గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 11, 2020 , 00:53:07

ఇంటి దీపం ఆరిపోయింది..

ఇంటి దీపం ఆరిపోయింది..

పెండ్లయిన ఐదేండ్లకు పుట్టిన ఒక్కగానొక్క గారాల పట్టి.. కండ్లముందే విగతజీవిగా మారింది. ఆ తల్లిదండ్రులకు తీరనిశోకాన్ని మిగిల్చింది. మధ్యాహ్న భోజనం చేసి చేతులు కడుక్కోవడానికి వెళ్లిన చిన్నారి, డ్రమ్ములో పడి మృతి చెందిన ఘటన కలచివేసింది.

  • డ్రమ్ములో పడి మూడేండ్ల చిన్నారి మృతి

పేట్‌బషీరాబాద్‌, మార్చి 10 :  లేకలేకపుట్టిన బిడ్డను  అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు.. విధి వక్రించి ఒక్కగానొక్క కూతురు నీటి డ్రమ్ములో పడి మృత్యువాత పడటం ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది. ఈ ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  పోలీసులు, కుటుంబీకులు  తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌, విజయనగరం జిల్లా సీతానగరం మండలం పునిబుచ్చంపేట గ్రామానికి చెందిన దాలి వెంకట్రావు బతుకు దెరువు కోసం  గత 10 సంవత్సరాల క్రితం నగరశివారులోని కొంపల్లికి వలస వచ్చి  సెంట్రింగ్‌ కార్మికుడిగా  స్థిరపడ్డాడు. కాగా  కొంపల్లిలోని మాలకుంటబావి ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకుని పది కుటుంబాల వరకు నివాసముంటున్నాయి. ఇందులో ఉండే వెంకట్రావుకు రాణితో వివాహమైన ఐదు సంవత్సరాలకు భాగ్యవతి(3) పట్టింది. అయితే పాప  మంగళవారం మధ్యాహ్నం  తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసింది.  


చేతులు కడుక్కుంటానని గుడిసె ముందున్న డ్రమ్ము వద్దకు వెళ్లింది.  అయితే సగం వరకే నీరుండటంతో పక్కనున్న డబ్బాను ఎక్కి చేతులు కడుగుతూ డ్రమ్ములో తలకిందులుగా పడింది. కాసేపటి తరువాత తల్లిదండ్రులు పాపను పిలిచినా పలుకకపోవడంతో బయటకు వచ్చి చూశారు. పాప డ్రమ్ములో తలకిందులుగా పడిఉంది. వెలుపలికి తీయగా  చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందిదని వైద్యులు నిర్థారించారు. లేకలేక పుట్టిన బిడ్డ మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల రోదనను చూసి అందరూ కంటతడిపెట్టారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


logo
>>>>>>