గురువారం 02 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 11, 2020 , 00:52:35

నీటి ఎద్దడి రానివ్వం..

నీటి ఎద్దడి రానివ్వం..
  • అదనంగా 23 వాటర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లు, 230 ట్యాంకర్లు
  • బుకింగ్‌ చేసిన 48 గంటల్లో మంచినీటి ట్యాంకర్‌ సరఫరా
  • నిరంతర పర్యవేక్షణకు10 మంది ప్రత్యేకాధికారులు
  • సమావేశంలో జలమండలి ఎండీ దానకిశోర్‌ వెల్లడి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  గ్రేటర్‌లో ఈ వేసవిలో మంచినీటి సరఫరాకు ఎటువంటి ఢోకా లేదని జలమండలి ఎండీ దానకిశోర్‌ స్పష్టం చేశారు.  అందుకు అవసరం మేరకు రిజర్వాయర్లలలో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయని, ఎక్కడ నీటి ఎద్దడి రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణపై మంగళవారం ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. నగరంలో వేసవి కాలంలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా రూ. 50 కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించిట్లు తెలిపారు. వేసవిలో నగర వాసుల నుంచి అధికంగా మంచినీటి డిమాండ్‌ తలెత్తే అవకాశం ఉంటుందని, ఇందుకు తగ్గట్టుగా ప్రత్యామ్నాయ మార్గాలతో సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసినట్లు తెలిపారు.


బుకింగ్‌ చేసిన 48 గంటల్లోగా ట్యాంకర్‌ 

ట్యాంకర్లు బుక్‌ చేసుకున్న 48 గంటల్లోగా ట్యాంకర్‌ వస్తుందని ఎండీ దానకిశోర్‌ హామీ నిచ్చారు. ఇప్పటికే ఉన్న ట్యాంకర్లకు తోడు అదనంగా మరో 230 అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 23 ఫిల్లింగ్‌ స్టేషన్లు, 110 ఫిల్లింగ్‌ పాయింట్లను అదనంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యుత్‌ కోత జరిగే ఫిల్లింగ్‌ స్టేషన్లను గుర్తించి, ట్యాంకర్ల మంచినీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా అదనపు మినీజనరేటర్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. 


నిరంతర పర్యవేక్షణ..  10 మంది అధికారులు 

 ఈ వేసవిలో మంచినీటి సరఫరా ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణకు 10 మంది ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు ఎండీ వివరించారు. ప్రతి రోజు ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎక్కడైనా మంచినీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే అక్కడ నల్లాలు, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో జరుగుతున్న మంచినీటి సరఫరా, లోప్రెషర్‌ పనులు, ఫిల్లింగ్‌ స్టేషన్లు పరిశీలించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించడానికి 100 మందితో థర్డ్‌పార్టీ తనిఖీలు చేపడతామన్నారు. 


ఈ నెలాఖరులోగా బోర్లు, ట్యాంకుల మరమ్మతు లు

 జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో ఇప్పటికే లోప్రెషర్‌ ప్రాంతాలను గుర్తించడం జరిగిందని ఎండీ తెలిపారు. ఆయాప్రాంతాల్లో ఉన్న బోర్‌వెల్స్‌ సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా అని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఆయా బోర్లకు రిపేరు చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న స్టాటిక్‌ ట్యాంకులకు రిపేరు చేయాలని, అవసరం ఉన్న చోట నూతనంగా స్టాటిక్‌ ట్యాంకులు ఏర్పాటు చేయాలని సూచించారు. కలుషిత నీటి వల్ల వృథాగా పోతున్న ప్రాంతాలను గుర్తించి, సమస్యను పరిష్కరించడానికి వాల్వ్‌లు, జంక్షన్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరులోగా బోర్లు, ట్యాంకుల మరమ్మతు పనులు పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, పి.ర వి, వీఎల్‌ ప్రవీణ్‌కుమార్‌లతో పాటు సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు. 


logo
>>>>>>