మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 12, 2020 , 02:25:03

150 వార్డుల్లో జీరో వేస్ట్‌ విధానం

150 వార్డుల్లో జీరో వేస్ట్‌ విధానం

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : స్మార్ట్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విధానం అమలులో మరో ముందడుగు పడింది. తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించడంతోపాటు దాన్ని శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్‌ చేసే ఈవిధానం ప్రయోగం సఫలం కావడంతో ప్రథమ దశలో నగరవ్యాప్తంగా 30వేల ఇండ్లలో ఈ విధానాన్ని జీహెచ్‌ఎంసీ చేపట్టింది. దీన్ని మలిదశలో మరిన్ని ఇండ్లకు విస్తరించి చివరికి నగరమంతా అమలు చేసేందుకు కార్యప్రణాళిక సిద్ధం చేశారు. నగరంలో రోజుకు ఐదున్నర వేల నుంచి ఆరువేల మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు వెలువడుతున్నట్లు అంచనా. ప్రస్తుతం ఈ వ్యర్థాలన్నీ జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. అక్కడే కొంత సెగ్రిగేషన్‌ ప్రక్రియ కొనసాగుతుంది. తడి చెత్తతో ఎరువు తయారీ, పొడి చెత్తను విడదీసి రీసైక్లింగ్‌కు ఉపయోగించడం జరుగుతున్నది. అయితే ఇండ్ల నుంచి తడి, పొడి చెత్తను విడదీయకపోవడం వల్ల ఇది సమర్థవంతంగా అమలుకావడం లేదు. అంతేకాదు, వ్యర్థాలన్నీ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు రవాణా ఖర్చులు ఎక్కువవుతున్నాయి. దీనివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతున్నది. పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగిపోతున్నది. దేశంలోని అన్ని నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో కేంద్ర పర్యావరణ శాఖ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనలు రూపొందించింది. మన రాష్ట్రంలో 2016లో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించినప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదేండ్ల క్రితమే నగరంలోని 22 లక్షల ఇండ్ల నుంచి ఇంటింటి చెత్త సేకరణకు 2500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను సమకూర్చడంతోపాటు చెత్తను ఇండ్లలో తడి, పొడిగా విడదీసేందుకు ప్రతి ఇంటికీ రెండేసి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. అయినా ఇండ్ల యజమానులు వాటిని సరిగా వినియోగించడం లేదు. ఒకవేళ కొందరు తడి, పొడి చెత్తను విడివిడిగా ఇచ్చినా ఆటో టిప్పర్ల కార్మికులు వాటిని కలిపి తీసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పకడ్బందీ పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. దీంతో అధికారులు ఇటీవల ప్రయోగాత్మకంగా రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 1500 ఫ్లాట్లున్న జనప్రియ అపార్ట్‌మెంట్‌ నివాస సముదాయంలో అర్బన్‌ రీబాక్స్‌ ఐటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో స్మార్ట్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇది విజయవంతం కావడంతో తాజాగా నగరవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించారు. ప్రతివార్డుల్లో 200 ఇండ్లను ఎంపిక చేసి 150 వార్డుల్లో మొత్తం 30 వేల ఇండ్లలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని సర్కిళ్ల అధికారులకు కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం స్టిక్కర్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నది. త్వరలోనే ఈప్రక్రియ పూర్తిచేసి ఒక్కో వార్డులో 200 ఇండ్లకు ఒక స్వచ్ఛ ఆటోను కేటాయించాలని నిర్ణయించారు. అనంతరం దశలవారీగా నగరమంతా అన్ని ఇండ్లకూ ఇదే విధానాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని కాటేదాన్‌లో ఆధునిక చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. అక్కడ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీ(సీఎస్‌ఆర్‌) కింద ఐటీసీ సంస్థ ఆధ్వర్యంలో సెగ్రిగేట్‌ చేసిన వ్యర్థాలను అక్కడ తిరిగి ఉపయోగంలోకి తెస్తున్నారు. ఇదే తరహాలో అన్ని సర్కిళ్లలోనూ సీఎస్‌ఆర్‌ కింద చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. 


logo
>>>>>>