శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 10, 2020 , 03:49:47

చరిత్రలో నిలిచేలా.. అభివృద్ధి

చరిత్రలో నిలిచేలా.. అభివృద్ధి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:  రాష్ట్ర బడ్జెట్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా నగరానికి రూ.10వేల కోట్లు కేటాయించడంపట్ల ఆనందం వ్యక్తంచేస్తూ మేయర్‌ నేతృత్వంలో నగర కార్పొరేటర్లు సోమవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అలాగే, నిధులు వచ్చేందుకు కృషిచేసిన పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే విషయంలో సీఎం కేసీఆర్‌కు  ఓ స్పష్టమైన అభిప్రాయం ఉందని, ఇందుకు అనుగుణంగానే ఐదేండ్లలో రూ. 50వేల కోట్లు నగరానికి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నగరానికి అవసరమైన వివిధ అభివృద్ధి పథకాలతో ఓ సమగ్రమైన మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి దాన్ని అమలుచేస్తామని మేయర్‌ వెల్లడించారు. బడ్జెట్‌ నిధులను ఏఏ పనులకు ఎంత ఖర్చుచేయాలనేది త్వరలో వాటర్‌బోర్డు, హెచ్‌ఎండీఏ, మూసీ రివర్‌ఫ్రంట్‌ కార్పొరేషన్‌, రోడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తదితర విభాగాలు చర్చించి ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాయని పేర్కొన్నారు.


నీటిపారుదల ప్రాజక్టులతోపాటు మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి ప్రతిష్టాత్మక ప్రాజక్టులు తుదిదశకు చేరుకోవడంతో  హైదరాబాద్‌ సమగ్రాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నారు. నగరాన్ని ఓ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు, ఈ విషయాన్ని ఇది వరకే సీఎం కేసీఆర్‌తో పాటు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ పలుదఫాలు స్పష్టంచేశారని గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీకి ప్రస్తుతం వస్తున్న ఆదాయం అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు సరిపోదనే ఉద్దేశంతో ప్రభుత్వం భారీగా నిధులు విడుదలచేయాలని సంకల్పించిందన్నారు. మూసీలో ఎటువంటి మురికికాలువలు కలవకుండా అవకాశం ఉన్నచోట మురుగుశుద్ధి ప్లాంట్లను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. 


పంపిణీకి సిద్ధంగా 25000 గృహాలు..

ఇప్పటికే అంతర్జాతీయ ఏజెన్సీలతో అభివృద్ధి నమూనాలు రూపొందించినట్లు, త్వరలో వీటిని ఖరారు చేసి పనులు చేపడతారన్నారు. ఇరువైపులా కారిడార్ల నిర్మాణంతోపాటు మూసీ పరివాహక ప్రాంతాన్ని టూరిస్ట్‌ డెస్టినేషన్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. బస్తీ దవాఖానలు ప్రస్తుతం 123 కొనసాగుతుండగా, వాటిని 350కి పెంచనున్నట్లు తెలిపారు. నగరంలో ఇంకా పలుప్రాంతాల్లో నిరక్షరాశ్యులు ఉన్నట్లు సర్వేలో తేలిందని, నూటికి నూరుశాతం అక్షరాశ్యతగల నగరంగా తీర్చిదిద్దేదుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌రూంలో ఇప్పటికే  25000 గృహాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు, మరో 45వేల ఇళ్ల నిర్మాణం తుదిదశకు చేరుకున్నట్లు  వెల్లడించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో వాటి పంపిణీ కోసం మార్గదర్శకాలు రూపొందిస్తున్నారని, త్వరలోనే పంపిణీ ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. దుర్గం చెరువుపై కేబుల్‌ వైర్ల వంతెన నిర్మాణం సివిల్‌ పనులు మరో నెలరోజుల్లో పూర్తవుతాయన్నారు. దానికి అనుసంధానంగా నిర్మిస్తున్న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం-45ఫ్లైఓవర్‌ జూన్‌-జూలైనాటికి పూర్తవుతుందని అనంతరం ఇది పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి వస్తుందన్నారు.


వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా మొదటిదశలో చేపట్టిన ప్రాజక్టులు వచ్చే జూలైనాటికి పూర్తవుతాయన్నారు. షేక్‌పేట్‌, బాలానగర్‌, బహదూర్‌పురా, అంబర్‌పేట్‌ తదితర ఫ్లైఓవర్‌లకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నట్లు, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తిచెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారికే తప్ప ఇక్కడ ఒక్కరికి కూడా వ్యాధి సోకలేదన్నారు. అంటువ్యాధులను విజయవంతంగా ఎదుర్కొన్న అనుభవం మననగరానికి ఉందని, అందుకే కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని మేయర్‌ భరోసానిచ్చారు. logo