శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 19, 2020 , 04:03:49

వృద్ధులకు అండగా ‘వన్‌ బిగ్‌ ఫ్యామిలీ’ యాప్‌

వృద్ధులకు అండగా ‘వన్‌ బిగ్‌ ఫ్యామిలీ’ యాప్‌

-నగరంలో స్టే సేఫ్‌..స్టే హోం డ్రైవ్‌ ప్రారంభం  

-కరోనా నేపథ్యంలో ఉచిత డెలివరీ సర్వీస్‌కు రెడీ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : కరోనా కట్టడికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించడానికి ‘వన్‌ బిగ్‌ ఫ్యామిలీ’ యాప్‌ ముందుకొచ్చింది. ‘స్టే సేఫ్‌.. స్టే హోం’ డ్రైవ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. సీనియర్‌ సిటిజన్స్‌కు అవసరమయ్యే ఏ వస్తువులనైనా ఇంటి వద్దకు చేర్చడానికి సిద్ధమైంది. ఉచితంగానే డెలివరీ సర్వీస్‌ అందించడం విశేషం. మెడిసిన్స్‌, నిత్యావసర వస్తువులు, షాపింగ్‌ తదితర సామగ్రి అంతా ఇంటికి చేర్చుతారు. యాప్‌లో సర్వీస్‌ బుక్‌ చేసుకుంటే సరిపోతుంది. సాధారణంగా వృద్ధులు తమ పనులను చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం కరోనా పొంచి ఉండటంతో వారు బయటకెళ్లాలంటేనే జంకుతున్నారు. నగరంలో చాలా మంది వృద్ధులు ఒంటరిగా ఉంటున్నారు. పిల్లలు ఉద్యోగాలు చేస్తుండటంతో వారికి అవసరమయ్యే వస్తువులు తెచ్చుకోవడం ఇబ్బందిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి పనులను చక్కబెట్టేదెవరనేది వారి చింత. ఈ నేపథ్యంలో ‘వన్‌ బిగ్‌ ఫ్యామిలీ యాప్‌'తో వారికి భరోసా లభించింది. ఓ వైపు కరోనా.. మరోవైపు ఎండలు.. ఈ పరిస్థితుల్లో వన్‌ బిగ్‌ ఫ్యామిలీ యాప్‌ ఉచితంగానే సామగ్రి డెలివరీ సర్వీస్‌ అందించడం వారికి ఊరట కలిగించింది. 

డయల్‌ చేస్తే చాలు..

చాలా మంది వృద్ధులకు యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడం..అందులోని ఆప్షన్స్‌కు అనుగుణంగా సర్వీస్‌ బుక్‌ చేయడం కష్టం. అందుకే వన్‌ బిగ్‌ ఫ్యామిలీ యాప్‌ టోల్‌ఫ్రీని ప్రవేశపెట్టింది. ఫోన్‌ చేసి ఆర్డర్‌ చేస్తే చాలు పరిమిత సమయంలో మీ ఇంటికి ఆర్డర్‌ అందిస్తారు. అందుకోసం 18005725200కు ఫోన్‌ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రయాణం చేయాలంటే కూడా ఉబర్‌, ఓలా తదితర క్యాబ్‌ సర్వీస్‌లు అందేలా చేస్తారు. అందుకు వారు కొన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మెడిసిన్స్‌కు సంబంధించి కొన్ని మందులపై 25 శాతం డిస్కౌంట్‌ కూడా అందించనున్నది. ఈ సందర్భంగా ‘వన్‌ బిగ్‌ ఫ్యామిలీ యాప్‌' చైర్మన్‌ మాధవరెడ్డి మాట్లాడుతూ.. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి తమవంతు బాధ్యతగా సీనియర్‌ సిటిజన్స్‌కు ఉచిత సామగ్రి డెలివరీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. సర్వీస్‌ను సీనియర్‌ సిటిజన్స్‌ వినియోగించుకోవాలని కోరారు. 


logo