మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 09, 2020 , 03:55:01

తప్పు చేస్తే.. శిక్ష తప్పదు

తప్పు చేస్తే.. శిక్ష తప్పదు

ఖైరతాబాద్‌: ‘మహిళలపై లైంగిక దాడులు...దౌర్జన్యాలు....ఇతర నేరాలు చేసిన వారు చట్టాల్లో లొసుగులను అడ్డం పెట్టుకొని తప్పించుకుంటున్నారు....ఇక వారికి ఆ అవకాశం ఉండదు....తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా శిక్ష తప్పదు....2021 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఐపీసీ, సీఆర్‌పీసీలను తీసుకువస్తున్నది’..అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం రాత్రి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరుపుకొన్నారు. అనంతరం ‘ఉమెన్‌ ఇన్‌ ఇండియా....జెండర్‌ ఈక్వాలిటీ’ అనే అంశంపై జరిగిన సదస్సులో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ నిర్భయ ఘటనలో సుప్రీం కోర్టు దోషులకు ఉరిశిక్ష కూడా ఖరారు చేస్తే..చట్టంలోని లొసుగులు అడ్డం పెట్టుకుంటున్నారని, దీంతో ఉరి వాయిదా పడుతూ వస్తుందన్నారు. ఇక ముందు తప్పు చేసిన వాడికి తప్పనిసరిగా శిక్ష పడుతుందని, ఐపీసీ, సీఆర్‌పీసీల్లో మార్పులకు కేంద్ర ప్రభుత్వం న్యాయ నిపుణులు, రిటైర్డ్‌ పోలీసు అధికారులు, మహిళా సంఘాల సలహాలు, సూచనలు తీసుకుంటుందన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఆర్మీ చీఫ్‌గా మహిళకు బాధ్యతలు అప్పగించే యోచనలో ఉన్నామన్నారు. దేశవ్యాప్తంగా కేంద్రం పది కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తుందన్నారు. ప్రెస్‌క్లబ్‌ ఇండియా అధ్యక్షులు ఆనంద్‌ సహాయ్‌, ప్రధాన కార్యదర్శి అనంత్‌, హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్‌.విజయ్‌కుమార్‌రెడ్డి, బి.రాజమౌళిచారి, ఉపాధ్యక్షురాలు రెహనా బేగం, సహాయ కార్యదర్శులు కంబాలపల్లి కృష్ణ, హరిప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు ఉమాదేవి, యశోద, అనిల్‌ కుమార్‌, వసంత్‌కుమార్‌, నంద్యాల భూపాల్‌రెడ్డి, వీరగోని రజనీకాంత్‌ పాల్గొన్నారు.


logo
>>>>>>