గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 18, 2020 , 03:11:28

కరోనాపై ప్రభుత్వ సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలి

కరోనాపై ప్రభుత్వ సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలి

మన్సూరాబాద్‌: కరోనాపై ప్రభుత్వ సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌భగవత్‌ అన్నారు. ఎల్బీనగర్‌లోని చిల్డ్రన్స్‌ ట్రాఫిక్‌ ట్రైనిం గ్‌ పార్కు ప్రాంగణంలో మంగళవారం రాచకొండ కమిషనరేట్‌ పరిధి ట్రాఫిక్‌ పోలీసులకు కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తి చెందకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహనతోపాటు ఉచిత ఈఎన్‌టీ, హియరింగ్‌ స్క్రీనింగ్‌ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమంలో సీపీ మాట్లాడుతూ కరోనాపై కొందరు సోషల్‌మీడియాలో అతిగా వైరల్‌ చేస్తున్నారని, ఇలాంటి పరిణామాలు మంచివి కావన్నారు. కరోనాపై ప్రభుత్వం నుంచి వచ్చి న సమాచారాన్నే ప్రజలు విశ్వసించాలన్నారు. కరోనా వైరస్‌ నివారణ కోసం ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంచేసుకోవాలని సిబ్బందికి సూచించారు. దేశ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రతిఒక్కరూ రెండుచేతులతో నమస్తే చెప్పాలని.. ఎవ్వరికీ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వవద్దని సూచించారు. కరోనా వైరస్‌ లక్షణాలు లేని వారు మాస్కులను ధరించాల్సిన అవసరం లేదని..అదేవిధంగా ఒకే మాస్కును ప్రతిరోజు వాడవద్దని తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వ్యక్తుల ఆరోగ్యాలపై నిఘాపెట్టాలని... ఎవరికైనా ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఉంటే వారిని వెంటనే గాంధీ దవాఖానకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలని పోలీసులకు సూచించారు. ఆశ్రయ ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ట్రాఫిక్‌ పోలీసుల కోసం హియరింగ్‌ స్క్రీనింగ్‌ క్యాంపు నిర్వహించామని, ఎవరికైనా వినికిడి సమస్యలు ఉంటే వారికి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ డీసీపీ ఎన్‌.దివ్యచరణ్‌రావు, ఆశ్రయ ఆకృతి సంస్థ డైరెక్టర్‌ డీపీకే బాబు, మైక్రోబయాలజిస్ట్‌ కన్సల్టెంట్‌ ముస్తఫాఅఫ్జల్‌, ఈఎన్‌టీ డాక్టర్‌ శివరామకృష్ణ, అడిషనల్‌ డీసీపీలు ట్రాఫిక్‌ మహ్మద్‌ తాజుద్దీన్‌ అహ్మద్‌, జి.మనోహర్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>