సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 18, 2020 , 03:20:00

హాస్టళ్లూ ఖాళీ..

హాస్టళ్లూ ఖాళీ..

అమీర్‌పేట్‌,(నమస్తే తెలంగాణ): కరోనా వైరస్‌ కట్టడికి  అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతుంది. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌జోన్‌లోని ఖైరతాబాద్‌ సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులు ముందుగా అమీర్‌పేట్‌లోని పలు హాస్టళ్లపై దృష్టి సారించారు. కేవలం 24 గంటల గడువు ఇస్తూ అమీర్‌పేట్‌లో ఉన్న దాదాపు 1000కి పైగా హాస్టళ్లను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా నిర్వాహకులతో అత్యవసర సమావేశాలు పెట్టి స్పష్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల మధ్య అమీర్‌పేట్‌లోని బాపూనగర్‌, ఎస్‌ఆర్‌టీ, ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్‌ఆర్‌టీ, గురుమూర్తినగర్‌, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, శివబాగ్‌లలో హాస్టళ్ల నిర్వాహకులతో అమీర్‌పేట్‌ కార్పొరేటర్‌ ఎన్‌.శేషుకుమారి, డిప్యూటీ కమిషనర్‌ గీతారాధిక, ఏఎంవోహెచ్‌ డాక్టర్‌ బార్గవ నారాయణలు సమావేశమై మూసివేతకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. 

నిర్వాహకుల నుంచి సానుకూల స్పందన 

ఊహించని ఈ పరిణామంతో తొలుత హాస్టల్‌ నిర్వాహకులు కొంత ఆందోళన చెందినా, అధికారుల నుంచి చక్కటి వివరణలతో కూడిన ఆదేశాలు అందడంతో వారు వ్యాపారం కంటే ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారు కూడా యంత్రాంగానికి సహకరించేందుకు సిద్ధమయ్యారు. అయితే గురుమూర్తినగర్‌కు చెందిన కొందరు వ్యాపార్మాతక ధోరణితో వ్యవహరిస్తూ అధికారులతో కొంత సమయం ఇవ్వాలని వారించినా.. అధికారుల నుంచి హెచ్చరికల స్థాయిలో సమాధానాలు రావడంతో వారు కూడా చివరకు సమ్మతించారు.  

‘పది’, ఇంటర్‌ విద్యార్థులకు వినహాయింపు

10వ తరగతి, ఇంటర్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులెవరైనా హాస్టళ్లలో ఉంటే వారికి మాత్రం మినహాయింపు ఉంటుందని కార్పొరేటర్‌ శేషుకుమారి, డిప్యూటీ కమిషనర్‌ గీతారాధికలు తెలిపారు. ఈనెల 31వరకు నిరవధికంగా హాస్టళ్లను మూసివేయాల్సిందిగా ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్వాహకులు నడుచుకోవాల్సిందేనని చెబుతూ ఇందుకు 24 గంటల వ్యవధిని విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన హాస్టళ్లను సీజ్‌ చేయడంతో పాటు భారీగా జరిమానాలు విధించాల్సి ఉంటుందని, ఈ విషయమై బుధవారం నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీలు ఉంటాయని వారు స్పష్టం చేశారు.  


logo