బుధవారం 08 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 12, 2020 , 01:57:08

నిజ జీవితంలో పోలీసులే రియల్‌ హీరోలు

నిజ జీవితంలో పోలీసులే రియల్‌ హీరోలు

శేరిలింగంపల్లి : నటులుగా తాము సినిమాల్లోనే హీరోలమని, నిజ జీవితంలో మాత్రం పోలీసులే రియల్‌ హీరోలని ప్రముఖ నటి రాశీఖన్నా అన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని ఇండియన్‌ బిజినెస్‌ స్కూల్‌లో సైబరాబాద్‌ వుమెన్‌ అండ్‌ చిల్డ్రన్స్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె పోలీసు విభాగంలో విశేష సేవలందించిన పలువురు అధికారులు, మహిళా సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నతనంలో పోలీసులంటే మగవాళ్లు మాత్రమే కనిపించే వారని, కానీ నేడు మగ పోలీసులతోపాటు మహిళలు కూడా అదే స్థాయిలో పోలీసు రంగంలో ఉన్నారన్నారు. ప్రతి మహిళ విజయం వెనుక మరో మహిళ దాగి ఉంటుందని, ఇది తన విషయంలోనూ రుజువైందని,తాను ఈరోజు నటిగా గుర్తింపు పొందడానికి తన అమ్మ ఎంతో చేయూతను అందించిందన్నారు. మహిళ అక్షరాస్యతతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు. వీ హబ్‌ సీఈవో దీప్తి రావుల మాట్లాడుతూ సవాళ్లతో కూడుకున్న బాధ్యతలను సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పుడే విజయాలు సొంతమవుతాయని, మహిళలు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ సైబరాబాద్‌ పోలీసులకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయంటే అది కేవలం మహిళల వల్లనే సాధ్యం అయిందన్నారు. మహిళల భద్రత కోసం అనేక వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతూ వాటి అమలుకు మహిళా పోలీసులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో డీసీపీ అనసూయ, ఐపీఎస్‌ అధికారిణి రితి రాజ్‌, అదనపు డీసీపీ ఇందిర, కవిత, మహిళా పోలీసు అధికారులు లావణ్య, చంద్రకళ, మహముదా బేగం, సునీతలతోపాటు పలువురు సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సభ్యులు, మహిళా పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. 


logo