గురువారం 09 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 11, 2020 , 00:48:20

నగరంలో ఎలివేటెడ్‌ ట్రామ్‌వే

నగరంలో ఎలివేటెడ్‌ ట్రామ్‌వే

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:నగరంలో మరో అత్యద్భుతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది. నగరంలో ఇప్పటికే ప్రతిపాదించిన బీఆర్‌టీఎస్‌ స్థానంలో ఎలివేటెడ్‌ ట్రామ్‌వే నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం(బీఆర్‌టీఎస్‌)తో పోల్చితే ట్రామ్‌వే మెరుగైన ప్రయాణ సౌకర్యంగా ఉండడంతోపాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుండడంతో ట్రామ్‌వే నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది. ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రోరైలుతో నగర రవాణా ముఖచిత్రం మారిన నేపథ్యంలో మరో ఎలివేటెడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం అందుబాటులోకి తెస్తున్నారు. నగరంలో పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చేయడంలో ఇప్పటికే హైదరాబాద్‌ మెట్రోరైలు దాదాపు విజయవంతమైనది. ఇదే కోవలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేని ట్రామ్‌వే  ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఎలివేటెడ్‌ ట్రామ్‌వే పేరుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్‌ ఇబ్బంది తీరడంతోపాటు పర్యావరణ ముప్పు కూడా తప్పనుంది. భారతీయ నగరాలతోపాటు ప్రపంచ నగరాల్లో ట్రామ్‌వే సిస్టం రోడ్డు మీద విజయవంతమవుతుండగా హైదరాబాద్‌లో నిర్మించే ట్రామ్‌వేను ఎలివేటెడ్‌ వయాడక్ట్‌ మీద నిర్మిస్తున్నారు. చూడటానికి మొత్తం మెట్రోరైలు ప్రాజెక్టు మాదిరిగా కనబడినా ప్రయాణం విషయంలో మెట్రో కంటే తక్కువ సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటుంది. ఒక రకంగా మెట్రోరైలుతో పోలిస్తే ఎలివేటెడ్‌ ట్రామ్‌వే సిస్టం ఆపరేషన్స్‌, రాకపోకలు సులభంగా ఉండనున్నాయి. 


ఐటీ కారిడార్‌  కలుపుతూ 18 కిలోమీటర్ల నిర్మాణం

కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు నుంచి ప్రారంభమయ్యే ట్రామ్‌వే 18 కిలోమీటర్ల పొడవుతో నిర్మించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు. జేఎన్‌టీయూ నుంచి ఫోరమ్‌మాల్‌ మీదుగా హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ను కలుపుకుని, హెచ్‌ఐసీసీ ప్రాంగణాన్ని కలుపుకుంటూ శిల్పారామం మీదుగా హైటెక్‌సిటీ సమీపం నుంచి, ఐటీ కంపెనీల ఐటీ కారిడార్‌ను కలుపుకుంటూ మెట్రోకారిడార్‌ 3కు సంబంధించి మైండ్‌స్పేస్‌ మీదుగా గచ్చిబౌలినీ కలుపుకుంటూ నార్సింగి వద్ద ఉండే మెట్రోఎయిర్‌పోర్టు స్టేషన్‌కు అనుసంధానం అవుతుంది. ఇలా మెట్రో లో ఎక్కి మెట్రో నుంచి ట్రామ్‌వే ద్వారా ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌వేను కలుపుకుంటూ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించవచ్చు. కేపీహెచ్‌బీ నుంచి నార్సింగి ఎక్స్‌రోడ్డు వరకు నిర్మించే ఈ మార్గంలో నిత్యం రద్దీ ఉన్నందున ఎలివేటెడ్‌ ట్రామ్‌వే సిస్టంను నిర్మించనున్నారు. ఎలివేటెడ్‌ ట్రామ్‌వే సిస్టంలో ప్రయాణించే వారు లిఫ్టులు లేదా స్కైవేల్లో గమ్యస్థానాలకు చేరుతారు. మెట్రో, ఎంఎంటీఎస్‌ స్టేషన్లను స్కైవేలతో అనుసంధానిస్తారు.


పీపీపీ విధానంలోనే...

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు తరహాలోనే పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌(పీపీపీ)లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్య సంస్థగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రభుత్వ భాగస్వామ్యం కూడా దీనిలో ఉంటుంది.  ప్రభుత్వ సంస్థలైన హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, హెఎంఆర్‌ఎల్‌, హెఏఎంఎల్‌ ఇందులో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. డీపీఆర్‌ సిద్ధమయ్యాక ప్రాజెక్టు కోసం టెండర్లు ఆహ్వానిస్తారు.


బీఆర్‌టీఎస్‌తో పోల్చితే ట్రామ్‌వేతో ప్రయోజనాలు

బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం(బీఆర్‌టీఎస్‌)తో పోల్చితే ట్రామ్‌వేతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. బీఆర్‌టీఎస్‌ అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా ట్రామ్‌వేను చెబుతారు. నియోమెట్రో, లైటర్‌ ట్రైన్‌ సిస్టం(ఎల్‌టీఎస్‌) వంటి అధునాతన ప్రయాణ విధానాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రాంతాలు, పరిస్థితులు, నిర్మాణ అంచనా, భూసేకరణ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసుకుంటారు. తక్కువస్థలంలో ఎలివేటెడ్‌ వే నిర్మించడానికి ఎంతో వీలుంటుంది. బీఆర్‌టీఎస్‌తో పోలిస్తే నిర్మాణ వ్యయం కూడా 25 నుంచి 35శాతం వరకు తగ్గుతుంది. వయాడక్ట్‌ వెడల్పు ఎక్కువగా బీఆర్‌టీఎస్‌కు అవసరమవగా ఒకే వయాడక్ట్‌ మీద రెండు రాకపోకలకు సంబంధించిన ట్రామ్‌వేలు నిర్మించే వీలుంటుంది. బీఆర్‌టీఎస్‌ లో టికెటింగ్‌ విధానంతో పోలిస్తే ట్రామ్‌వే టికెటింగ్‌తో బోర్డింగ్‌ విధానం సౌకర్యవంతంగా ఉంటుంది. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు నేషనల్‌ అర్బన్‌ ట్రాన్స్‌పోర్టు పాలసీ(ఎన్‌యూటీపీ) వీటిని ప్రోత్సహిస్తున్నది. కాలుష్యం లేకుండా విద్యుత్‌తో మెట్రోరైలు మాదిరిగా వయాడక్ట్‌లో ట్రాక్‌లు, పైన విద్యుత్‌ వైర్లతో పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన ఏసీ ప్రయాణం ఉంటుంది.


logo