గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 14, 2020 , 02:43:23

తుదిదశకు క్యాపింగ్‌ పనులు..

తుదిదశకు క్యాపింగ్‌ పనులు..
 • పరిసర గ్రామాలకు కాలుష్యం నుంచి ఉపశమనం
 • మొత్తం ఆరు దశల్లో.. మే నాటికి పూర్తయ్యే అవకాశం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :   వ్యర్థాలతో నిండిపోతున్న జవహర్‌ డంపింగ్‌యార్డును పర్యావరణ అనుకూల యార్డుగా మార్చాలనే తలంపుతో చేపట్టిన క్యాపింగ్‌ పనులు తుదిదశకు చేరుకున్నాయి. మొత్తం ఆరు దశల్లో నిర్వహించే ఈ పనులు వచ్చే మే నాటికి పూర్తవుతాయని అధికారులు భరోసానిస్తున్నారు. జవహర్‌నగర్‌ గ్రామ పరిధిలోని 339 ఎకరాల్లో 1994నుంచి డంపింగ్‌యార్డు కొనసాగుతుంది. నగరంలో రోజుకు సుమారు ఐదు వేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు వెలువడుతుండగా, వాటిని ఇక్కడికే తరలిస్తున్నారు. 2014వరకు వ్యర్థాలను గుట్టలుగుట్టలుగా పోస్తుండగా, ఆ తరువాత నుంచి శాస్త్రీయ ల్యాండ్‌ఫిల్‌ పద్ధతి చేపట్టారు. 


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత క్యాపింగ్‌ కోసం రూ. 144కోట్లు మంజూరుచేసింది. ఈ నేపథ్యంలో 2014కు ముందు వరకు పేరుకుపోయిన వ్యర్థాలను క్యాపింగ్‌ చేయడం ద్వారా భూగర్భజలాలు మరింత కాలుష్యం కాకుండా కాపాడవచ్చని, అలాగే వాయు కాలుష్యాన్ని పూర్తిగా అదుపుచేయవచ్చని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం క్యాపింగ్‌ పనులకు ఆదేశాలు జారీచేసింది. 2014వరకు ఇలా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు దాదాపు 12మిలియన్‌ టన్నులు ఉంటాయని అంచనా. క్యాపింగ్‌ పనులు చేపట్టిన జీహెచ్‌ఎంసీ, మొదటిదశలో వ్యర్థాలను 150మిల్లీమీటర్ల మందంతో మట్టితో కప్పివేస్తున్నారు. 


రాంకీ ఎన్విర్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహిస్తున్నారు. మొత్తం 4,44,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో యార్డు వ్యాపించి ఉండగా, ఇప్పటివరకు 3,40,000చ.మీ.లమేర మట్టి క్యాపింగ్‌ పనులు పూర్తి అయినట్లు అధికారులు వెల్లడించారు. 4,98,255క్యూబిక్‌ టన్నుల మట్టిని క్యాపింగ్‌కోసం వినియోగించినట్లు వారు పేర్కొన్నారు. 22ఎక్స్‌వేటర్లు, మూడు బుల్డోజర్లు, నాలుగు కంప్యాక్టర్లను పనుల కోసం వినియోగిస్తున్నట్లు చెప్పారు. డంపింగ్‌యార్డును పర్యావరణ అనుకూల యార్డుగా మార్చేందుకుగాను వివిధ పద్ధతులు ఉన్నప్పటికీ మన నగరంలోని పరిస్థితులకు క్యాపింగ్‌ విధానమే సరైనదని భావించి దీన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  


