శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 12, 2020 , 01:58:15

24న అభివృద్ధి పనులకు శంకుస్థాపన

24న అభివృద్ధి పనులకు శంకుస్థాపన

బేగంపేట : సనత్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో ఈనెల 24వ తేదీన మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జలమండలి ఎండీ దానకిశోర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, కలెక్టర్‌ శ్వేతామహంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. 24వ తేదీ ఉదయం 9.30 గంటలకు మంత్రి కేటీఆర్‌ మొదటగా రూ.90లక్షల నిధులతో బల్కంపేట గ్రేవ్‌ యార్డ్‌కు ప్రహారి గోడ, ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఈ శ్మశాన వాటికలో దాదాపు కోటి 8 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. అనంతరం రూ.35 కోట్లతో ప్రతిపాదించిన ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి విస్తరణ పనులు పరిశీలిస్తారన్నారు. అనంతరం ఏడు కోట్లతో సనత్‌నగర్‌ వెల్ఫేర్‌ గ్రౌండ్‌లో నిర్మించిన మల్టీస్టోర్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారన్నారు. అటుపై సనత్‌నగర్‌ ఇండస్ట్రీయల్‌ పార్క్‌ నుంచి నర్సాపూర్‌ చౌరస్తా వరకు రైల్వే శాఖ సహకారంతో చేపట్టనున్న ఆర్‌యూబీ నిర్మాణ పనులకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలిస్తారని తెలిపారు. మోండా మార్కెట్‌ పరిధిలోని సంతోష్‌ స్వీట్‌ హౌస్‌ నుంచి రైల్వే స్టేషన్‌ వరకు కోటి రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయనున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం ఆదయ్యనగర్‌లో మూడు కోట్లతో నిర్మించిన స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌, మూడున్నర కోట్లతో నిర్మించిన లైబ్రరీ భవనాన్ని ప్రారంభిస్తారని వివరించారు. అనంతరం రూ.25లక్షలతో ఆదయ్యనగర్‌లో రిజర్వాయర్‌ నిర్మాణ పనులను ప్రారంభిస్తారని చెప్పారు. తదనంతరం బన్సీలాల్‌పేట కమాన్‌ నుంచి మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌ వరకు చేపట్టనున్న వీడీసీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఇక్కడి నుంచి నేరుగా జియాగూడలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభిస్తారని చెప్పారు. ప్రారంభోత్సవాల నాటికి పెండింగ్‌ పనులు ఏమైనా ఉంటే సత్వరమే పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్న బస్తీ దవాఖానకు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఓ ఇంటిని కేటాయించాలని కలెక్టర్‌ శ్వేతా మహంతిని ఆదేశించారు. ఈ సమావేశంలో హెచ్‌ఆర్‌డీ సీఈ వసంత, హౌసింగ్‌ సీఈ సురేశ్‌, ఈఈ వెంకట్‌దాస్‌రెడ్డి, కార్పొరేటర్‌లు అరుణగౌడ్‌, ఉప్పల తరుణి, శేషుకుమారి, లక్ష్మీబాల్‌రెడ్డి, హేమలత, ఆకుల రూప, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo