ఆదివారం 29 మార్చి 2020
Hyderabad - Mar 09, 2020 , 04:16:19

విశ్వనగరంగా..

విశ్వనగరంగా..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన నగరం హైదరాబాద్‌.. హెరిటేజ్‌గా, కల్చరల్‌గా, ఐటీ హబ్‌గా, ముఖ్యంగా పెట్టుబడులకు అనుకూలం వాతావరణంగా.. ఇలా భాగ్యనగరానికి ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు.. అందుకే హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరం స్థాయికి చేరుకునే దిశగా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా నిలపడమే లక్ష్యంగా మౌలిక వసతులు, ఇతర సౌకర్యాల కల్పనపై దృష్టి సారించింది. ఏడాదికి రూ.10వేల కోట్ల చొప్పున నిధులను కేటాయించి హైదరాబాద్‌ విశ్వనగర రూపును సంతరించుకునే లక్ష్యంగా ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు అగ్రతాంబూలం వేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల అభివృద్ధికి గాను ఆదివారం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పది వేల కోట్ల రూపాయల నిధులను కేటాయింపు ద్వారా నగరాభివృద్ధి మరింత వేగవంతం కానున్నదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 


తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుంచి హైదరాబాద్‌ నగర విస్తరణ దాని భవిష్యత్తుపైన స్పష్టమైన ఆలోచన ఉన్న సీఎం కేసీఆర్‌ మార్గదర్శనంలో హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధికి కృషి చేశారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌డీపీ లాంటి ప్రత్యేక కార్యక్రమాలతో మౌలిక వసతుల కోసం పెద్ద ఎత్తున నిధులను కేటాయించి ప్రజా రవాణాను మెరుగు పర్చారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే విధంగా ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లను ప్రజలకు ఉపయోగంలోకి తీసుకువచ్చారు. మెట్రో ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి మొదటి దశను పూర్తి చేశారు. రెండో దశ మెట్రో రైల్‌ కోసం వేగంగా ప్రణాళికలు కొనసాగుతున్నారు. మరిన్ని అభివృద్ధి పథకాలను కార్యరూపంలోకి తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తంగా గత ఆరేళ్ల కాలంగా హైదరాబాద్‌ నగరం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని సామాజిక ఆర్థిక సర్వే 2020లో వెల్లడించింది. ప్రభుత్వ శాఖల వారీగా సాధించిన పురోగతిని వివరించింది. ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు తీసుకున్న చర్యలను పేర్కొన్నది. 


 జీవన ప్రమాణాల పెంపునకు అర్బన్‌ పార్కులు 

 పర్యావరణం సరిగా లేనప్పుడు సంపద, సౌకర్యాలు ఎంత పెరిగినా మనిషి ప్రశాంతంగా జీవనం సాగించలేరు. ప్రపంచ వ్యాప్తంగా నేడు ఉష్ణోగ్రతలు పెరిగి, ఆక్సిజన్‌ తరిగి మానవ జీవితం దుర్భరంగా మారుతున్నది. ప్రధానంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు తద్వారా వాతావరణ సమతుల్యం కాపాడేందుకు, అధిక ఉష్ణోగ్రత తగ్గించేందుకు ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో అర్బన్‌ పార్కులను అభివృద్ధి పరుస్తున్నది. గుబురు పొదలతో, చెత్త చెదారాలతో  వృథాగా ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతాలు ప్రకృతి రమణీయ వాతావరణాన్ని తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయంగా ఖ్యాతి పొందుతున్న హైదరాబాద్‌ను మరింత ఉన్నత జీవన ప్రమాణాలు ఉన్న నగరంగా మార్చే చర్యల్లో భాగంగా  16 చోట్ల అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ (ఉద్యానవనం)లను ఏర్పాటు చర్యలు చేపట్టారు.  


సామాజిక ఆర్థిక సర్వేలోని అంశాలు 

 • రాజధాని మణిహారమైన ఔటర్‌ రింగు రోడ్డును రూ. 6, 696 కోట్లతో హెచ్‌ఎండీఏ చేపట్టారు. 158 కిలోమీటర్ల మేర రహదారిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. 
 • ఔటర్‌లో ‘స్మార్ట్‌' ప్రయాణానికి వీలుగా రూ. 68.74కోట్ల టోల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (టీఎంఎస్‌) ద్వారా టోల్‌ ఫ్లాజాల వద్ద వాహనదారులు ఆగాల్సిన పని లేకుండా నాన్‌స్టాఫ్‌ ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. 
 •  ఔటర్‌లో వేగ నియంత్రణకు అడ్డుకట్టవేయడం, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, వాహనచోదకులకు ముందస్తు సమాచారం అందించే హెచ్‌టీఎంఎస్‌ (హైవే ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) అందుబాటులోకి తీసుకువచ్చారు. 
 • గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు ఔటర్‌ మార్గాన్ని వెలుగుల మాయం చేశారు. రూ. 30 కోట్లతో 25 కిలోమీటర్ల మేర ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసి ప్రయాణాన్ని సులభతరం చేశారు. 
 • నగరం నలుమూలల నుంచి ఔటర్‌ రింగు రోడ్డుకు వెళ్లేందుకు వీలుగా రేడియల్‌ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. రూ. 287.51కోట్లతో హెచ్‌ఎండీఏ ఐదు చోట్ల రేడియల్‌ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేసింది. 
 • తెలంగాణకు హరితహారం పథకంలో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలో గడిచిన ఐదేండ్లలో 117.93 లక్షల మొక్కలను నాటారు. ఔటర్‌ రింగు రోడ్డులో పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టారు. 


