సోమవారం 30 మార్చి 2020
Hyderabad - Mar 12, 2020 , 02:26:52

ప్రయాణం..సురక్షితం

ప్రయాణం..సురక్షితం
  • బయోడైవర్సిటీ పైవంతెన పై సత్ఫలితాలిస్తున్న రక్షణ చర్యలు
  • రెండు నెలలుగా ఒక్క ప్రమాదమూ లేదు
  • 40 కిలోమీటర్ల వేగం దాటితే జరిమానా

చందానగర్‌/కొండాపూర్‌, నమస్తే తెలంగాణ : నగరంలో ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌(ఎస్‌ఆర్‌డీపీ) చేపట్టింది. ఐటీ జోన్‌లోని ట్రాఫిక్‌ నియంత్రణకు ఎస్‌ఆర్‌డీపీ కింద నాలుగేండ్లలో అనేక ప్రాజెక్టులు చేపట్టారు. అందులో ముఖ్యమైనది గచ్చిబౌలి సైబరాబాద్‌ కమిషనరేట్‌ సమీపంలోని బయోడైవర్సిటీ జంక్షన్‌ ఫ్లై ఓవర్‌. రూ.45 కోట్లతో 990 మీటర్ల పొడవుతో యునీ డైరెక్షన్‌లో నిర్మించిన భారీ ఫ్లై ఓవర్‌ . గతేడాది చివర్లో పలు ప్రమాదాల కారణంగా మూత పడిన ఫ్లైఓవర్‌ అనేక రక్షణ చర్యల అనంతరం ఇటీవల తిరిగి ప్రారంభమైంది. రోడ్‌ సేఫ్టీ నిపుణుల సూచనలతో అటు ఎస్‌ఆర్‌డీపీ అధికారులు దాదాపు రూ.60 లక్షలతో అనేక రక్షణ చర్యలు తీసుకున్నారు. దాంతో పాటు ట్రాఫిక్‌ పోలీసుల వేగ నియంత్రణ చర్యలతో ఫ్లై ఓవర్‌పై ప్రస్తుతం రాకపోకలు పాఫీ సాగుతున్నాయి. గత రెండు నెలలుగా ఫ్లైఓవర్‌పైన, కిందా ఎలాంటి ప్రమాదాలు లేకుండా వాహనదారులు నిశ్చింతగా ప్రయాణిస్తున్నారు. 


40 కిలోమీటర్లు దాటితే రూ.1135 జరిమానా

ఫ్లై ఓవర్‌పై ఎస్‌ఆర్‌డీపీ అధికారులు రక్షణ చర్యలు చేపడితే, ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక నిబంధనలతో వాహన దారులు వేగంగా ప్రయాణించకుండా కట్టడి చేస్తున్నారు. ఫ్లై ఓవర్‌పై గంటకు 40 కిలోమీటర్ల వేగం మించకుండా ఆంక్షలు విధించారు. ఫ్లై ఓవర్‌పై ఆరు చోట్ల స్పీడ్‌ గన్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారికి రూ.1135 జరిమానాలు విధిస్తున్నారు. దీంతో చాలా వరకు వాహనాల వేగం తగ్గింది. అదేవిధంగా ఫ్లై ఓవర్‌పై రహదారిని మూడు లేన్లుగా విభజించారు. ఒక లేన్‌లో ద్విచక్ర వాహనాలు, మిగిలిన రెండు లేన్లలో కార్లు, ఇతర వాహనాలు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఫ్లై ఓవర్‌పై ప్రయాణం సాఫీగా సాగుతుంది. 


 బయోడైవర్సిటీ జంక్షన్‌లో తగ్గిన ట్రాఫిక్‌...

మెహిదీపట్నం, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఖాజాగూడ, నానాక్‌రాంగూడ ఐటీ కారిడార్‌ల నుంచి మాదాపూర్‌, నాలెడ్జ్‌సిటీ ఐటీ కారిడార్ల వైపు వెళ్లే వాహనదారులు పూర్తిగా ఫ్లైఓవర్‌ను వినియోగిస్తుండటంతో బయోడైవర్సిటీ జంక్షన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తగ్గిపోయాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభానికి ముందు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌ సిగ్నల్‌ను క్రాస్‌ చేయడానికి  20-30 నిమిషాలు  పట్టేది. కానీ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత 3 నుంచి 5 నిమిషాల్లోనే వెళ్తున్నారు.


ఫ్లై ఓవర్‌పై తీసుకున్న రక్షణ చర్యలు..

గ్యాంట్రీ సైన్‌ బోర్డులు: ఫ్లై ఓవర్‌పై ప్రయాణిస్తే ఏ ప్రాంతానికి వెళ్లొచ్చో తెలిసేలా ముఖ ద్వారం వద్ద భారీ సైన్‌బోర్డు(కమాన్‌) ఏర్పాటు

హజార్డ్‌ మార్కర్‌: ఫ్లై ఓవర్‌పై వన్‌ వేను మాత్రమే సూచించేలా రేడియంతో సూచిక బోర్డుల ఏర్పాటు

చెవరన్‌ మార్కింగ్‌: ఫ్లై ఓవర్‌ ప్రారంభంలో, చివరన.. మలుపులను సూచిస్తూ థర్మోప్లాస్టర్‌తో రోడ్‌కు స్టిక్కరింగ్‌

క్రాష్‌ కుషన్‌ ఫేస్‌: ఫ్లై ఓవర్‌ ప్రారంభంలో సేఫ్టీవాల్‌కు వాహనాలు తగిలినా.. గాయాలుకాకుండా మెత్తటి కుషన్‌ ఏర్పాటు

బైఫర్‌కేషన్‌ యారోస్‌: ఫ్లై ఓవర్‌ సమీపిస్తున్న చోట ముందు ఫ్లై ఓవర్‌ ఉందని సూచించే మార్కింగ్‌లు 

ప్రాపర్‌ లేన్‌ మెర్జింగ్‌: ఫ్లై ఓవర్‌పై రహదారిని మూడు లేన్లుగా విభజిస్తూ రబ్బర్‌ పెయింటింగ్‌ ఇండికేషన్‌లు

రంబుల్‌ స్ట్రిప్స్‌: వేగ నియంత్రణ కోసం 300 మి.మి. వెడల్పు, 15 మి.మి. ఎత్తుతో రబ్బరు స్పీడ్‌బ్రేకర్లు

కాషనరీ సైన్‌ బోర్డులు: గంటకు 40 కిలోమీటర్ల  నియమిత వేగాన్ని తెలియ చేస్తూ సూచిక బోర్డుల ఏర్పాటు

రోడ్‌ స్టడ్స్‌: రాత్రి వేళలో రోడ్డు క్లియర్‌గా కనిపించేలా ఫ్లై ఓవర్‌ పొడవునా రేడియంతో  ప్రత్యేక బిల్లల ఏర్పాటు

సర్వెలెన్స్‌ కెమెరాలు: ఫ్లై ఓవర్‌పై వాహనాల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా సీసీ కెమెరాల ఏర్పాటు

డెలినేటర్స్‌: రాత్రివేళ ఫ్లై ఓవర్‌ ఎక్కే చోట ఫ్లై ఓవర్‌కు దారి చూపుతూ రేడియంతో  ప్లాస్టిక్‌ స్తంభాల ఏర్పాటు

హై బారియర్‌: ఫ్లై ఓవర్‌కు పొడవునా దారికి ఇరువైపులా క్రాష్‌ బారియర్‌(సేఫ్టీవాల్‌)కు పైన మరో 1.5 మీటర్ల ఎత్తులో బారికేడ్ల ఏర్పాటు


logo