మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 07, 2020 , 06:08:17

పతకాల సిరి..

పతకాల సిరి..
  • జిమ్నాస్టిక్స్‌లో రాజ్‌భవన్‌ స్కూల్‌ విద్యార్థి ప్రతిభ
  • తొమ్మిదేండ్లకే 15 బంగారు పతకాలు

ఖైరతాబాద్‌:  రాజ్‌భవన్‌ స్కూల్‌ విద్యార్థి.. జిమ్నాస్టిక్స్‌లో పతకాల పంట పండిస్తున్నది. జిమ్నాస్టిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నది. నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేండ్ల మర్పడగ సిరిరెడ్డి చిన్న వయస్సులోనే అనేక బంగారు పతకాలు సాధించి...ఆదర్శంగా నిలుస్తున్నది.


నాలుగేండ్ల వయస్సులోనే..

  • ఎల్‌ఐసీలో సాఫ్ట్‌వేర్‌ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న ఖైరతాబాద్‌కు చెందిన మర్పడగ శ్రీపాల్‌ రెడ్డి, ప్రశాంతి రెడ్డిల కూతురు సిరిరెడ్డి నాలుగేండ్ల ప్రాయంలోనే ఈ క్రీడపై మక్కువ పెంచుకున్నది. క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో ఆమెను 2015 ఆగస్టులో విజయనగర్‌కాలనీలోని జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లి.. జిమ్నాస్టిక్‌ కోచ్‌ బి. బాలరాజును కలిశారు. ఆ చిన్నారిలో ఉన్న సంకల్పాన్ని గ్రహించిన ఆయన సిరిని శిష్యురాలిగా చేర్చుకున్నారు.  సహాయ కోచ్‌లు ఆర్‌. మణికంఠ, రిత్విక్‌, రిషబ్‌ల బృందం శిక్షణ ఇచ్చింది. ఎన్నో కఠోరమైన విన్యాసాలను అవలీలగా చేస్తూ సిరిరెడ్డి రాణించింది.
  • 2015  నవంబర్‌లో ట్విన్‌ సిటీస్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌లో ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ విభాగంలో మూడో స్థానం.
  • 2016- ఆగస్టులో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ హైదరాబాద్‌14ఏండ్ల లోపు విభాగం (బ్యాలెన్సింగ్‌ బీమ్‌)లో మూడో స్థానం. 
  • 2016 డిసెంబర్‌లో జిమ్నాస్టిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ బ్యాలెన్సింగ్‌ బీమ్‌లో రెండో స్థానం. ఫ్లోర్‌ ఎక్సర్‌సైజులో మొదటి స్థానం. అదే నెలలో గ్రేటర్‌  హైదరాబాద్‌ మున్సిపల్‌  కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లో  మొదటి స్థానం, టేబుల్‌ వాల్ట్‌లో ద్వితీయ స్థానం.
  • 2017 మార్చిలో హైదరాబాద్‌ జిల్లా జిమ్నాస్టిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌,  బ్యాలెన్సింగ్‌ భీమ్‌లో మొదటి స్థానం. అక్టోబర్‌లో జిమ్నాస్టిక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో   బ్యాలెన్సింగ్‌ భీమ్‌లో మూడో స్థానం, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లో రెండో స్థానం. 

2018 - ముంబైలో జరిగిన సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఉమెన్స్‌ జిమ్నాస్టిక్స్‌ మీట్‌లో టేబుల్‌ వాల్ట్‌, బ్యాలెన్సింగ్‌ భీమ్‌, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ విభాగాల్లో నాలుగో స్థానం,  ఆల్‌ రౌండ్‌ చాంపియన్‌ షిప్‌లో మూడో స్థానం. ముంబై ఆర్‌వైపీ కాంపీటీషన్స్‌లో  రాష్ట్ర స్థాయిలో ఎనిమిదో స్థానం.

2019 - జనవరిలో నిర్వహించిన బ్యాలెన్సింగ్‌ భీమ్‌, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌ విభాగాల్లో మొదటి స్థానం. ఫిబ్రవరిలో ముంబైలో జరిగిన సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఉమెన్స్‌ జిమ్నాస్టిక్స్‌ మీట్‌లో టేబుల్‌ వాల్ట్‌లో మొదటి స్థానం. జూలైలో హైదరాబాద్‌ జిల్లా జిమ్నాస్టిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో టేబుల్‌ వాల్ట్‌, ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌లో మొదటి స్థానం. నవంబర్‌లో రాష్ట్ర స్థాయి పోటీల్లో  ఫ్లోర్‌ ఎక్సర్‌సైజ్‌, బ్యాలెన్సింగ్‌ భీమ్‌, ఆల్‌ రౌండ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో రికార్డు స్థాయిలో మూడింటిలో మొదటి స్థానం. రాజస్థాన్‌ జోద్‌పూర్‌లో సబ్‌ జూనియర్‌ జాతీయ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో మొదటిస్థానం.  

2020  - జనవరిలో ఢిల్లీలో బ్యాలెన్సింగ్‌ భీమ్‌, టేబుల్‌ వాల్ట్‌లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు సాధించింది.       


15 బంగారు పతకాలు..

జిమ్నాస్టిక్స్‌లో తర్ఫీదు పొందిన కొద్ది రోజుల్లోనే సిరిరెడ్డి తన ప్రతిభను చాటుకున్నది. ప్రధానంగా ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌లో  పతకాలను పండిస్తూ ఔరా అనిపించింది. జిమ్నాస్టిక్‌ కోర్టులో అడుగుపెట్టిందంటే పతకంతోనే వెనుదిరిగేది. 2015 నుంచి 2020 వరకు 15 బంగారు పతకాలు, మూడు రజతం, నాలుగు కాంస్య పతకాలు సాధించింది.


సహాయం కోసం.. ఎదురుచూస్తున్నాం

జిమ్నాస్టిక్స్‌ అంటే మా కుమార్తెకు ప్రాణం. నాలుగేండ్ల వయస్సులోనే శిక్షణ ఇప్పించాం. కోచ్‌ బాలరాజ్‌ నేతృత్వంలో అద్భుతమైన శిక్షణ తీసుకుంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించింది. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మాకు ఆర్థికంగా వెనుకబాటు వెనకడుగు వేయిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పతకాలు సాధిస్తుందన్న నమ్మకం మా బిడ్డపై ఉంది. ప్రభుత్వం సాయమందించి ప్రోత్సహిస్తే తెలంగాణ కీర్తిని ఖండతరాలు చాటుతుంది. అంతర్జాతీయంగా ఈ క్రీడల్లో రాణిస్తున్నా స్పాన్సర్లు రావడం అరుదే. ఎంతో ప్రతిభ కలిగిన మా బిడ్డకు సహృదయులైన స్పాన్సర్లు ముందుకు వచ్చి ఆమె సంకల్పాన్ని నెరవేర్చాలి.

-శ్రీపాల్‌ రెడ్డి, ప్రశాంతి రెడ్డి, తల్లిదండ్రులు 


 పాఠశాలకు గర్వకారణం

సిరి రెడ్డి ప్రతిభను కండ్లారా చూశాం. ప్రతిష్టాత్మకమైన రాజ్‌భవన్‌ పాఠశాల కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటుతున్న సిరి రెడ్డి మా విద్యార్థిని అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఆమెకు సహకరించేందుకు మా వంతు కృషి చేస్తాం.

-మంజులత, ప్రైమరీ ప్రిన్సిపాల్‌ రాజ్‌భవన్‌ హైస్కూల్‌


logo
>>>>>>