శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 11, 2020 , 00:45:04

ఎస్కలేటర్లతో.... ఎఫ్‌వోబీలు

ఎస్కలేటర్లతో.... ఎఫ్‌వోబీలు

హైదర్‌నగర్‌:  పాదచారుల భద్రతకు ప్రభుత్వం, బల్దియా అధిక ప్రాధాన్యతనిస్తున్నది. జాతీయ రహదారులపై దూసుకెళ్తున్న వాహనాలను తప్పించుకుంటూ రహదారిని దాటుతూ ఎందరో పాదచారులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ తరహా ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు అక్కడక్కడా పాదచారుల రక్షణ కోసం  పైవంతెలను నిర్మించిన సంగతి తెలిసిందే.  ఈ అంశానికి అధిక ప్రాధాన్యతనిచ్చిన బల్దియా అధికారులు ప్రధానంగా ఐటీకి కేంద్రమైన వెస్ట్‌ జోన్‌ శేరిలింగంపల్లి పరిధిలో 9  పైవంతెనలను నిర్మించనున్నది. ఇందుకు సం బంధించి ఇప్పటికే టెండర్‌ ప్రక్రియతోపాటు వర్క్‌ఆర్డర్లు సైతం జారీ అయ్యాయి. గుత్తేదారులకు సైతం పనులను కేటాయించడడంతోపాటు వారంరోజుల్లో నిర్మాణా లు ప్రారంభించాలని జోన్‌ అధికారులు భావిస్తున్నా రు. ఇప్పటివరకూ పైవంతెలను ఎక్కేందుకు నగర వ్యాప్తంగా సింహభాగం మెట్లే ఉండగా...వెస్ట్‌ జోన్‌ పరిధిలో కొత్తగా నిర్మించబోతున్న 9 పై వంతెనలకుగానూ 6 ప్రాంతాల్లో ఎస్కలేటర్‌ వసతిని కల్పిస్తున్నారు.  ఈ వినూత్న వసతిని పాదచారులు మరింతగా వినియోగించుకుంటారని అధికారులు భావిస్తున్నారు.. 


రూ.52.25 కోట్లతో నిర్మాణం

వెస్ట్‌జోన్‌ పరిధిలోని 9 ప్రాంతాల్లో పాదచారుల సౌకర్యార్థం పైవంతెలను నిర్మిస్తున్నా రు.  వీటిలో ఈఎస్‌ఐ, సాంటామారియా పాఠశాల,  ఐడీబీఐ గచ్చిబౌలి, భాను టౌన్‌షిప్‌, సైబర్‌ గేట్‌వే, గచ్చిబౌలి టెలికంనగర్‌, గంగారంలోని  చెన్నై షాపింగ్‌మాల్‌,  మదీనాగూడ విజేత సూపర్‌ మార్కెట్‌,  ఆల్విన్‌ కూడలి,  ఇంద్రానగర్‌లలో వీటిని నిర్మించనున్నారు. రూ.52.25 కోట్ల వ్యయంతో వీటి నిర్మాణాన్ని చేపడుతున్నారు.  అయితే వీటిలో  సైబర్‌ సిటీ, టెలికాంనగర్‌, చెన్నై షాపింగ్‌మాల్‌, విజేత సూపర్‌మార్కెట్‌,  ఆల్విన్‌ క్రాస్‌ రోడ్స్‌ ప్రాంతాల్లో  మెట్లకు బదులు ఎస్కలేటర్‌ వసతిని కల్పిస్తున్నారు.  బేస్‌మెంట్‌ వరకు ఎస్కలేటర్‌ ద్వారా చేరుకొని అక్కడి నుంచి పైవంతెన మీదుగా రహదారిని దాటి తిరిగి ఎస్కలేటర్‌ సహాయంతో కిందకు దిగే వసతిని కల్పిస్తారు.  వెస్ట్‌జోన్‌ పరిధిలోని 9 ప్రాంతాల్లో పైవంతెనలను నిర్మించబోతున్న దృష్ట్యా నిత్యం ఆయా ప్రాంతాల్లో కలిపి సుమారు 40వేలకు పైగా ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవచ్చునని అధికారుల అంచనా వేస్తున్నారు. వాస్తవానికి రాయదుర్గం కూడలి వద్ద సైతం పాదచారుల వంతెన నిర్మించేందుకు ప్రతిపాదన ఉన్నప్పటికీ అక్కడి కూడలి వద్ద స్థలాభావం ఉన్నట్లు ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు. మున్ముందు ఇక్కడా నిర్మాణం చేపట్టే ప్రతిపాదన ఉన్నట్లు చెబుతున్నారు.


logo