సోమవారం 30 మార్చి 2020
Hyderabad - Mar 18, 2020 , 03:30:49

కరోనా కట్టడికి 150 బల్దియా బృందాలు

 కరోనా కట్టడికి 150 బల్దియా బృందాలు

సిటీబ్యూరో,నమస్తే తెలంగాణ: కరానా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ మరింత అప్రమత్తమైంది. క్వారంటైన్‌లో ఉన్న వారిపై నిఘా కోసం జీహెచ్‌ఎంసీ, పోలీసు, రెవెన్యూ, వైద్యశాఖ తదితర విభాగాల క్షేత్రస్థాయి అధికారులతో వార్డుకి ఒకటి చొప్పున 150 బృందాలను జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిం ది. ఈ బృందాలు బుధవారం నుంచి ఆయా వ్యక్తులు ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి వారు తీసుకుంటున్న రక్షణ చర్యలను వాకబుచేస్తాయి. ముఖ్యంగా విదేశీయులు, ఇటీవల విదేశాలకు వెళ్లివచ్చినవారిని గుర్తించి వారు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలను పరిశీలించనున్నట్లు, ఒకవేళ వారి ఆరోగ్యం సరిగా లేకుంటే వెంటనే వారిని సమీపంలోని వైద్యశాలకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఆయా వ్యక్తుల జాబితాను పోలీసు శాఖ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. దీనికోసం నాలుగు విభాగాలకు చెందిన అధికారులతో వార్డులవారీగా నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా వ్యక్తులు విదేశాల నుంచి వచ్చినప్పుడే నిర్వహించిన స్క్రీనింగ్‌ టెస్ట్‌ల ఆధారంగా అనారోగ్యంగా ఉన్నవారిని గుర్తించి వారిని క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. అటువంటివారు విడిగా ఉంటున్నారా, ప్రస్తుతం వారి ఆరోగ్యం ఎలా ఉంది తదితర అంశాలను ఈ బృందాలు పరిశీలించనున్నాయి. విదేశాలనుంచి వచ్చినవారి వివరాలు ఇప్పటికే పోలీసు శాఖ వద్ద ఉన్నట్లు, బుధవారం వారి ఇండ్లకు వెళ్లి తనిఖీలు చేపడుతామన్నారు. 

 పారిశుధ్య పనులను తనిఖీ చేసిన మేయర్‌ 

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు.జీహెచ్‌ఎంసీ అందిస్తున్న గ్లౌస్‌లు, మాస్క్‌లు, శానిటైజర్లు వంటి వాటిని వినియోగించుకోవాలని పారిశుధ్య కార్మికులకు ఆయన సూచించారు. మంగళవారం ఉదయం మేయర్‌ ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌జోన్‌లలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పారిశుధ్య కార్మికులతో మాట్లాడుతూ  కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యలు పాటిస్తూనే, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారికి సూచించా రు.సకాలంలో విధులకు హాజరుకాని,నిర్లక్ష్యంగా వ్యవహరించే కార్మికులు, అసిస్టెంట్‌లు, సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా  పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షి స్తున్నట్లు మేయర్‌ వివరించారు. 

నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్‌ కేసులు

 కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా పది మంది కన్నా ఎక్కువ మంది గుమిగూడే వ్యాపార, వాణిజ్యసంస్థలు, క్రీడా మైదానాలు, జిమ్ములు తదితరవాటిని ఈనెల 31వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఆదేశాలను ఉల్లంఘించే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని మేయర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా తెరిచి ఉంచిన పలు బార్లు, పబ్బులు, జిమ్ములు, కోచింగ్‌ సెంటర్లు తదితర 66సంస్థలను మూసివేసినట్లు చెప్పారు.  

శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటేనే లోనికి అనుమతి 

కరోనా కట్టడికి ముందస్తు చర్యల్లో భాగంగా జలమండలి ఖైరతాబాద్‌ ప్రధాన కార్యాలయంలో శానిటైజర్‌ తప్పనిసరి చేశారు. సంస్థ ఉద్యోగులు, వివిధ సేవల నిమిత్తం కార్యాలయానికి వచ్చే వారిని దృష్టిలో ఉంచుకుని సంస్థలోకి వెళ్లే ప్రవేశద్వారం వద్దనే ప్రత్యేక సిబ్బందిని నియమించారు. శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతనే లోనికి అనుమతిస్తున్నారు. 

 ఆర్టీసీ ఉద్యోగులకు శానిటైజర్లు అందజేత

 కరోనా కలకలంతో ఆర్టీసీ అప్రమత్తమైంది.ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లకు, కండక్టర్లకు శానిటైజర్లు విధుల్లో చేరేముందు అందజేస్తున్నారు.ప్రయాణికులతో కలివిడిగా ఉండే పరిస్థితులు ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగం గా వీటిని అందచేస్తున్నారు. డిపో పరిసరాలతోపాటు స్టేషన్ల ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుతున్నారు.గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 29 డిపోల్లో ఉన్న సుమారు 2,500 బస్సులను శానిటైజ్‌ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక లోషన్‌తో కడుగుతున్నారు. గ్రేటర్‌లో పనిచేస్తున్న 18 వేల మంది ఉద్యోగులకు ప్రతీరోజూ శానిటైజర్లను పంపిణీ చేస్తున్నారు.రవాణాశాఖ జేటీసీ పాండురంగనాయక్‌ ఆధ్వర్యంలో సెట్విన్‌ బస్సుల యజమానులతో మంగళవారం సమావేశమయ్యారు. బస్సులు పరిశుభ్రంగా ఉంచాలని, వ్యాధి విస్తరించకుండా బస్సులను ప్రతిరోజూ శుభ్రం చేయాలని సూచించారు. 

మున్సిపాలిటీల్లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు

మణికొండ,నమస్తేతెలంగాణ: కరోనా వ్యాధిని కట్టడిచేసేందుకు మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల పరిధిలో మంగళవారం హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కరోనాపై ప్రజల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి మణికొండ మున్సిపాలిటీ పరిధిలో ఫోన్‌ నంబరు 8886588334 అనే హెల్ప్‌డెస్క్‌కు ఫోన్‌ చేయవచ్చని కమిషనర్‌ జయంత్‌ తెలిపారు. అదేవిధంగా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో వారు 08413-233233 నంబరుకు కాల్‌ చేయొచ్చని కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయా వ్యాపార కేంద్రాల వద్ద శానిటైజర్లు విధిగా ఏర్పాటు చేయాలని,ఇందుకు ప్రత్యేకంగా జంట మున్సిపాలిటీల్లో ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు వారు తెలిపారు.


logo