బుధవారం 01 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 17, 2020 , 02:39:15

దవాఖాన వ్యర్థం..అనర్థం..

దవాఖాన వ్యర్థం..అనర్థం..

సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ: వైద్యశాలల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు ప్రజారోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. నిర్వీర్యం సక్రమంగా లేక పరిసరాలు కలుషితమవుతున్నాయి. ఈ మెడికల్‌ వేస్ట్‌ గతంలో 3.5 టన్నులే ఉండగా, తాజాగా 11 టన్నులకు చేరుకున్నది. వీటిని సీబీఎండబ్ల్యూటీఎఫ్‌కు తరలించాల్సి ఉన్నా... కొందరు అలా చేయడం లేదు. చెత్తకుండీల్లో పారబోస్తున్నారు. ప్లాస్టిక్‌ను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. మూడు జిల్లాల పరిధిలో 1400 వరకు ఆస్పత్రులు ఉండగా, రోజూ హైదరాబాద్‌ నుంచి 6,657, మేడ్చల్‌ 1,578 , రంగారెడ్డి జిల్లా నుంచి 3,367  కిలోల క్లినికల్‌ వ్యర్థాలు వెలువడుతున్నాయి. వీటిని 51 ఆటోల్లో ఐదు కామన్‌ బయోమెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ ప్లాంట్లకు తరలిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల పక్కదారి పడుతుండడంతో అనర్థాలకు దారి తీసే ప్రమాదమున్నది. 


 ఆదాయం కోసం...

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో చిన్నా.. పెద్దవి కలిపి 1400 వరకు వైద్యశాలలున్నాయి. వీటిలో 16 వేల పడకల్లో 14 వేల పడకలు వినియోగంలో ఉన్నట్లు తెలుస్తున్నది. వీటి నుంచి వెలువడుతున్న వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా బయో మెడికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్లాంట్లకే తరలించాలి. కానీ పూర్తిస్థాయిలో వ్యర్థాలు అక్కడికి చేరడంలేదు. రవాణా, నిర్వహణ ఖర్చుల భారంతో కొన్ని వైద్యశాలలు పక్కదారి పట్టిస్తున్నాయి. వ్యర్థాలను నిర్మాణుష్య ప్రాంతాలు, మున్సిపల్‌ చెత్త డబ్బాల్లో డంప్‌ చేస్తున్నాయి. మరికొన్ని ఆస్పత్రుల సిబ్బంది ప్రైవేట్‌ వ్యక్తులు, స్క్రాప్‌ కొనుగోలు కేంద్రాలకు అప్పగిస్తున్నారు. వ్యర్థాల్లో ప్లాస్టిక్‌ వస్తువులుండడంతో ఆదాయం కోసం క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. గతంలో దుండిగల్‌ శివారు, చింతల్‌ హెచ్‌ఎంటీ మైదానంలో మెడికల్‌ వ్యర్థాలను పారబోయగా, పీసీబీ అధికారులు 16 దవాఖానాలకు జరిమానాలు విధించారు. నగరంలోని పలు ప్రముఖ ఆస్పత్రులకు నోటీసులిచ్చిన సందర్భాలున్నాయి.  


 48 గంటల్లో తరలించాల్సిందే..

మెడికల్‌ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారవేయవద్దు. వాటిని ఆయా ఆస్పత్రుల్లోనే వేరు చేయాలని జీవ వ్యర్థాల నిర్వహణ మార్గదర్శకాలు-2016 చట్టం చెబుతున్నది. ఇందుకోసం పసుపు, ఎరుపు, తెలుపు, నీలం రంగు డబ్బాలను ఏర్పాటు చేసుకుని వ్యర్థాలను సేకరించాలి, ముఖ్యంగా ఆపరేషన్‌ థియేటర్ల నుంచి వెలువడేవి ప్రత్యేక బ్యాగుల్లోనే వేయాల్సి ఉంటుంది. వాటిని పద్ధతిగా సీల్‌చేసి.. సురక్షితంగా 48 గంటల్లో కామన్‌ బయోమెడికల్‌ వేస్ట్‌ ట్రీట్‌మెంట్‌ ఫెసిలిటీ ప్లాంట్లకు తరలించాలి. అలా చేయని వైద్యశాలలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. 


 ప్రమాదం ఇలా.... 

మెడికల్‌ వ్యర్థాలను కొన్ని ఆస్పత్రులు నిబంధనల ప్రకారం సేకరించడం లేదు.  ఓపెన్‌ ట్రాలీల్లో  సేకరించి నిర్లక్ష్యంగా తరలిస్తున్నారు. దీంతో అవి రోడ్ల మీద పడుతున్న సందర్భాలున్నాయి. పీసీబీ నుంచి లైసెన్స్‌ పొందిన వారు కాకుండా.. ఇతరులు వ్యర్థాలను తరలిస్తున్నారు. దీంతో అవి స్క్రాప్‌ కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. దవాఖానల నుంచి  వెలువడిన మెడికల్‌ వేస్ట్‌లో కత్తిరించిన శరీర భాగాలు కూడా ఉంటాయి. వీటిని డంపింగ్‌ యార్డుల్లో, చెత్తడబ్బాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, కుంటల్లో వేయడం వల్ల వాటిలో నుంచి ప్రమాదకరమైన వైరస్‌, బ్యాక్టీరియాలు తయారవుతాయి. అవి వాతావరణంలో చేరి భయంకరమైన జబ్బులకు దారి తీస్తాయి. 


logo
>>>>>>