గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 14, 2020 , 02:44:24

చారిత్రక నగరానికి ఆధునిక మణిహారం

చారిత్రక  నగరానికి ఆధునిక మణిహారం

శతాబ్దాల సంస్కృతి, చారిత్రక వైభవంతో అలరారుతున్న నగరానికి ఆధునిక మణిహారంగా నిలిచింది మెట్రో రైలు. నగర ముఖ చిత్రాన్నే పూర్తిగా మార్చేసింది. విశ్వనగరానికి బాటలు వేసింది. మూడు కారిడార్లు... 69 కిలోమీటర్లు..55 రైళ్లతో నిత్యం వెయ్యి ట్రిప్పులతో.. ప్రతిరోజూ 4 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. కాలుష్యరహిత..ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని పంచుతున్నది. ఓ సంస్థ అంతర్జాతీయంగా చేపట్టిన 99.8 శాతంతో మిగతా వాటికన్నా సమయపాలనలో హైదరాబాద్‌ మెట్రో రైలు అగ్రస్థానంలో నిలిచి.. భాగ్యనగర ఖ్యాతిని ఖండాంతరాలు దాటించింది. ఇలా చక్కని సేవలతో నగరవాసుల మనసు చూరగొంటున్నది హెచ్‌ఎంఆర్‌.

  • మూడు కారిడార్లు... 69 కిలోమీటర్లు
  • 55 రైళ్లతో నిత్యం వెయ్యి ట్రిప్పులు..
  • ప్రతిరోజూ 4 లక్షల మంది ప్రయాణం
  • మొబైల్‌ ఫోన్‌ ఉంటే చాలు.. క్యూఆర్‌ కోడ్‌తో టికెట్లు
  • సమయపాలనలోనూ ‘హైదరాబాద్‌ మెట్రో’యే అత్యుత్తమం
  • 99.8 శాతంతో మిగతా వాటికన్నా హెచ్‌ఎంఆర్‌దే అగ్రస్థానం


క్యూఆర్‌ కోడ్‌తో టికెటింగ్‌ 

మొబైల్‌ఫోన్‌ సౌకర్యంతో టికెట్లు తీసుకునే సౌకర్యాన్ని మెట్రోరైలు అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో నుంచి క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు జరిపి హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణించవచ్చు. ప్రయాణాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో  క్యూఆర్‌ కోడ్‌ టికెటింగ్‌ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 

ఈ విధానం ద్వారా స్టేషన్‌కు రాకుండానే ముందుగానే రాకపోకలకు సంబంధించిన టికెట్లు బుక్‌ చేసుకునే వీలుంటుంది. దీంతోపాటు స్టేషన్‌ ఎంట్రీలో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి రైలు ఎక్కిన తర్వాత గమ్యస్థానానికి  సంబంధించిన ఎగ్జిట్‌ గేట్‌ ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌(ఏఎఫ్‌సీ) దగ్గర క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే..వ్యాలెట్‌ నుంచి టికెట్‌ చార్జ్జి కట్‌ అవుతుంది. ఈ విధానంపై ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తున్నది.


సుందరీకరణకు..

ప్రయాణ సౌకర్యం అందించడంతో పాటు మెట్రో మార్గంలో సుందరీకరణకు రూ.45 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అందమైన పూదోటలు, పచ్చని పరిసరాలు, మొక్కల పెంపకంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అనేక నగరాలు కాలుష్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నందు వల్ల భాగ్యనగరానికి అటువంటి పరిస్థితి రావద్దనే ఉద్దేశ్యంతో దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు కూడా ఉండడంతో గ్రీనరీపై దృష్టి సారించారు. మెట్రోమార్గంలో అందమైన కళాకండాలతో కూడిన స్ట్రీట్‌ ఫర్నిచర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 


విద్యుత్తు వాహనాలకే ప్రాధాన్యత..

