బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 17, 2020 , 02:50:19

పెరుగుతున్న వాహనాలు..తగ్గుతున్న ప్రమాదాలు

పెరుగుతున్న వాహనాలు..తగ్గుతున్న ప్రమాదాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగరంలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతున్నా.. పోలీసుల అవగాహన కార్యక్రమాలతో ప్రమాదాల సంఖ్యను తగ్గించగలుగుతున్నారు. రోడ్ల విస్తరణ పెంచేందుకు అంతగా అవకాశం లేకున్నా.. ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడకుండా వాహనాలు సాఫీగా వెళ్లడంతో పాటు.. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గణనీయంగా తగ్గించడంలో సఫలీకృతమవుతున్నారు. ఇందుకు మూడు పద్ధతులను హైదరాబాద్‌ పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఆధారాలతో కూడిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రీ ఇంజినీరింగ్‌, అవగాహన.. ఈ మూడు విధానాలను అనుసరిస్తూ  సత్ఫలితాలు సాధిస్తున్నారు. సాంకేతిక సంస్కరణలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్‌ పోలీసులు ఇప్పుడు రోడ్డు సేఫ్టీలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశంలోని వివిధ పట్టణాల్లో పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్‌ రద్దీ కూడా పెరుగుతుండడం అదే స్థాయిలో ప్రమాదాల సంఖ్య  పెరుగుతున్నది. హైదరాబాద్‌లో అందుకు భిన్నంగా ఉండటంతో ఆయా రాష్ర్టాల ట్రాఫిక్‌ విభాగాలు కూడా ఇక్కడకు వచ్చి అధ్యయనం చేస్తున్నాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో కాంటాక్టు.. నాన్‌కాంటాక్టు పద్ధతిలో ఆధారాలతో సహా జరిమానాలు విధిస్తుండటంతో ఉల్లంఘనదారులకు 100 శాతం శిక్షలు పడుతున్నాయి. దీంతో వాహనదారుల్లో మంచి మార్పు సాధ్యమయ్యింది. 10 నుంచి 20 శాతం మినహా మిగతా వారంతా ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తున్నారు. దీంతోనే హైదరాబాద్‌ వాహనదారుల్లో స్వీయ క్రమశిక్షణ పెరుగుతూ వస్తున్నది. ఇందుకు ప్రభుత్వం తీసుకొనే సాంకేతిక సంస్కరణలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 


ఆధారాలతో  ఎన్‌ఫోర్స్‌మెంట్‌..

నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తే పక్కాగా జరిమానాలు విధిస్తున్నారు. సదరు ఉల్లంఘన ఎప్పుడు.. ఎక్కడ జరిగిందనే విషయం, ఫొటో, వీడియోతో సహా ఉల్లంఘనదారుడికి పంపిస్తున్నారు. దీంతో వాహనదారులు కచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నారు. 


డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌..

ఫుట్‌పాత్‌ ఆక్రమణలు, నో పార్కింగ్‌, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ ఇలా అన్ని రకాల ఉల్లంఘనలను కెమెరాలలో బంధిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. సామాన్యులు కూడా ఉల్లంఘనల ఫొటోలు తీసి పంపితే  వాటిపై కూడా ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ప్రతి రోజు 41 సీపీ యాక్ట్‌, ఎంవీ యాక్ట్‌, 402 జీహెచ్‌ఎంసీ యాక్ట్‌, 39(బి) సీపీ యాక్ట్‌, సీసీ కెమెరాలు, సిబ్బంది చేతిలో ఉండే కెమెరాల ద్వారా ఉల్లంఘనలపై చాలన్లు విధిస్తున్నారు. సీసీ కెమెరాలు, కెమెరాల ద్వారా ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకు విధించిన చాలన్ల సంఖ్య ఇలా ఉంది.


అవగాహనతో సత్ఫలితాలు..

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలనే విషయంలో హైదరాబాద్‌ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేసి ఫలితాలను రాబట్టారు. ఒక పక్క ట్రాఫిక్‌ విభాగం నుంచి చేయాల్సిన పనులను చేస్తూనే మరో పక్క ప్రమాదాలకు గురయ్యే వర్గాల్లో అవగాహన తీసుకురావడం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువగా విద్యార్థులు, యువత, ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు ప్రమాదాలకు గురవుతున్నారని, గతంలో  జరిగిన ప్రమాదాలను విశ్లేషించి ఆయా గ్రూపులను తయారు చేశారు. ఇందులో విద్యార్థులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని గుర్తించి  విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


రోడ్డు  రీ ఇంజినీరింగ్‌..

2015కు ముందు హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య 400పైగానే ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ట్రాఫిక్‌ విభాగంలో సాంకేతిక సంస్కరణలు తెచ్చి, రోడ్డు ప్రమాదాల కారణాలను విశ్లేషించారు. ఇలా హైదరాబాద్‌లో 82 ప్రాంతాలను బ్లాక్‌స్పాట్‌లుగా గుర్తించారు. అందులో 60 చోట్ల పరిస్థితి క్లిష్టంగా ఉందని గుర్తించారు. అక్కడ తీసుకోవాల్సిన రక్షణ చర్యలతో పాటు పోలీసులు అవగాహన కల్పించారు. ఇందులో ప్రధానమైంది రోడ్డు రీ ఇంజినీరింగ్‌. రోడ్డు ఇంజినీరింగ్‌ సరిగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి, జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి  మరమ్మతులు చేశారు.  


 సాంకేతికతతో..

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇందులో ప్రధానమైంది ఐటీఎంఎస్‌. గత ఏడాది మే నుంచి ఈ విధానాన్ని  ఉపయోగిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ అండ్‌ ఇంటలిజెన్స్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఐటీఎంఎస్‌)తో ఆయా కూడళ్లలో ట్రాఫిక్‌ రద్దీ ఎంత ఉంది, ఎన్ని వాహనాలు వెళ్తున్నాయి, ట్రాఫిక్‌ రద్దీని బట్టి అక్కడ నిర్ణయాలు తీసుకోవడం, ట్రాఫిక్‌ రద్దీని బట్టి సిగ్నలింగ్‌ సమయాలను మార్చడం, దీంతో పాటు వీఐపీలు, అంబులెన్స్‌ వెళ్తున్న సమయంలో అక్కడి సిగ్నల్‌ వ్యవస్థకు ఆయా  రూట్‌లను అనుసంధానం చేసి సాఫీగా ట్రాఫిక్‌ వెళ్లే విధానాన్ని అవలంబించనున్నారు. గ్రాఫిక్‌ యూజర్‌ ఇంటర్‌పేస్‌(జీయూఐ), జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్‌మేషన్‌ సిస్టమ్‌(జీఐఎస్‌) ఆధారితంగా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. దీంతో పాటు ఈ విధానంలో ఏఎన్‌పీఆర్‌ (ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌) ఉంది. ఆయా సిగ్నల్స్‌ నుంచి వెళ్లే ప్రతి వాహనం నంబర్‌ను ఈ విధానం రికార్డు చేస్తుంది. ఈ విధానంతో శాంతి భద్రతల పోలీసులకు ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు నేర నియంత్రణలోనూ ఈ టెక్నాలజీ పోలీసులకు తోడ్పాటునందిస్తున్నది. ఐటీఎంఎస్‌ విధానంలో ప్రతి రోజు 8 వేల వరకు ట్రాఫిక్‌ ఉల్లంఘనదారులకు సంబంధించిన జరిమానాలు ఉంటాయి. 


logo
>>>>>>