగూడ జంక్షన్‌లో అత్యల్పంగా 1.0 సెం.మీ వర్షపాతం నమోదైంది. మారేడుపల్లి, ఉప్పల్‌, కాప్రా, మల్కాజిగిరి, బాలానగర్‌, ఇబ్రహీంపట్నం, మెహిదీపట్నం, ఖైరతాబాద్‌, షేక్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాగల 48గంటల్లో గ్రేటర్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. 


జూబ్లీహిల్స్‌లో కూలిన చెట్లు 

ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖాన సమీపంలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరగడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమీపంలోని సాయి గెస్ట్‌హౌస్‌ వద్ద మరో రెండుచెట్లు విరిగిపడ్డాయి. జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ బృందాలు అక్కడకు చేరుకుని చెట్లకొమ్మలను తొలిగించి రాకపోకలను పునరుద్ధరించాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నం.10లో వర్షానికి చెట్టు కొమ్మ విరిగి కారుపై పడింది. కాగా, వెంటనే కారు నడిపిస్తున్న దుశ్యంత్‌ అనే వ్యక్తి కారులో నుంచి కిందకు దిగడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న ట్రాఫిక్‌ ఏసీపీ గోవర్ధన్‌, జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ముత్తు తదితరులు అక్కడకు చేరుకుని చెట్ల కొమ్మలను తొలిగించారు. కారు పైభాగం పూర్తిగా ధ్వంసమైంది. 


logo