సోమవారం 30 మార్చి 2020
Hyderabad - Mar 06, 2020 , 01:17:42

పసివాడికి ప్రాణం పోశారు..

పసివాడికి ప్రాణం పోశారు..

ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ : అనారోగ్యంతో బాధపడుతున్న పసి బాలుడుకు అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణం పోశారు హైదరాబాద్‌ కొత్తపేటలోని పారమిత దవాఖాన వైద్యులు. ఈ శస్త్ర చికిత్సకు సుమారు రూ.15లక్షలు అవసరం ఉండడం.. పేద కుటుంబానికి చెందిన చిన్నారి కావడంతో ‘హీల్‌ ఏ చైల్డ్‌ ఫౌండేషన్‌' వారు రూ. రెండున్నర లక్షలు సమకూర్చగా, మిగతా ఖర్చును దవాఖాన వారే భరించి ఆ చిన్నారికి వైద్యాన్ని అందించారు. ఈ మేరకు 66 రోజులపాటు కృత్రిమ శ్యాసతో చికిత్స తీసుకున్న చిన్నారి గత నాలుగు రోజుల నుంచి స్వయంగా శ్వాస తీసుకుంటున్నాడు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో సదరు చిన్నారిని గురువారం డిశ్చార్జి చేశారు. చైతన్యపురిలో పారమిత దవాఖాన వైద్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పారమిత దవాఖాన కార్డియాక్‌ స్పెషలిస్టు డాక్టర్‌ నాగేశ్వర్‌రావు, డాక్టర్‌  శ్వేత, డాక్టర్‌ ధన్‌రాజ్‌, దవాఖాన డైరెక్టర్‌ సతీశ్‌, హీల్‌ ఏ ఫౌండేషన్‌ ప్రతినిధి ప్రమోద్‌ వివరాలు వెల్లడించారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన శోభ, సతీశ్‌ దంపతులు. ఈ నిరుపేద దంపతులకు బాబు జన్మించాడు. పుట్టిన సమయంలోనే నిమోనియా, పల్మనరీ హైపర్‌టెన్షన్‌ సమస్యతోపాటు గుండెలో రంధ్రం ఏర్పడి అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో బాబు తల్లిదండ్రులు కొత్తపేటలోని పారమిత దవాఖానకు తీసుకుని వచ్చారు. 


కాగా, జబ్బును గుర్తించిన డాక్టర్‌ సీనియర్‌ కార్డియక్‌ సర్జన్‌ నాగేశ్వర్‌రావు, డాక్టర్‌ శ్వేతతోపాటు డాక్టర్లు శ్రీనివాస్‌, ముర్కి, శ్రీరామ్‌ ఆధ్వర్యంలో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 21రోజులు, రెండున్నర కిలోలు ఉన్న బాబుకు గుండెలోని రంధ్రాన్ని ‘కోనార్‌ ఎంఎఫ్‌ డివైజ్‌'తో  పూడ్చి వేశారు. ఈ అరుదైన శస్త్ర చికిత్స చేసేందుకు తమ వద్ద సరైన పరికరాలు లేకపోవడంతో చిన్నారిని నగరంలోని రెయిన్‌బో హార్ట్‌కేర్‌ సెంటర్‌కు తరలించి అక్కడ బాలుడికి కోనార్‌ ఎంఎఫ్‌ డివైజ్‌ పరికరం అమర్చి చిన్న బటన్‌ ద్వారా గుండెలోని రంధ్రాన్ని మూసి వేశారు. పది రోజుల తర్వాత పారమిత దవాఖానకు తరలించి అక్కడ నెలరోజులపాటు చికిత్సలు జరిపించారు. సుమా రు 66రోజుల తర్వాత చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో గురువారం డిశ్చార్జి చేశారు. అతి ఖరీదైన ఈ వైద్యాన్ని పారమిత దవాఖాన యాజమాన్యం మానవతా దృక్పథంతో చిన్నారిని కాపాడి పునర్జన్మను ఇచ్చారు. చిన్నారికి పునర్జన్మను అందించిన డాక్టర్లకు బాబు తల్లిదండ్రులు సతీశ్‌, శోభ ధన్యవాదాలు తెలిపారు. 


logo