బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 15, 2020 , 02:34:33

స్నేహితుడి పిల్లలకు .. నాన్నై

స్నేహితుడి పిల్లలకు .. నాన్నై

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :తోటి మాజీ సైనికుల బాధలు తెలిసిన ఓ మాజీ సైనికుడు ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చాడు. వారి చదువులకయ్యే వ్యయాన్ని భరించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాడు నగరానికి చెందిన చంద్రకాంత్‌.  17 సంవత్సరాల పాటు ఆర్మీలో పనిచేసి 2005లో పదవీ విరమణ పొందాడు. ఖాళీగా ఉండకుండా.. అతడి కుమారులు రోహిత్‌, మోహిత్‌లతో కలిసి సునీత అకాడమీ ఆఫ్‌ సౌండ్స్‌ అండ్‌ విజువల్‌ ఆర్ట్స్‌ అనే సంస్థను నిర్వహిస్తున్నారు. తమ సంపాదనలో 10 శాతం సమాజం కోసం ఖర్చుచేయాలని భావించిన చంద్రకాంత్‌ తన తండ్రి దశరత్‌ ఉజ్గరే ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మజీ సైనికుల కుటుబాల నుంచి ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని చదివిస్తానని  హైదరాబాద్‌ ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి నోరి శ్రీనేష్‌ కుమార్‌కు తెలిపాడు.  దీంతో ఆయన కీర్తిశేషులు మహేశ్వర్‌ (సిపాయి), పురుష్తోతం శాస్త్రి (నావల్‌) కుటుంబాలను ఎంపిక చేశారు. ఇదే సమాచారాన్ని చంద్రకాంత్‌కు చేరవేయగా, వారి పెద్దకుమారుడు రోహిత్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మహేశ్వర్‌ కూతురు లక్ష్మీకుమారి, పురుషోత్తం శాస్త్రి కూతురు వరలికకు రూ. 20వేల చెక్కును అందజేశారు. ప్రస్తుతం లక్ష్మీకుమారి ఇంటర్‌, వరలిక ఎస్సెస్సీ చదువుతుండగా, వారి ఉన్నత చదువులకయ్యే మొత్తాన్ని భరిస్తానని చంద్రకాంత్‌ ప్రకటించారు. ఈ ప్రయత్నాన్ని పలువురు అభినందించారు.


logo