పర్యావరణ పరిరక్షణలో హెచ్‌ఎంఆర్‌ ముందున్నది. బ్యాటరీతో నడిచేవి , ఇకో ఫ్రెండ్లీ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తున్నారు.  మెట్రోస్టేషన్ల పరిధిలోని బస్టాండ్లలో సోలార్‌ రూఫ్‌ టాప్‌లు, ఎలక్ట్రికల్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లను మెట్రో కారిడార్లలో ఏర్పాటు చేశారు. వాహనానికి సంబంధించిన బ్యాటరీ అయిపోతే.. ఫుల్‌చార్జ్జి ఉన్న బ్యాటరీని వాహనాలకు బిగించుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇతర రాష్ర్టాల నుంచి ఆటోలు తెప్పిస్తున్నారు. దానిపై మెట్రోరైలు స్టేషన్లు, రూట్‌కు సంబంధించిన వివరాలు పొందుపరుస్తారు. అలాగే  రూ.100 కోట్లతో 500 బైస్కిల్‌ స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నారు. 


సమయపాలనలో సూపర్‌...

ప్రయాణికుల మనసులు చూరగొనడంలో హైదరాబాద్‌ మెట్రోరైలు ముందున్నది. సమయపాలనలో 99.8 శాతంతో మిగతా మెట్రో ప్రాజెక్టులను  వెనక్కి నెట్టేసి ముందు వరుసలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా  కియోలీస్‌ సంస్థ జరిపిన  సర్వేలో హైదరాబాద్‌ మెట్రోరైలు అగ్రస్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కియోలీస్‌ సంస్థ 30 ప్రాజెక్టులను ఆపరేట్‌ చేస్తుండగా, వీటన్నింటిపై సర్వే చేసింది. ఇందులో సమయపాలనలో మన మెట్రోయే  ఉన్నతంగా నిలిచింది. సుఖవంతమైన ప్రయాణమే కాకుండా సామాజిక చైతన్యం, సామాజిక బాధ్యత వంటి విషయాలపై కూడా మెట్రో రైలు భేష్‌ అనిపించుకుంటున్నది. 


మెట్రో రైలు ఒక్కో ట్రిప్పునకు విద్యుత్‌ వినియోగం ఇలా

కారిడార్‌ -1: మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌

(29 కిలోమీటర్లు)-450 యూనిట్లు

కారిడార్‌ -2: జేబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా  

(15 కిలోమీటర్లు)- 300 యూనిట్లు

కారిడార్‌ -3: నాగోల్‌ నుంచి రాయదుర్గం 

(29 కిలోమీటర్లు)    450 యూనిట్లు


మన మెట్రో బెస్ట్‌

ప్రతిష్టాత్మకంగా  నిర్మించిన మెట్రోరైలు ప్రాజెక్టు ఆశించినట్లే ఆదాయం తెస్తున్నది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా నిర్మించిన మెట్రోలతో పోలిస్తే అతి తక్కువ కాలంలో బ్రేక్‌ఈవెన్‌కు వచ్చిన హైదరాబాద్‌ మెట్రోరైలు.. సరికొత్త రికార్డును నెలకొల్పింది. ప్రతిరోజూ సుమారు 4 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. మొత్తంగా ప్రతి నెలా రూ.40 కోట్ల ఆదాయంతో హెచ్‌ఎంఆర్‌ దూసుకుపోతున్నది. ఆపరేషన్స్‌ కోసం ప్రతినెలా సుమారు రూ.40 కోట్ల ఖర్చు వస్తుండగా, అంతే ఆదాయం వస్తుండడం గమనార్హం.  దీంతో లాభం, నష్టం లేకుండా మెట్రో దూసుకెళ్తున్నది. 


69 కిలోమీటర్లు...

మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మార్గంలో ప్రయాణిస్తూ... సుమారు 4 లక్షలకు మించి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నది హైదరాబాద్‌ మెట్రో రైలు. ప్రతిరోజూ 55 రైళ్లతో 1,000 ట్రిప్పులు తిరుగుతూ.. అత్యుత్తమ సేవలందిస్తున్నది. కారిడార్‌-1(ఎల్బీనగర్‌- మియాపూర్‌) 29 కిలోమీటర్ల మార్గంతో 27 స్టేషన్లు, కారిడార్‌-2(జేబీఎస్‌-ఎంజీబీఎస్‌) 11 కిలోమీటర్లతో  9 స్టేషన్లు, కారిడార్‌ -3(నాగోల్‌-రాయదుర్గం) 29 కిలోమీటర్ల్ల మార్గంలో 24 స్టేషన్లతో రాకపోకలు సాగిస్తున్నది.


 ఫలక్‌నుమాకు..

