మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 11, 2020 , 00:51:12

అపరాజిత కాలనీలో.. చోరీ వెనుక ‘నేపాల్‌ గ్యాంగ్‌'

అపరాజిత కాలనీలో..  చోరీ వెనుక ‘నేపాల్‌ గ్యాంగ్‌'

ఖైరతాబాద్‌:గత 20 రోజులు క్రితం అపరాజిత కాలనీలోని  ఓ ఇంట్లో జరిగిన దొంగతనం వెనుక ‘నేపాల్‌ గ్యాంగ్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దిశగా పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు.సీసీ పుటేజీలను స్వాధీనం చేసుకున్నారు...ముగ్గురు హిందీ భాషలో ఇంట్లో వారిని బెదిరించినట్లు గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. 

ఆ రోజు ఏం జరిగింది...

అమీర్‌పేట లాల్‌బంగ్లా సమీపంలోని ఇంటి నం. 6-3-953/1/2, అపరాజిత కాలనీలో పద్మారఘురాజ్‌ (86), ఆమె కుమార్తె నందితా కపూర్‌ (56), మనుమరాలు కీర్తి యాసం (24) నివాసం ఉంటున్నారు. తెల్లవారు జామున గాఢ నిద్రలో ఉండగా గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశించారు. ఆ అలజడి గమనించి నందితా కపూర్‌ వారికి ఎదురుగా వెళ్లగా ఆమెను భయబ్రాంతులకు గురి చేశారు. డబ్బులు, నగదు ఇవ్వాలని బెదిరించారు. అందుకు నిరాకరించడంతో దొంగలు తమ వెంట తెచ్చుకున్న సుత్తెతో ఆమె తలపై మోదారు. ఆమె పెద్దగా అరుస్తూ కిందపడిపోగా,తల్లి పద్మారఘురాజ్‌, కూతురు కీర్తి అక్కడికి రాగా వారందరినీ బాత్‌రూమ్‌లో వేసి గడియపెట్టారు. తమ ఇంట్లో డబ్బులు, నగదు లేవని, లాకర్‌లో ఉన్నాయని చెప్పినా ఆ దొంగలు వినిపించుకోలేదు.ఇంట్లో బీరువాలు, కబోర్డులను డబ్బులు, నగల కోసం తనిఖీ చేశారు. ఎక్కడా ఏమీ లభించకపోవడంతో ఓటేబుల్‌పై ఉన్న రూ.1,500 తీసుకొని పరారయ్యారు. 

ముంబై టూ నేపాల్‌

నగరంలో చెడ్డీ గ్యాంగ్‌ లాంటి దొంగతనాల ఘటనల నేపధ్యంలో పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న నేతృత్వంలో డీఐ నాగయ్య, డీఎస్సై షఫీ, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు దొంగలు ముసుగులు ధరించినట్లు చెబుతుండగా, వారిని గుర్తించ డం పోలీసులకు సవాల్‌గా మారింది. సీసీ ఫుటేజీల ద్వారా ఆ దొంగల కదలికలను, విశ్వసనీయ వర్గాల సమాచారంతో ముందుకు సాగారు.అత్యాధునిక సెల్‌ఫోన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ద్వారా వారి కదలికలను గుర్తించారు. దొంగల ఆచూకీని తెలుసుకునేందుకు పోలీసు బృందాలు సైతం వందల కిలోమీటర్లు వారిని ఫాలో చేసినట్లు తెలిపారు. తొలుత వారు ముంబైకి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడికి నుంచి ఓ దొంగ దొడ్డి దారిలో నేపాల్‌కు వెళ్లినట్లు తెలుసుకున్నారు. పోలీసుల ప్రత్యేక బృందాలు ముంబాయిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అలాగే మరో దొంగ నేపాల్‌  ఉన్నట్లు గుర్తించగా, అతన్ని పట్టుకునేందుకు ఆ దేశానికి వెళ్లినట్లు తెలిసింది. నిందితులందరూ నేపాల్‌ దేశానికి చెందిన వారుగా పోలీసులు చెబుతున్నారు. త్వరలోనే నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెడుతామని డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.


logo
>>>>>>