శనివారం 04 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 08, 2020 , 01:27:26

అసమానతలను తుడిచి వేయాలి

అసమానతలను తుడిచి వేయాలి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మహిళలకు ప్రత్యేకంగా కిరీటాలు అక్కర్లేదని వారి తల ఓ కిరీటమని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అన్నారు.  ధాత్రీ మదర్స్‌ బ్రెస్ట్‌ మిల్క్‌ బ్యాంకు, సుషేనా హెల్త్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో లక్డీకాపూల్‌లోని నీలోఫర్‌ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ మాట్లాడుతూ..  మదర్‌ మిల్క్‌ బ్యాంకుల అవసరం చాలా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు బిడ్డలున్న తల్లులు వారి పాలను మగబిడ్డకు ఎక్కువగా ఇవ్వాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డ, మగబిడ్డ అనే అసమానతలను తుడిచివేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో పిల్లలు ఆరోగ్యం ఉండాలంటే పిల్లలకు తల్లిపాలు పట్టాల్సిందేనని హితవు పలికారు. వైద్యవృత్తి తొలిరోజుల్లోనే  తల్లి పాల నిధి ప్రాధాన్యతను గుర్తించామన్నారు. మదర్‌ బ్రెస్ట్‌ మిల్క్‌ బ్యాంక్‌ సేవలు  భవిష్యత్‌ తరాలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. మొబైల్‌ మదర్‌ మిల్క్‌ బ్యాంకులను ఏర్పాటు చేయడంపైన కూడా నిర్వాహకులు దృష్టి సారించాలన్నారు. 


ఈ క్రమంలో వైద్య పరికరాలను సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదురయితే ఐఐఐటీల సహాయం తీసుకోవాలని సూచించారు. మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని గవర్నర్‌ సూచించారు.సేంద్రియ పాలు అందిస్తున్న క్లిమామ్‌ వెల్‌నెస్‌ అండ్‌ ఫార్మ్స్‌ నిర్వాహకురాలు అల్లోల దివ్యారెడ్డి సేవలు అభినందనీయమన్నారు. ధాత్రి మిల్క్‌ బ్యాంకుకు పాలను అందించిన  తల్లులు హౌసినా బేగం, శారదా,గంగలక్ష్మి, పర్వీన్‌బేగం, కృష్ణ కుమారి, లైసీన్‌ బేగంలను గవర్నర్‌ సత్కరించారు.  కార్యక్రమంలో మెడికల్‌  ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌, డీసీపీ డాక్టర్‌ లావణ్యనాయక్‌, డాక్టర్‌ రంజని, డాక్టర్‌ ఉమాదేవి, ధాత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌, సుషేనా ఫౌండేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


logo