సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 12, 2020 , 02:25:08

వడివడిగా పనులు.. సాకారమవనున్న కలలు

వడివడిగా పనులు.. సాకారమవనున్న కలలు

పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడానికి చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పనులు వడివడిగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ రూరల్‌ సర్కిల్‌ పరిధిలో 6,124 ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు కాగా.. సుమారు 2977 ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : సొంతిల్లు.. ప్రతి ఒక్కరి కల.. ఆ స్వప్నాన్ని పేదలందరికీ సాకారం అయ్యేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించకున్నా...క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే అవాంతరాలు, అడ్డంకులను అధిగమిస్తూ గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా విశాలమైన గృహ నిర్మాణాలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తున్న పేదల ఇండ్ల నిర్మాణ పనులు రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, వికారాబాద్‌ జిల్లాల్లో వడివడిగా జరుగుతున్నాయి. రహదారులు-భవనాల శాఖ హైదరాబాద్‌ రూరల్‌ సర్కిల్‌ పరిధిలో 6,124 ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు కాగా దాదాపు 2977 ఇండ్ల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే లబ్ధిదారుల ఎంపిక, పంపిణీకి సన్నద్ధమవుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని, లక్ష్యంలోపు ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రహదారులు-భవనాల శాఖ హైదరాబాద్‌ రూరల్‌ సర్కిల్‌ ఎస్‌ఈ పి. రమేశ్‌బాబు పేర్కొన్నారు.  

ఇండ్ల పేరిట వసూళ్లు చేస్తే కఠిన చర్యలు

డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కేటాయింపుల్లో ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తున్నది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో పారదర్శకత పాటిస్తున్నది. అయితే ఇటీవల గ్రేటర్‌తో పాటు పలు ప్రాంతాల్లో కొంతమంది బ్రోకర్లు, దళారులు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఇప్పిస్తామంటూ వసూళ్లు చేస్తున్నారనే వదంతులతో అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు వారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. దళారులను ఆశ్రయిస్తే ఇండ్ల కేటాయింపులు నిలిపివేస్తామని కరాఖండిగా చెబుతున్నారు. అర్హులైన వారికి కొంత ఆలస్యమైనా విడుతల వారీగా ఇండ్లు అప్పగిస్తామని, అంతేకానీ దళారులు, ఇండ్లు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పే వారిని ఆశ్రయించొద్దని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సూచించారు. అలాంటి వారిని గుర్తించి, పోలీసులకు అప్పగించాలంటూ అటు పార్టీ కార్యకర్తలతో పాటు లబ్ధిదారులకు సైతం సూచించారు. లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.


logo