మెట్రోకారిడార్‌-2 కు సంబంధించి సీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించనున్న మెట్రో మార్గంలో  ప్రముఖ చారిత్రక కట్టడాల పేర్లతో స్టేషన్లను నిర్మించనున్నారు.  సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ,  శంఫీర్‌గంజ్‌, ఫలక్‌నుమా స్టేషన్లను నిర్మించనున్నారు.  


రెండోదశ..

మొదటి దశ మెట్రోరైలు పనులు పూర్తయి అందుబాటులోకి రావడంతో రెండో దశ ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టిసారించింది. 62 కిలోమీటర్ల సంబంధించి సమగ్ర నివేదికను  ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ) ప్రభుత్వానికి సమర్పించింది. రెండోదశలో భాగంగా బీహెచ్‌ఈఎల్‌, హఫీజ్‌పేట్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, రేతీబౌలి, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, లక్డీకాపూల్‌ వరకు 31 కిలోమీటర్ల మెట్రో లైన్‌ను నిర్మించనున్నారు. ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వయా ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో ఓవైసీ హాస్పటల్‌, సైదాబాద్‌, ఫలక్‌నుమా మార్గం మీదుగా ఎయిర్‌పోర్టు వరకు మార్గం ఉంటుంది. అలాగే నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు  5 కిలోమీటర్ల మార్గాన్ని కూడా కలుపనున్నట్లు తెలిసింది. 


సమయానికి చేరుకుంటున్నాం..

గతంలో బస్సులు, క్యాబ్‌ల ద్వారా విధులకు హాజరు కావాలంటే చుక్కలు కనబడేవి. ఉప్పల్‌ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లాలంటే నరకమే. ప్రస్తుతం మెట్రోలో ప్రతిరోజూ నిర్ణీత సమయంలో చేరుకుంటున్నాం. ఏసీ ప్రయాణంతో పాటు ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్లగలుగుతున్నాం. ప్రభుత్వానికి, హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థకు కృతజ్ఞతలు. 

-నర్సింహ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌


త్వరగా చేరుకోవచ్చు..

అత్యవసర పని ఉండి త్వరగా చేరుకోవాలంటే మెట్రో ప్రయాణమే అత్యుత్తమైనది. ఆలస్యానికి తావులేకుండా త్వరితగతిన చేరుకునే వీలు కేవలం మెట్రో ద్వారానే సాధ్యమవుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల్లో మెట్రోలో ప్రయాణం ఆహ్లాదాన్ని పంచుతున్నది. 

-టి. గోపాల్‌, ఉప్పల్‌వాసి


ఎంతో మెరుగైంది..

హైదరాబాద్‌ మెట్రోరైలు సౌకర్యం ఒక విప్లవాత్మకమైన ప్రాజెక్టు. ప్రయాణ సౌకర్యం ఎంతో మెరుగైంది. నగరం కూడా అభివృద్ధి బాట పట్టనున్నది. బ్యాంకు ఉద్యోగిగా నేను ప్రతిరోజూ మెట్రోలో వెళ్తూ... ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను. రోడ్డు రవాణా సౌకర్యంతో పోలిస్తే మెట్రో ప్రయాణం ఎంతో ఉత్తమం. రెండోదశలో మెట్రో విస్తరణ ఉంటుందని విన్నాను. రెండోదశ విస్తరిస్తే.. క్యాబ్‌లు, ఆటోల అధిక చార్జీల బారం నుంచి  విముక్తి కలుగుతుంది. సోమాజిగూడ నుంచి నాగోల్‌ మధ్య ప్రయాణించేందుకు మెట్రోను మాత్రమే ఉపయోగిస్తా.

- సిద్ధు , బ్యాంకు ఉద్యోగి


ఇబ్బంది లేకుండా..

మెట్రో వచ్చిన నాటి నుంచి ఇతర ప్రయాణ సాధనాన్ని వాడటం లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా మెట్రోనే. దివ్యాంగులు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా అలసిపోకుండా ఎన్నో ఏర్పాట్లు చేశారు. మెట్రోకార్డులు, క్యూఆర్‌కోడ్‌ వంటి సౌకర్యాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. మెట్రో ప్రయాణానికి దీటైన ప్రయాణ సౌకర్యం మరొకటి లేదు. 

-టి. కృష్ణ, సీనియర్‌ సిటీజన్‌


logo
>>>>>>