ఆరు దశల్లో క్యాపింగ్‌ పనులు 

 • అంతర్జాతీయ ప్రమాణాలు, శాస్త్రీయ పద్ధతిలో ఆరు దశలుగా క్యాపింగ్‌ ప్రక్రియ
 • మొదటిదశలో డంపింగ్‌యార్డును పూర్తిగా మట్టితో కప్పివేస్తారు.
 • ఇదే సమయంలో వ్యర్థాల్లోని విషవాయువులను బయటకు పంపడానికి 300 ఎం.ఎం. వ్యాసార్థంగల పైపులతో 20 మీటర్లలోతులో బోరుబావులను తవ్వుతారు.
 • డంప్‌యార్డ్‌ నుంచి వర్షపునీరు నేరుగా కిందికి జారే విధంగా ఏటవాలుగా సరిచేస్తారు
 • అనంతరం మట్టిపొరపై జియోసింథటిక్‌ క్లే లైనర్‌ ఏర్పాటుచేస్తారు.
 • తదుపరి దానిపై నుంచి జియోకంపోజిట్‌ లేయర్‌ను ఏర్పాటుచేస్తారు
 • చివరగా 45సెంటీమీటర్ల(ఒకటిన్నర అడుగు)మందంతో తిరిగి మట్టితో కూడిన పొరను ఏర్పాటుచేస్తారు.
 • ఈ తుది మట్టిపొరపై గడ్డి, మొక్కలను నాటుతారు.
 • వ్యర్థాల కిందిభాగం నుంచి విషవాయువులు బయటకు రావడానికి వీలుగా క్యాపింగ్‌ అనంతరం డంపింగ్‌పై బోరు బావుల మాదిరిగా పైప్‌లైన్‌ను జొప్పించి వాటిల్లోనుంచి సులభంగా వాయువులు వెళ్లే విధంగా ఏర్పాట్లుచేస్తారు.
 • ఇలా వెలువడే వాయువులు, డంపింగ్‌యార్డు నుంచి వచ్చే వ్యర్థజలాలు(లీచెట్‌)ను ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ద్వారా శుభ్రపరుస్తారు.
 • శాశ్వత ప్రాతిపదికన చేపట్టనున్న ఈ భారీ క్యాపింగ్‌ ప్రక్రియను పాశ్చాత్య దేశాల్లో మినహా మనదేశంలోని ఏ ఇతర నగరాల్లోను ఇంత వైశాల్యంలో చేపట్టకపోవడం విశేషం.


మే నాటికి పనులు పూర్తి.. 

 ఈ ఏడాది మే చివరినాటికి పనులు పూర్తవుతాయని జీహెచ్‌ఎంసీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. వాస్తవానికి మొదలు నిర్ణయించిన మేరకు పనులు పూర్తయినప్పటికీ కొంతఅదనపు ప్రాంతంలో కూడా క్యాపింగ్‌ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడడంతో జాప్యం జరిగిందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 130ఎకరాల్లో క్యాపింగ్‌ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ మొదలు దాన్ని 110ఎకరాలకే పరిమితం చేశారని, ఈ పనులు పూర్తయ్యేలోగా మిగిలిన 20ఎకరాల్లో కూడా పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. మొదలు నిర్ణయించిన ప్రకారం గత ఏడాది జూన్‌లోనే పనులు పూర్తికావచ్చినప్పటికీ అదనపు ప్రాంతంలో కూడాపనులు చేపట్టాలని నిర్ణయించడం, ఈ ఏడాది వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా పనులు నిలిచిపోవడంతో జాప్యం జరిగిందన్నారు.  ఈ ఏడాది మేనాటికి మొత్తం 130ఎకరాల్లో డంపింగ్‌యార్డు పనులు పూర్తచేస్తామని సదరు అధికారి భరోసా వ్యక్తం చేశారు.


 సమీప ప్రజలకు ఉపశమనం.. 

 మంత్రి కేటీఆర్‌ కృషికారణంగా చేపట్టిన క్యాపింగ్‌ పనులతో సమీప భవిష్యత్తులో జవహర్‌నగర్‌ సహా సమీప గ్రామాలకు కాలుష్యంనుంచి విముక్తి లభించనున్నది. వ్యర్థాలనుంచి వెలువడే విషవాయువులు, వ్యర్థజలాలు భూమిలోకి ఇంకడం ద్వారా భూగర్భజలాలు కలుషితం కావడం, వేసవిలో డంప్‌యార్డులో మంటలు అంటుకొని పొగలు వ్యాపించడం, తద్వారా ప్రజలు రోగాలబారిన పడడం వంటి సమస్యలతో జవహర్‌నగర్‌సహా పరిసర గ్రామాల ప్రజలు అనేక దశాబ్ధాలుగా ఇబ్బంది పడుతున్నారు.


logo