మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 17, 2020 , 02:46:55

కరోనా కట్టడికి..నిఘా బృందాలు

 కరోనా కట్టడికి..నిఘా బృందాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు తదితర విభాగాల క్షేత్రస్థాయి అధికారులతో నలుగురు సభ్యులు గల సంయుక్త నిఘా బృందాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. మంగళవారం ఈ బృందాలు ఏర్పాటు కానున్నాయి. బృందాల ఏర్పాటు వార్డుల వారీగా,  లేక సర్కిళ్లవారీగా అనేది నిర్ణయించాల్సి ఉంది. ఇటీవల అనారోగ్యంతో నగారానికి వచ్చిన విదేశీయులతోపాటు విదేశాల నుంచి వచ్చిన మన దేశస్థులపై వీరు నిఘా ఏర్పాటు చేస్తారు. 170 మంది విదేశీయులు సహా మొత్తం 750 మంది ఈ తరహా వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విమానాశ్రయంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అధికారులు వారిని కొద్దిరోజులు బయటకు వెల్లకుండా ఉండాలని ఇదివరకే సూచించారు. తాజాగా ఈ నిఘా బృందాలు వారుంటున్న ప్రాంతాలకు వెళ్లి వారు ఇతరులతో కలువకుండా విడిగా ఉంటున్నారా, లేదా అనేది పరిశీలిస్తారు. వారి ఇండ్లకు వెళ్లి కొద్దిరోజులపాటు బయటకు రాకుండా చేయడంతోపాటు వ్యాధిపై వారికి అవగాహన కల్పిస్తారు. ఒకవేళ వారు విడిగా ఉండే వీలులేకుంటే వారిని ఐసోలేషన్‌ ప్రాంతానికి తరలించాలని నిశ్చయించారు. ఈ 750 మంది ఎక్కడున్నారనేది పోలీసుశాఖ వద్ద సమాచారం ఉందని, వారిచ్చే సమాచారం ఆధారంగా నిఘా బృందాలు  అక్కడికి చేరుకుంటాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 


నేడు విధులపై కార్మికులకు శిక్షణ 

  ఇక బల్దియా పారిశుధ్య కార్మికుల విషయానికొస్తే, దాదాపు 18000 మంది కార్మికులు పారిశుధ్య విధుల్లో కొనసాగుతున్నారు. వీరందరికీ మాస్క్‌లు, గ్లౌజ్‌లు, బూట్లు, జాకెట్స్‌, శానిటైజర్‌తో కూడిన కిట్లను అందజేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు, ఒకవేళ ఎక్కడైనా తక్కువపడితే వెంటనే కొనుగోలుచేయాలని జోనల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. విదేశీయులు, విదేశాలనుంచి వచ్చి అనారోగ్యంతో ఉన్నవారు నివసించే ప్రాం తాల్లో ఏ విధమైన ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలి, తమ రక్షణకు ఏ విధంగా వ్యవహరించాలి అనేదానిపై మంగళవారం శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు శిక్షణనివ్వాలని నిర్ణయించారు.


ప్రైవేటు జిమ్ములు మూసివేత 

 మరోవైపు, ఇప్పటికే స్కూళ్లు, సినిమాహాళ్లు, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని ఆటమైదానాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, వ్యాయామశాలలు తదితరవాటిని మూసివేయగా, తాజాగా ప్రైవేటు రంగంలోని ఆట మైదానాలు, వ్యాయామశాలలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు తదితరవాటిని కూడా మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అందరికీ నోటీసులు జారీచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా మూసివేయకుంటే పోలీసు సహాయంతో బలవంతంగా మూసివేయనున్నట్లు, అంతేకాకుండా వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సోమవారం మొగల్‌పురాలోని జీహెచ్‌ఎంసీ ఆట మైదానాన్ని కొందరు బలవంతంగా తెరిపించగా, తాము వెంటనే రంగంలోకి దిగి మూసివేయించినట్లు వివరించారు.  


 ‘కరోనా’ బాధితులకు ధైర్యం చెప్పిన వైద్యులు 

 బన్సీలాల్‌పేట్‌ : కరోనా వైరస్‌ బారినపడి గాంధీ దవాఖాన ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులకు సోమవారం వైద్యులు ధైర్యం చెప్పారు. ఈ మేరకు సూపరింటెండెంట్‌ డాక్టర్‌  శ్రావణ్‌ కుమార్‌, ఆర్‌ఎంవోలు, పల్మనాలజీ, జనరల్‌ మెడిసిన్‌, రేడియాలజీ విభాగాలకు చెందిన వైద్యులు వార్డులోకి వెళ్లి ముగ్గురు పాజిటివ్‌ బాధితులతో మాట్లాడారు.  ఇది వరకు ఒక పాజిటివ్‌ లక్షణాలు న్న వ్యక్తికి 14 రోజుల పాటు చికిత్స అందించడం ద్వారా వైరస్‌ ప్రభావం తగ్గిపోయి డిశ్చార్జి కూడా జరిగి ఇంట్లో విశ్రాంతి పొందుతున్నారని, అలాగే, మీరు కూడా ఎలాంటి  ఆందోళన చెందొద్దని  సూపరింటెండెంట్‌ వారికి సూచించారు.  సోమవారం 51 మంది అనుమానితులు వచ్చారని, ప్రస్తుతం 22 మంది ఐసోలేషన్‌ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వారి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉన్నదని తెలిపారు. ఇప్పటి వరకు గాంధీలో 312 మందికి నెగెటివ్‌ అని రిపోర్టులో తేలిందన్నారు.  సోమవారం బయటి రోగుల విభాగానికి 1525 మంది రోగులు వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చి వైద్యులను సంప్రదించారని అధికారులు తెలిపారు.  


logo
>>>>>>