సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 09, 2020 , 04:08:31

‘మెట్రో’ విస్తరణ

‘మెట్రో’ విస్తరణ
  • త్వరలో మొదటిదశ పెండింగ్‌లో ఉన్న 5 కిలోమీటర్ల పనులు
  • రెండోదశ 62 కిలోమీటర్లకు గ్రీన్‌సిగ్నల్‌
  • నగరానికి కేటాయించిన రూ.10 వేల కోట్లలో.. మెట్రోకు నిధులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ కీలకంగా మారనున్నది. ఇప్పటికే మొదటి దశలో  69 కిలోమీటర్ల మేర ప్రయాణం అందుబాటులోకి రాగా, విస్తరణ వైపు అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే రెండో దశ మెట్రో రైలును అందుబాటులోకి తెస్తున్నది. అతి తక్కువ కాలంలో ఏ ఇతర మెట్రోరైలుకు సాధ్యం కాని బ్రేక్‌ ఇవెన్‌ను సొంతం చేసుకోవడం మెట్రోపై నగరవాసులు కనబరుస్తున్న ఆసక్తికి అద్దం పడుతున్నది. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో 62 కిలోమీటర్ల మెట్రోను విస్తరించాలనే ఆలోచనతో ప్రణాళికలు సిద్ధం చేసి,  దీనికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు.. మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు ఆపరేషన్స్‌ వల్ల  ప్రతి నెలా రూ.40 కోట్ల ఆదాయం వస్తుండగా అందులో రూ.30 కోట్లు ప్యాసింజర్‌ టికెట్ల నుంచి సమకూరుతున్నది. ప్రయాణికుల నుంచి డిమాండ్‌ పెరుగుతుండటంతో రద్దీ పెరుగుతుందని దీనిని దృష్టిలో పెట్టుకుని మరో రెండు అదనపు రైళ్లను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం 55 రైళ్ల ద్వారా రోజు వెయ్యి ట్రిప్పులు నడిపిస్తుండగా  కొత్తగా అందుబాటులోకి తెచ్చే  రెండు రైళ్లు ప్రయాణికులకు వారం రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశ పూర్తికావడం, రెండోదశ విస్తరణ చేపట్టి మెట్రో అందుబాటులోకి తేవడం ద్వారా నగరంలోని ఏ మూల నుంచైనా మరోమూలకు మెట్రోద్వారా ప్రయాణించవచ్చు. 


రెండోదశ విస్తరణలో ఎయిర్‌పోర్టుకు అనుసంధానం కానున్నది. నగరాభివృద్ధికి ఇది ఎంతదోహదపడతుంది.

రెండోదశ విస్తరణ.. : మొదటిదశ మెట్రోరైలు పనులు పూర్తికాగా రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనికి సంబంధించిన 62 కిలోమీటర్ల రెండోదశ మెట్రోరైలుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ (డీఎంఆర్‌సీ) డీపీఆర్‌ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. ఈ ప్రాజెక్టును కూడా చేపట్టాలని సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. పరిశీలన పూర్తి కాగా వెంటనే 62 కిలోమీటర్లకు సంబంధించిన మెట్రో విస్తరణ పనులు ప్రారంభమవుతాయి.  రెండోదశలో భాగంగా బీహెచ్‌ఈఎల్‌, హఫీజ్‌పేట్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, రేతీబౌలి, మెహిదీపట్నం, మాసాబ్‌ట్యాక్‌, లక్డీకాపూల్‌ వరకు 31 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.  ఎల్బీనగర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వయా ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో ఒవైసీ దవాఖాన, సైదాబాద్‌, ఫలక్‌నుమా మార్గం మీదుగా విమానాశ్రయానికి చేరుకుంటుంది. అదేవిధంగా నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు గల 5 కిలోమీటర్ల మార్గాన్ని కూడా కలుపుతారు. ఎలివేటెడ్‌ మెట్రోరైలు నిర్మించాంటే ఒక కిలోమీటర్‌ నిర్మాణానికి రూ.300 కోట్లు అవుతుంది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌  ఆదేశాల మేరకు మెట్రో నిర్మాణ వ్యయాన్ని తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా ప్రస్తుత బడ్జెట్‌లో నగరానికి కేటాయించిన రూ.10 వేల కోట్లలో మెట్రోరైలు కేటాయింపులున్నాయి.


త్వరలో పాతబస్తీకి.. 

మొదటి దశ మెట్రోలో భాగంగా ప్రతిపాదించిన మెట్రోరైలు నిర్మాణం అతిత్వరలో ప్రారంభం కానున్నది. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ప్రస్తావించారు. త్వరగా పనులు చేపట్టాలని మంత్రి కేటీఆర్‌ను కూడా ఆదేశించారు. ఎల్‌అండ్‌టీని పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని, స్థాని క ఎమ్మెల్యేలు దగ్గరుండి పూర్తిచేయించాలని సూచించారు. మొ త్తం మొదటి దశ ప్రాజెక్టులో మూడు కారిడార్లలో దాదాపు 74 కిలోమీటర్ల మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మించాల్సి ఉండగా మొత్తం 69 కిలోమీటర్లు పూర్తి చేశారు. మిగతా 5 కిలోమీటర్లు ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు నిర్మించాల్సి ఉన్నది. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే, మార్కింగ్‌ పను లు ప్రారంభం కాగా త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు.


logo