సోమవారం 06 ఏప్రిల్ 2020
Hyderabad - Mar 07, 2020 , 05:56:02

జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ. 36,455 కోట్లు..

జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ. 36,455 కోట్లు..

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ :  రాబోయే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో భారీగా రుణాలిచ్చేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. 2020 -21 వార్షిక సంవత్సరానికి గాను రూ. 36,455 కోట్ల మేర రుణాలిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ శ్వేతా మహంతి అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌హాల్లో నిర్వహించారు. ఈమేరకు రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను జిల్లా స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులు ఆమోదించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలపై ఆరా తీసిన ఆమె బ్యాంకర్లు, సంక్షేమాధికారులు ఆలసత్వాన్ని వీడి సమన్వయంతో పనిచేసి, పేదలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చూడాలన్నారు. గ్రౌండింగ్‌ అయిన రుణాలకు సంబంధించి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను సమర్పించాలన్నారు. ముఖ్యంగా పింఛన్‌దారులు, దివ్యాంగులు బ్యాంకులకు వచ్చినప్పుడు వారితో సహృదయంతో వ్యవహరించాలన్నారు. వారికి కేటాయించిన వాటాను సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వివిధ సంక్షేమశాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా అందరూ కృషిచేయాలన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్‌ క్రైమ్‌ల దృష్ట్యా ప్రజల్లో ఆర్థిక లావాదేవిపై అవగాహన కల్పించాలని  ఈ సందర్భంగా కలెక్టర్‌ కోరారు. పలు ప్రాంతాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి, ప్రజలను జాగృతపరచాలన్నారు. బ్యాంక్‌లు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద మహిళా వసతిగృహాలను దత్తత తీసుకుని అవసరమైన సదుపాయాలను కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం శ్రీనివాస్‌, నాబార్డ్‌ అధికారి తపన్‌, ఆర్‌బీఐ ప్రతినిధి వెంకటేశ్‌, బీసీ సంక్షేమాధికారి విమలాదేవి, దివ్యాంగుల సంక్షేమశాఖాధికారి పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మాన్యానాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


logo