మంగళవారం 31 మార్చి 2020
Hyderabad - Mar 07, 2020 , 06:06:39

బడ్జెట్‌పై బల్దియా ఆశలు

బడ్జెట్‌పై బల్దియా ఆశలు
  • నిధుల కోసం భారీ ప్రతిపాదనలు
  • గృహ నిర్మాణానికి అధికంగా ఇవ్వాలని వినతి

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  రాష్ట్ర బడ్జెట్‌లో నిధులకోసం జీహెచ్‌ఎంసీ భారీగా ప్రతిపాదనలు పంపింది. ముఖ్యంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకానికి అధికంగా నిధులు ఇవ్వాలని కోరింది. దీంతోపాటు ఎస్‌ఆర్‌డీపీ, రోడ్ల అభివృద్ధి తదితర పనులకోసం గణనీయంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేసింది. ముఖ్యంగా రానున్న రోజుల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధ్దిదారులకు కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్న అధికారులు, తుదిదశకు చేరుకున్న గృహాలను పూర్తిచేసేందుకు నిధులు కేటాయించాలని కోరారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి అయిన 55075 ఇళ్లను దశలవారీగా పంపిణీ చేయాలని నిశ్చయించారు. మిగిలినవాటి నిర్మాణాన్ని గ్రేటర్‌ ఎన్నికలనాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  


రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో ఇందుకు అనుగుణంగా అధికారులు నిధులకోసం ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వానికి పంపారు.గ్రేటర్‌లోని పేదల కోసం ఒక లక్ష ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 55075 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో పురోగతిలో ఉంది. మొత్తం ప్రాజక్టు వ్యయం రూ. 9964.59కోట్లు కాగా, అందులో ఇప్పటికే రూ.  4450.00 కోట్లు ఖర్చు చేశారు. గత ఆగస్టు నుంచి  దాదాపు రూ. 990 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇండ్లను పూర్తిస్థాయిలో సిద్ధంచేసేందుకు రూ. 5514.59 కోట్లు అవసరం కాగా, వచ్చే రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్ర బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి రూ. 3500 కోట్లు కేటాయించే అవకాశముందని అధికారులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. ఇవికాకుండా చెరువుల అభివృద్ధికి రూ.300కోట్లు, రోడ్ల నిర్వహణకు రూ. 300 కోట్లు, వృత్తిపన్నులో వాటాకింద రూ. 300 కోట్లు, హరితహారం పథకానికి రూ. 25కోట్లు, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 350 కోట్లు, ప్రభుత్వ భవనాలపై ఆస్తిపన్ను ద్వారా రూ. 100 కోట్లు, వాహనపన్ను రూ. 75 కోట్లు, హెచ్‌ట్రీమ్స్‌ ప్రాజక్టు కింద రూ. 50 కోట్లు, ఆక్ట్రాయ్‌ పన్ను తదితర అన్నీ కలిపి మరో రూ. 1500 కోట్ల వరకు మంజూరుచేయాలని కోరారు.


logo
>>>>>>