 జలమండలికి రూ. 900. 80 కోట్లు

గ్రేటర్‌ ప్రజల తాగు, మురుగు అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా సమృద్ధ్దిగా నీరందించే కేటాయింపులు చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో భాగంగా జలమండలికి రూ. 900.80 కోట్లను కేటాయించారు. నగర దాహార్తికి పరిష్కారంగా చేపట్టిన కృష్ణా, గోదావరి, హడ్కో ప్రాజెక్టుల కింద రుణాలకు  ఈ నిధులను వెచ్చించనున్నారు.  2017-18 సంవత్సరంలో రూ.1420.50కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి  రూ. 1420.50కోట్లు కేటాయించారు. 2019-20 సంవత్సరంలో రూ. 825 కోట్లు కేటాయించగా, ఈ సారి అదనంగా రూ. 75కోట్లకు పైగా పెంచారు.  రుణాలకు రూ. 1005కోట్లు, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌, ఇతర కొత్త పథకాలకు రూ. 300కోట్ల మేర కేటాయించాలని ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించగా రూ. 900.80 కోట్లు కేటాయించారు. ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు, జైకా రుణాల చెల్లింపునకు రూ. 20 లక్షలు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు ప్రభుత్వం రూ. 20 లక్షలు కేటాయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 1670కోట్ల ప్రతిపాదనలు సమర్పించగా, ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు జైకా రుణాల చెల్లింపులకు ఇరవై లక్షలను కేటాయించారు. 


 ఆత్మగౌరవ భవనాలు..

 గ్రేటర్‌కు తలమానికంగా.. పలు చోట్ల స్థలాలు,  నిధుల కేటాయింపు

ప్రత్యేక రాష్ట్రంలోనే మాకు న్యాయం జరుగుతుందని నినాదించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రగతి సారథి సీఎం కేసీఆర్‌ అందరి ఆకాంక్షలు నెరవేర్చేందుకు తీవ్ర కసరత్తుచేసి ప్రతికులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించేందుకు స్థలాలు నిధులు మంజూరుచేశారు. ఇప్పటికే కొన్ని కులాలకు స్థలాలు, నిధుల కేటాయింపు పూర్తికాగా మరికొన్ని నిర్మాణాలు ప్రారంభమై పలు దశల్లో ఉన్నాయి. వీటిన్నింటిని పూర్తిచేస్తామని ప్రభుత్వం ఆదివారం బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించింది. ఈ భవనాలు గ్రేటర్‌కు తలమానికం కానున్నాయి. ఆయా వర్గాల పిల్లలకు హాస్టళ్లుగా, నైపుణ్యశిక్షణకేంద్రాలుగా సేవలందించనున్నాయి.


 • కోకాపేటలో గొల్లకుర్మ భవన్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయగా, నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
 • బంజారాహిల్స్‌లో ఒక్కోదానికి  రూ. 20 కోట్లు, మొత్తం రూ. 60 కోట్లతో బాబు జగ్జీవన్‌రాం, బంజార, కుమ్రంభీం భవనాలను నిర్మిస్తుండగా, ఇవి సైతం తుది దశకు చేరుకున్నాయి. 
 • రూ. 21 కోట్లతో బోరబండలో దళిత స్టడీసెంటర్‌ను నిర్మిస్తుండగా, నిర్మాణ పనులు తది దశలో ఉన్నాయి.
 •  క్రిస్టియన్లకు కోకాపేటలోనే స్థలాన్ని, నిధులను కేటాయించగా, ఇటీవలే శంకుస్థాపన చేశారు.
 •  కోకాపేటలో ముదిరాజ్‌ కులస్థులకు ఆత్మగౌరవ భవనం కోసం స్థలం, రూ. 5 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
 • మున్నూరుకాపులకు ఐదెకరాలు, రూ. ఐదుకోట్లు. 
 • దూదేకుల కులానికి మూడెకరాల స్థలం, రూ. 3 కోట్లు.
 • గంగపుత్రులు, విశ్వకర్మలకు రెండెకరాల స్థలం రూ. 2 కోట్లు.
 • నాయీబ్రాహ్మణులు, అరె క్షత్రీయ, వడ్డెర, కుమ్మరి, ఎరుకల, ఉప్పర, మేటి, బుడగజంగాలు, మేదర, పెరిక, చాత్తద, శ్రీవైష్ణవ, కటిక కులాలకు ఎకరం స్థలం రూ.కోటి, భట్రాజులకు ఉప్పల్‌ భగాయత్‌లో అర ఎకరం స్థలం, రూ. 50 లక్షలు చొప్పున స్థలాలు, నిధులను కేటాయిచింది.


logo