గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 18, 2020 , 03:13:57

డ్రైవింగ్‌ లైసెన్స్‌ స్లాట్లన్నీ రద్దు

డ్రైవింగ్‌ లైసెన్స్‌ స్లాట్లన్నీ రద్దు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : డ్రైవింగ్‌ లైసెన్సులకు ఈ నెలాఖరు వరకు స్లాట్లు బుక్‌ చేసే అవకాశమే లేదు. బీఎస్‌ 4 వాహనాల రిజిస్ట్రేషన్ల రద్దీ పెరుగుతుండటంతో వాహన రిజిస్ట్రేషన్లు మినహా లైసెన్సుల జారీ పూర్తి ప్రక్రియను  రవాణాశాఖ రీ షెడ్యూలింగ్‌  చేసింది. రవాణాశాఖ కమిషనర్‌ మౌఖిక ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు పేరు రాయడానికి ఇష్టపడని రవాణాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. ఈ నిర్ణయం మంగళవారం నుంచి మార్చి 31వ తేదీ వరకు 11 పనిదినాల్లో అమల్లోకి వస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో ఇది అమల్లోకి వస్తుంది. తీసుకున్న నిర్ణయం ప్రకారం లెర్నింగ్‌ లైసెన్సులు, డ్రైవింగ్‌ లైసెన్సులు, డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యూవల్‌, తదితర స్లాట్లు బుకింగ్‌ జరుగవు. అయితే గతంలో స్లాట్‌బుక్‌ చేసుకున్న లైసెన్సులు, ఇతర సేవలకు మాత్రమే  యథావిధిగా సేవలు అందిస్తారు. గతంలో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి ఎల్‌ఎల్‌ఆర్‌, పర్మినెంట్‌ డ్రైవింగ్‌ లైసెన్సు, డ్రైవింగ్‌ టెస్ట్‌ వంటి  పరీక్షలు నిర్వహిస్తారు. బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌ ఈనెల 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు విధించిన గడువు ఉండటంతో వాహన రిజిస్ట్రేషన్లపై దృష్టి సారిస్తున్నారు. సాధారణ రోజుల్లో రిజిస్ట్రేషన్‌ వాహనాలు 100కు మించకుండా ఉండేవి. ప్రస్తుతం ఒక్కో కార్యాలయంలో 400 నుంచి 600 వాహనాల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్లకు స్పెషల్‌ నంబర్ల కోసం ఆన్‌లైన్‌ విధానంలో బిడ్డింగ్‌ కూడా అధికంగా నమోదవుతున్నా యి. వాహన రిజిస్ట్రేషన్ల నేపథ్యంలో వాహన నంబర్లకు కూడా డిమాండ్‌ పెరిగింది. దీనికోసం స్లాట్‌ బుక్‌ చేసుకునే వీలుంది. ఒక్కో నంబరు సిరీస్‌ ప్రస్తుతం 20 నుంచి  25రోజుల్లో పూర్తయి కొత్త సిరీస్‌ ప్రారంభమవుతుంది.

సేవల్లో  కరోనాతో టోకెన్‌ విధానం

రవాణాశాఖ సేవల్లో మళ్లీ టోకెన్‌ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. కరోనా నేపథ్యంలో రవాణాశాఖ కార్యాలయాల్లో పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్‌ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుండటంతో టోకెన్‌ విధానం అమల్లోకి తెస్తున్నారు. రాష్ట్రంలోనే అతి రద్దీ ఉండే ఖైరతాబాద్‌ కార్యాలయంలో దీనిని అమల్లోకి తెస్తున్నారు. గుంపులు గుంపులుగా కార్యాలయాల్లోకి వస్తే కరోనా ప్రమాదం పొంచి ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం స్లాట్‌ బుక్‌ చేసుకుని కార్యాలయానికి వచ్చినవారికి వాహన నంబరుతోపాటు ఎక్కడికి వెళ్లి సేవలు పొందాలో పేర్కొంటారు. ఎవరి నంబరును పేర్కొంటారో వారిని మాత్రమే లోపలికి పంపించి సేవలు అందించి బయటకు పంపిస్తారు. రవాణాశాఖ కార్యాలయాల్లో గుంపులుగా ఉండకుండా చూడాలని ఆదేశాలు అందటంతో ఆర్టీవోలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.


logo
>>>>>>