శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 10, 2020 , 03:51:05

మూసీలో మట్టిదిబ్బలను.. తక్షణమే తొలగించాలి

మూసీలో మట్టిదిబ్బలను.. తక్షణమే తొలగించాలి

ఎల్బీనగర్‌/ అంబర్‌పేట/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మూసీ నది పరివాహక ప్రాంతంలోఅనేక చోట్ల కొందరు అక్రమంగా అధికారుల కళ్లు గప్పి వేస్తున్న మట్టి దిబ్బలను, భవ నిర్మాణ వ్యర్థాలను వ్యర్థాలను తక్షణం తొలగించాలని మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్‌ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది అక్రమించకుండా పరివాహక ప్రాంత కాలనీ వాసులు జాగ్రత్త పడాలని, వీటి పరిరక్షణకు సెక్యూరిటీ సిబ్బందిని నియమించాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశానుసారం క్షేత్రస్థాయిలో మూసీ నది పరివాహక ప్రాంతంలో పరిస్థితులను, జరుగుతున్న పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఉదయం నాలుగున్నర గంటల నుంచి మూసీ పరీవాహక ప్రాంతాలైన అంబర్‌పేట ఎస్టీపీ, ఆలీకేఫ్‌, నాగోల్‌, ఉప్పల్‌ బ్రిడ్జి, ఎల్బీనగర్‌లోని చైతన్యపురి, భవానీ నగర్‌, ఫణిగిరి కాలనీ, ద్వారకాపురం, చాదర్‌ఘాట్‌, ఎంజీ బస్‌ స్టేషన్‌ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. మూసీ సుందరీకరణలో అవసరమైన ప్రాంతాల్లో ట్రాక్‌ నిర్మించడం, మూసీకి రెండు వైపులా వెయ్యి మీటర్ల చొప్పున రోడ్లు , పార్కులు ఏర్పాటు చేసే ప్రతిపాదిత స్థలాలను పర్యవేక్షించారు. సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ముందుచూపుతో మూసీ సుందరీకరణ, ప్రక్షాళన పనులకు బడ్జెట్‌లో అత్యధిక నిధులు కేటాయించినందుకు ఈ సందర్భంగా సుధీర్‌ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


మూసీ చేపలపై అధ్యయనం చేయండి 

మూసీ నది నుంచి 330 ఫీట్ల లోతు బోరు నీటిని, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గడ్డి క్వాలిటీని ఈ గడ్డి తిప్ప పశువుల పాల క్వాలిటీ పండిన పండ్లు కూరగాయలు, ధాన్యం మూసీ ప్రాంతంలో ఉన్నటువంటి గాలి క్వాలిటీ ఏ విధంగా ఉందో పరిశీలించి రిపోర్టు సిద్ధం చేయాలని దేవిరెడ్డి సుదీర్‌ రెడ్డి అధికారులకు ఆదేశించారు. మూసీ నదిలో చేపలను ల్యాబ్‌కి పంపించి నివేదిక ఇవ్వాలన్నారు. రానున్న రోజులలో సీఎం కేసీఆర్‌ విజన్‌కు అనుగుణంగా మూసీ ప్రక్షాళనతో పాటు సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని, అధికారులంతా సమన్వయంతో పనిచేసి మూసీ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌, హెచ్‌ఎండీఏ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్‌ మాలతి, ఈఈ నూర్‌ అహ్మద్‌,  నాగోల్‌ కార్పొరేటర్‌ సంగీత, చైతన్యపురి కార్పొరేటర్‌ జిన్నారం విఠల్‌రెడ్డి, ఇతర సాంకేతిక అధికారులు పాల్గొన్నారు. logo